Oct 14,2023 07:10

          ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 111వ స్థానం లభించడం దేశంలో ప్రజల దీనస్థితికి అద్దం పడుతోంది. 121 దేశాలను పరిగణలోకి తీసుకొని గతేడాది ప్రకటించిన ఇదే జాబితాలో భారత్‌ 107వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు 125 దేశాలతో రూపొందించిన జాబితాలో భారత్‌ ర్యాంకు 111కు దిగజారడం ప్రజల జీవనోపాధుల క్షీణతను తేటతెల్లం చేస్తోంది. జర్మనీ, ఐర్లండ్‌ కేంద్రాలుగా పనిచేసే కన్సర్న్‌ వరల్డ్‌ వైడ్‌, వెల్ట్‌హంగర్‌హిల్ఫ్‌ అనే యూరోపియన్‌యూనియన్‌కు చెందిన స్వచ్చంధ సంస్థలు ఉమ్మడి కార్యాచరణతో గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (జిహెచ్‌ఐ) నివేదికను ప్రతి యేటా విడుదల చేస్తూ వస్తున్నాయి. ప్రపంచంలో ఆకలితో అలమటించి ఎవ్వరూ చనిపోరాదని, ఇలాంటి నివేదికలు రూపొందిస్తే సంబంధిత ప్రభుత్వాధినేతలు ప్రజల తిండిపై శ్రద్ధపెట్టి తగిన చర్యలు తీసుకునేలా చూడొచ్చని ఆ సంస్థలు భావించాయి. ఈ నివేదికల లక్ష్యం. పోషకాహారలోపం, శిశువుల్లో తీవ్ర పోషకాహారలోపం, వయస్సుకు తగిన ఎత్తులేకపోవడం, శిశు మరణాల రేటు అనే నాలుగు సూచికల ఆధారంగా జిహెచ్‌ఐని కొలుస్తారు. జిహెచ్‌ఐలో 100 పాయింట్లు ఉంటాయి. ఈ పాయింట్ల ఆధారంగానే దేశాల ఆకలి తీవ్రత స్థాయిని లెక్కగడతారు.
           ఆకలి సూచిలో మన ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల కన్నా వెనుకబడి ఉన్నాం. ఇదీ మన విశ్వగురు ఘనత. ప్రపంచ బాలల్లో అత్యధికంగా భారత్‌లోనే 18.7 శాతం తక్కువ బరువు ఉన్న పిల్లలున్నారని ఆహార సూచీ కుండబద్దలు కొట్టింది. దేశంలో పోషకాహార లోపం 16.6 శాతం ఉండగా, ఐదేళ్ల లోపు పిల్లల్లో మరణాలు 3.1 శాతం, అలాగే యుక్తవయస్సు 15-24 ఏళ్ల మహిళల్లో రక్త హీనత 58.1 శాతం ఉన్నట్లు నివేదించారు. అయితే లోపభూయిష్టమైన 'ఆకలి' కొలమానాల్లో దీన్ని రూపొందించారంటూ గతేడాదిలాగే ఈ దఫా కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రత్యామ్నాయ మీడియా గొంతు నులుముతున్న మోడీ సర్కార్‌కు వాస్తవాలు ఒంటబట్టకపోవడంలో ఆశ్చర్యమేముంది. కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ సైతం ఈ వాస్తవాలను గుర్తించేందుకు సాహసించలేకపోతోంది. దేశంలో పోషకాలతో కూడిన ఆహారం అందడం లేదని, ఆహార పదార్థాల్లో పోషకాలు జత చేసి (దీనినే ఫోర్టిఫైడ్‌ అంటారు. ఫోర్టిఫైడ్‌ బియ్యం అంటే ఇవే) సార్వత్రిక ప్రజా పంపిణీ (పిడిఎస్‌) దుకాణాల ద్వారా ప్రజలందరికీ తప్పనిసరిగా అందేలా చూడాలని మోడీ సర్కార్‌ మానస పుత్రిక నీతి అయోగ్‌ సైతం ఇదివరకే నివేదించింది. బిజెపి ప్రభుత్వం మాత్రం పిడిఎస్‌కు బడ్జెట్‌లో నిధులు తెగ్గోసి మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేస్తోంది. కోవిడ్‌ సంక్షోభం నుంచి ప్రజలు ఇంకా తేరుకోకున్నా...నాటి విపత్తు సమయంలో ఇచ్చిన తిండిగింజలకు సైతం పూర్తిగా కోత పెట్టేసింది. గ్రామీణ భారతావనిలో నిరుపేదలకు బతుకు భరోసా కల్పించిన ఉపాధి హామీ పథకంపైనా ఉరితాడు వేలాడదీస్తోంది. అటు నిధులకు కోత పెట్టడమే కాకుండా క్షేత్రస్థాయిలో డిజిటల్‌ ఆంక్షలు పెడుతూ నిత్యం లబ్దిదారుల సంఖ్యను కుదిస్తూవస్తోంది.
          జాతీయత గురించి, దేశభక్తి గురించి నయవంచక నినాదాలతో మభ్యపెట్టే మోడీ సర్కార్‌ ఇప్పటికైనా నిజమైన దేశభక్తి అంటే ఏమిటో, దేశమంటే ఏమిటో గుర్తెరగాలి. 'దేశమును ప్రేమించుమన్నా..మంచి యన్నది పెంచుమన్నా'..అని గొంతెత్తి దేశభక్తి జ్యోతిని రగిలించిన మహాకవి గురజాడ వేంకట అప్పారావు అదే గేయంలోనే 'దేశమంటే మట్టికాదోరు..మనుషులోరు' అని నినదించి..మట్టి కంటే మానవత్వానికి విలువనివ్వాలని ఉద్ఘాటించారు. ఆకలి, దప్పులతో అలమటిస్తూ జీవచ్ఛవంలా బతుకెళ్లదీసే బక్కచిక్కిన శరీరాలుంటే మనిషిగా పరిగణించలేమని పోషకాహార అవసరాన్ని, పాడి పంటల ప్రగతిని ఆకాంక్షించారు. 'తిండి కలిగితే కండ కలుగును..కండ కలవాడేను మనిషోయి' అని నిర్వచించి స్వతంత్ర భారతావని అస్సలు లక్ష్యాలను ఆ మహనీయుడు ఆ నాడే నిర్దేశించారు. అజాదీ అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్న 77 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఆకలి గురించి ఆందోళన స్థితిలో ఉన్నామంటే దానికి కారణం పాలకులే. బడా పెట్టుబడిదారులకు సర్వ సంపదలు దోచిపెడుతూ, నింగినేలా ప్రయివేటీకరిస్తూ సామాన్యులపై పెనుభారాలు మోపుతున్న ప్రభుత్వాల నయా ఉదారవాద విధానాలు రెండు భారతాలను సృష్టిస్తున్నాయి. ఒకటి సంపన్నులు వెలుగుతున్న భారతం, కాగా రెండోది పేదలు నలిగిపోతున్న భారతం.వీటన్నిటికి మూలమైన ఈ వినాశకర విధానాలను తిప్పికొట్టి ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తెచ్చినప్పుడే సామాన్యుడికి తిండి దక్కేది.