Oct 14,2023 10:41

న్యూఢిల్లీ : తీవ్రవాదం ఎక్కడ చోటు చేసుకున్నా, ఏ కారణంతో జరిగినా అది మానవాళికి, మానవత్వానికి విరుద్ధమైనదేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇక్కడ యశోభూమి కన్వెన్షన్‌ సెంటర్‌లో జి 20 పార్లమెంటరీ స్పీకర్స్‌ 9వ సదస్సును మోడీ ప్రారంభించారు. జి 20 దేశాల పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు ప్రారంభ సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ, ఐక్యరాజ్య సమితిలో కూడా ఉగ్రవాదానికి నిర్వచనంపై ఏకాభిప్రాయం లేదన్నారు. ఈనాడు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సంఘర్షణలు, అల్లర్లతో ఏ ఒక్కరికీ ప్రయోజనం చేకూరదని ఆయన హెచ్చరించారు. మానవ సంక్షేమమే లక్ష్యంగా ప్రపంచం ముందుకు సాగాల్సి వుందన్నారు. ప్రపంచ దేశాల విశ్వాసం పొందే మార్గంలో గల అడ్డంకులన్నింటినీ మనం తొలగించాల్సి వుందన్నారు. శాంతి, సోదర భావంతో మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇజ్రాయిల్‌, పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతున్న వేళ ప్రధాని వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఈ యుద్ధంలో ఇరు పక్షాలవైపు 2800మంది మరణించారు. 4,23,000మందికి పైగా నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన తీవ్రవాద దాడిని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సీమాంతర తీవ్రవాదంతో భారత్‌ సుదీర్ఘకాలంగా పోరాడుతోందన్నారు. పార్లమెంట్‌ సభ్యులను బందీలుగా చేసేందుకు తీవ్రవాదులు కుట్ర పన్నారని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, సార్వత్రిక ఎన్నికలనేవి భారత్‌లో పెద్ద పండగ అని వ్యాఖ్యానించారు. వంద కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల ప్రక్రియను చూసేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానని ఆయన ప్రతినిధులను కోరారు.