
పండగొచ్చిదంటే చాలు, ఎక్కడలేని ఖర్చు మీదపడిపోతుందని సామాన్యులు బెంబేలెత్తిపోతారు. ఒకప్పుడైతే కొత్త బట్టలు, పిండివంటలు ఉండేవి. మరి ఇప్పుడో.. బట్టలు, నగలతో పాటు కొత్త టీవీ, కొత్త ఫ్రిజ్, వాషింగ్‌మెషిన్.. వీటన్నింటికంటే ముందు కొత్త కొత్త ఫీచర్లు ఉన్న మొబైల్ ఫోన్లు జాబితాలో వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో ఒకసారి గడిచిన నాలుగేళ్ల నుండి గమనిస్తే, ఈ ఏడాది పండగకి ఒకింత ప్రత్యేకత ఉంది. 2019 చివర నుండి 2021 చివరి వరకు కరోనా భూతంతో హడలెత్తిపోయిన జనం పండగల జోలికే వెళ్లలేదు. దీంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లు వెలవెలబోయాయి. బతికుంటే బలుసాకైనా తినొచ్చు అనే ధోరణిలో ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమంటూ జీవించారు. ఇప్పుడు పరిస్థితి మారింది. తాజా నివేదిక ప్రకారం ఈసారి పండక్కి మన భారతీయులు ఎక్కువే ఖర్చుపెడుతున్నారు. ఈ సంవత్సరం గతేడాది కంటే 2.5 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నామని నివేదిక తేల్చి చెప్పింది. అంతేకాదు, ఏఏ పద్ధతుల్లో ఎంతమంది ఖర్చు పెడుతున్నారో కూడా లెక్కలు వేసింది. అవేంటో ఒకసారి చూద్దామా..
సోషల్‌మీడియాలో సంక్షిప్త సమాచారం అందించే భారతీయ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లైన మోజ్, షేర్‌చాట్ అందించిన సమాచారం ప్రకారం భారతీయుల్లో 47 శాతం మంది జనాభా ఈ ఏడాది రూ.10 వేలకు పైగా పండగ ఖర్చు పెడుతున్నారు. ఇక దాదాపు సగం జనాభా అంటే 48 శాతం ప్రజలు రూ.10 వేల నుండి రూ.20 వేలు, అంతకంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నారు.
వేటికి ఖర్చు చేస్తున్నారంటే..
పండగ ఖర్చుల్లో ముఖ్యంగా మూడు విభాగాల్లో ఖర్చు ఎక్కువ పెడుతున్నారని నివేదికలో పేర్కొన్నారు. ప్రముఖ కొనుగోళ్లు.. దుస్తులు, ఫోన్ల విక్రయాలతో పాటు గృహపునర్నిర్మాణానికి కూడా ఈసారి ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. ఈ ఖర్చు కోసం 66 శాతం మంది తమ నిధులను వినియోగిస్తున్నారు. 59 శాతం మంది వినియోగదారుల్లో ముఖ్యంగా 26 నుండి 35 ఏళ్ల మధ్య వారు ప్రముఖ బ్రాండింగ్ వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ నివేదిక 2,355 మంది సభ్యుల ప్రత్యక్ష సమాచారం ఆధారంగా తయారుచేశారు. 20 నుండి 50 ఏళ్ల మధ్య ఇందులో పాల్గొన్నారు. సర్వేలో పాల్లొన్న వారిలో 19 శాతం మంది పండక్కి కొత్త టీవీ కొనుక్కోవాలని ఆశపడ్డారు. 18 శాతం మంది వాషింగ్‌మెషిన్ వైపు మొగ్గు చూపారు. కొత్త మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల్లో 44 శాతం మంది మెరుగైన కెమెరా కోసం కొంటున్నారు. 34 శాతం మంది సాంకేతికతను అందిపుచ్చుకోవాలని చెబుతూ 5జిని ఎంచుకున్నట్లు నివేదిక తేల్చింది.
ఇదండీ సంగతి.. వీళ్లల్లో మీరు ఎక్కడ ఉన్నారో వెతుక్కోకండి.. ఏం కొనాలో ఆలోచించకండి.. ఆదాయాలు కుదుటపడి ఇప్పుడిప్పుడే సగటు మనిషి కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. హంగులు, ఆర్భాటాలకు పోయి, మార్కెట్ ప్రలోభాలకు లోబడి జేబు ఖాళీ చేసుకోకండి. పండగ రోజున ఎంచక్కా కుటుంబంతో కలసి ఎంజారు చేయండి చాలు..