Oct 14,2023 10:48

న్యూఢిల్లీ : హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే 'ఆపరేషన్‌ అజరు' ప్రారంభమైంది. ఇందులో భాగంగా 212 మంది భారతీయులతో టెల్‌ అవీవ్‌ నుంచి బయలుదేరిన తొలి బ్యాచ్‌ ప్రత్యేక విమానం శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంది. స్వదేశం చేరుకున్న భారతీయులకు కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. వచ్చిన వారిలో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. 'ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌' ఆధారంగా వీరిని స్వదేశానికి తీసుకొచ్చారు. 'ఇజ్రాయిల్‌లో సాధారణ పరిస్థితులు లేవు. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. మేం బయల్దేరే సమయంలో కూడా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఆ సైరన్ల మోత ఇంకా మా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఆ భయానక పరిస్థితులను వర్ణించలేం' అని స్వదేశానికి వచ్చిన భారతీయులు తెలిపారు. కాగా, భారత రాయబార కార్యాలయం వివరాల ప్రకారం ఇజ్రాయిల్‌లో దాదాపు 18వేల మంది భారతీయులున్నారు. వారిలో దాదాపు 14వేల మంది కేర్‌టేకర్లే. వీరితోపాటు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వజ్రాల వ్యాపారులు తదితరులున్నారు. వీరిని వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం 'ఆపరేషన్‌ అజరు' ప్రారంభించింది. వీరి ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది.
 

                                                       క్షేమంగా తిరిగొచ్చిన 10 మంది రాష్ట్ర వాసులు

'అపరేషన్‌ అజయ్' ద్వారా శుక్రవారం స్వదేశానికి చేరుకున్న భారతీయుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన 10 మంది ఉన్నారని ఎపిఎన్‌ఆర్‌టిఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్వదేశానికి రావాలనుకునే వారు రాయబార కార్యాలయంలో వారి వివరాలను హెల్ప్‌లైన్‌ డెస్క్‌ నెంబరు ప్లస్‌ 972 35226748కి ఫోన్‌ చేసి తెలిపింది.
               ఢిల్లీకి రానున్న వారి ప్రయాణఖర్చులు భరించలేని విద్యార్ధులు, ఇతర వలసదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున విమాన చార్జీలు పెట్టి వారిని రాష్ట్రానికి పంపాలని ఢిల్లీలోని ఎపి రెసిడెంట్‌ భవన్‌ అధికారులకు సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

                                                                             ప్రత్యేక హెల్ప్‌ లైన్‌

ఇజ్రాయిల్‌లో భారత పౌరులు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేసింది. ఎపిఎన్‌ఆర్‌టిఎస్‌ 24/7 హెల్ప్‌లైన్‌ నెంబర్లు ప్లస్‌ 918500027678 (వాట్సాప్‌), 0863 2340678ను సంప్రదించాలని పేర్కొన్నారు. అదే విధంగా కుటుంబ సభ్యులు,మిత్రులు ఎవరైనా ఇజ్రాయిల్‌లో ఉంటే ఎపిఎన్‌ఆర్‌టిఎస్‌ 24/7 హెల్ప్‌లైన్‌ నంబర్లను సంప్రదించి వివరాలు తెలపాలని కోరారు.