
చంద్రయాన్-3 విజయం చారిత్రాత్మకం. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా కాలుమోపడం ద్వారా అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకను సమున్నతంగా ఎగరవేసింది. అకుంఠిత దీక్షతో ఈ విజయాన్ని చేకూర్చిన ఇస్రో శాస్తవేత్తలకు జేజేలు! విక్రమ్ ల్యాండర్ సేఫ్‌గా ల్యాండ్ కావడంతో పాటు ప్రజ్ఞాన్ రోవర్ దాని నుండి బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై అన్వేషణ ప్రారంభించడం, ఫోటోలను కూడా పంపుతుండటంతో ఈ ప్రయోగం నూటికి నూరుపాళ్లు విజయవంతమైనట్టే! ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఈ విజయం ఎట్టకేలకు లభించడంతో దేశమంతటా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శాస్త్ర, సాంకేతిక రంగాలను, పరిశోధనలను నిరుత్సాహపరుస్తూ, సమాజాన్ని తప్పుదోవ పట్టించే యత్నాలు జరుగుతున్న సమయంలో ఈ విజయం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగేళ్ల కిందట చంద్రయాన్-2 చివరిక్షణాల్లో విఫలమైంది. ఆ వైఫల్యం నుంచి పాఠాలు తీసుకుని ఇస్రో ఈ అద్భుతం సాధించింది. తద్వారా ప్రపంచ దృష్టిని విశేషంగా ఆకర్షించింది. 40 ఏళ్ల విరామం తరువాత రష్యా ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపిన స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. దీంతో చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద విక్రమ్ ల్యాండర్ నిర్దేశించిన సమయానికి, నిర్దిష్ట ప్రదేశంలో సురక్షితంగా దిగేలా చేయడంలో ఇస్రో తిరుగులేని విజయం సాధించింది. 1960వ దశకంలో సైకిల్‌పైనా, ఎడ్లబండిపైనా రాకెట్లను తరలించే దశ నుండి చంద్రుడిపై సగర్వంగా కాలుపెట్టిన ప్రస్తుత ఘనత వెనక ఈ సంస్థ వ్యవస్థాపకుడైన విక్రమ్ సారాభాయి దూరదృష్టి, 60 ఏళ్ల శాస్త్రవేత్తల నిర్విరామ కృషి దాగి ఉంది. చంద్రయాన్ సూపర్ సక్సెస్ అవడంతో ఇస్రో ఇప్పుడు ఆదిత్య ఎల్1, మంగళ్‌యాన్-2, గగన్‌యాన్, శుక్రయాన్ వంటివాటిపై దృష్టి సారించింది.
అంతరిక్ష ప్రయోగాల సాఫల్యత అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాటిలో అంతర్జాతీయ సంబంధాలు, పరిణామాలు కూడా అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. మన దేశం అంతరిక్షంవైపు తొలి అడుగులు వేసిన సమయంలో అప్పటి సోవియట్ యూనియన్ అందించిన సహకారం వెలకట్టలేనిది. ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం నెలకొన్న ఆ రోజుల్లో అమెరికా, సోవియట్‌ల మధ్య పోటాపోటీ నెలకొని ఉండేది. సాంకేతిక పరిజ్ఞానం మనకు అందకుండా అమెరికా మనపై ఆంక్షలు విధిస్తే, సోవియట్ యూనియన్ మనకు టెక్నాలజీ అందించడమే కాక, వాటిని తిరిగి తయారుచేసుకునేందుకు అనుమతించింది. ఆ విధంగా మొదట ఎస్‌ఎల్‌వి, ఆ తరువాత ఎఎస్‌ఎల్‌వి, పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌విని దేశీయంగా రూపొందించుకునే సామర్ధ్యాన్ని ఇస్రో సంపాదించుకుని నేడు ఈ స్థితికి వచ్చింది. సోవియట్ యూనియన్ పతనం తరువాత మన దేశం అమెరికా వైపు క్రమైణా మొగ్గు చూపుతున్నది. మరోవైపు చైనా స్వతంత్రంగా అంతరిక్ష రంగంలో ప్రబల శక్తిగా ఎదుగుతూ అమెరికాకు దీటుగా నిలిచింది. అంతరిక్ష పరిశోధనపై పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ అమెరికా ఐఎస్‌ఎస్‌తో సమంగా టియంగాంగ్ పేరిట సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 2021లో రష్యా, చైనా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అంతరిక్షంలో చేసే ప్రయోగాలతో పాటు, చంద్రుని ఉపరితలంపై స్థావరాన్ని ఏర్పాటు చేసే అంశంలోనూ ఈ రెండు దేశాలు భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. లూనా-25 ల్యాండర్ విఫలమైనప్పటికీ రష్యా ఇప్పటికీ రోదసీ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో బలమైన శక్తిగా ఉంది.
ఈ పరిస్థితుల్లో భారత్ అంతరిక్ష పరిశోధనలకు ఇతోధికంగా నిధులు వెచ్చించడానికి బదులు, ఈ రంగంలో స్వావలంబనకు విఘాతం కలిగించేలా ప్రైవేటీకరణను ప్రోత్సహించడం దారుణం. చైనాతో భారత్‌కు అంతంతమాత్రంగా ఉన్న సంబంధాల ప్రభావం రష్యాపై కూడా పడుతోంది. రక్షణ, అంతరిక్ష రంగాల్లో రష్యాతో మన సంబంధాలు బలహీన పడుతున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఇది మన దేశ దీర్ఘకాల ప్రయోజనాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అంతరిక్ష రంగంలో పూర్తి స్వావలంబన సాధించాలంటే దేశీయంగా అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే మార్గం. చంద్రయాన్-3 చరిత్రాత్మక విజయం ఇస్తున్న సందేశమూ ఇదే !