Nov 12,2023 15:21

శివపురం అనే గ్రామంలో సైదాచారి అనే వడ్రంగి ఉండేవారు. ఊరి చివరి వీధిలో నివాసముంటూ ఎవరికి కావల్సిన వస్తువులను వారికి చేసి, ఇస్తూ జీవనం గడుపుతున్నాడు.
వీధి అరుగుపై కార్ఖానా పెట్టి, చెక్క వస్తువులను తయారుచేస్తాడు.
పని నేర్చుకోవడానికి వచ్చిన శిష్యులు కూడా అతని వద్ద పనిచేస్తున్నారు.
తన నివాసానికి దూరంగా ఉన్న ఒక చెట్టు కింద ఒక పాముల పుట్ట ఉంది. ఆ పుట్టలో ఆగ్రహుడు అనే త్రాచుపాము తన కుటుంబంతో నివసిస్తుంది. ఆగ్రహునికి కోపం ఎక్కువ. తన పిల్లలపైన భార్యపైన తరచూ చిరాకు పడుతూ కోపగించుకుంటూ ఉండేవాడు. ఆగ్రహుని భార్య 'ఎందుకండీ అంతకోపం? కాస్త శాంతంగా ఆలోచించండి! కోపం నష్టాన్ని చేకూరుస్తుంది' అని చెబుతున్నప్పటికీ ఆ మాటలను పెడచెవిన పెట్టేవాడు.
ప్రతి రోజూ పుట్ట బయటకు వచ్చి ఆహార వేటకు వెళ్లి, సాయంత్రం వేళలో ఇంటికి చేరుకునేవాడు. ఒక్కోసారి చుట్టుపక్కల ఇళ్లల్లోకి వెళ్లి ఎలుకలను, కప్పలను పట్టి తింటూ ఉండేవాడు.
ఒక రోజు వర్షం పడుతుంది. ఉదయమే పుట్ట బయటకు వచ్చి చూశాడు. కానీ వర్షం పడుతుండడంతో లోపలికి వెళ్లిపోయాడు. తరచూ వచ్చి చూస్తూ లోపలికి వెళుతుండేవాడు.
సైదాచారి ప్రతీరోజూలాగే తన పనిని చేసుకుంటున్నాడు. వర్షం తగ్గుముఖం పట్టింది. మధ్యాహ్న సమయం కావడంతో తన పనిముట్లను అలాగే వదిలి, శిష్యులను భోజనానికి వెళ్లమని ఆదేశించాడు. తాను కూడా పక్క గ్రామంలో ఉన్న తన చెల్లెలి ఇంటికి వెళ్లి వస్తానని, వెంటనే తిరిగి వస్తానని చెప్పి మోటారుసైకిలుపై ప్రయాణం సాగించాడు. వర్షపు నీటికి కప్పలు బెక బెకలాడుతూ బయటకు చేరి సైదాచారి ఇంటి అరుగుపై అటూ ఇటూ గెంతుతున్నాయి.
పుట్టలోని ఆగ్రహుడు వర్షం తగ్గుముఖం పట్టిందని గ్రహించి బయటకు వచ్చాడు. కప్పల వాసన గ్రహించి, ఏ అలికిడీ లేకపోవడంతో మెల్లగా వడ్రంగి ఇంటి అరుగుమీదకు కప్పలను పట్టడానికి చేరుకున్నాడు. పనిముట్లు అక్కడే ఉన్నప్పటికి ఓ కప్ప పాముని గ్రహించి, తప్పించుకుంటూ అటు ఇటు పరుగులు పెడుతుంది. దానిని ఆగ్రహుడు వెంటాడుతున్నాడు. అలా వెంటాడుతుంటే దారిలో అడ్డుగా రంపం తగిలింది. రంపం ముళ్లు ఆగ్రహుని మూతికి గీరుకోగా ఆగ్రహుడు కోపంతో చిర్రు బుర్రులాడుతూ సర్రున లేచి రంపం ముళ్లను గట్టిగా కాటు వేశాడు. ఆ ముళ్లు ఆగ్రహుని మూతిని ఇంకా గాయం చేశాయి. కోరలు ఊడిపోయాయి. కోపంతో రగిలిపోయి, అగ్రహుకుడు తనను గాయం చేసిన రంపానికి బుద్ధి చెప్పాలని రంపాన్ని తన శరీరంతో చుట్టేశాడు. దాని శరీరం రంపానికి చుట్టుకొనడంతో రంపం ముళ్లన్నీ శరీరానికి గుచ్చుకున్నాయి. రక్తమోడుతూ బాధను భరించలేక, అక్కడికక్కడే ప్రాణాలను విడిచాడు.
కోపం ప్రదర్శించకుండా శాంతంగా ఆలోచించి ఉంటే, అది కదలలేని వస్తువని గ్రహించగలిగేవాడు. ప్రాణాలు నిలిచేవి. అందుకే అంటారు తన కోపమె తన శత్రువని.. కోపం వచ్చినపుడు శాంతంగా ఆలోచించే జ్ఞానాన్ని సంపాదించాలని పెద్దలు చెబుతుంటారు. ఆ మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించకపోతే భారీ నష్టాన్ని చవి చూడక తప్పదు.

His-anger-is-his-enemy.

ఎస్‌.సాత్విక్‌ సాయి కుమారాచార్యులు

9వ తరగతి,సూర్యస్కూల్‌
అశ్వారావుపేటా507301
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
9491357842