Sep 17,2023 08:14
  • గల్ఫ్‌ దేశాల వైపు భారతీయుల చూపు
  • 2020లో యుఎఇకి అధికం
  • తర్వాత స్థానాల్లో యుఎస్‌, సౌదీలు


న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ పాలనలో భారత్‌ నుంచి ఇతర దేశాలకు ఏటికేడు వలసలు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు పలు సందర్భాలలో వెల్లడించాయి. ఇక్కడ నుంచి వెళ్లి ఇతర దేశాల్లో బతుకుతున్న భారతీయుల సంఖ్య ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే అధికంగా ఉన్నది. తాజాగా 'వరల్డ్‌ మైగ్రేషన్‌ రిపోర్ట్‌ 2022'లో ప్రచురించబడిన ఐక్యరాజ్య సమితి (యుఎన్‌) సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది.
 

                                                          1.79 కోట్ల మంది భారతీయుల వలస..!

యుఎన్‌ తాజా డేటా ప్రకారం.. 2020లో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ మంది భారత్‌ నుంచి విదేశాల్లో నివసిస్తున్నారు. దేశంలో జన్మించిన 1.79 కోట్ల మంది ఈ సంవత్సరం మధ్య నాటికి విదేశాల్లో నివసిస్తున్నట్టు తేలింది. రెండో స్థానంలో మెక్సికో (1.12 కోట్ల మంది), మూడో స్థానంలో రష్యా (1.08 కోట్లు)లు ఉన్నాయి. కెనడా (1.05 కోట్లు), సిరియా(85 లక్షలు), బంగ్లాదేశ్‌ (74 లక్షలు), పాకిస్థాన్‌ (63 లక్షలు), ఉక్రెయిన్‌ (61 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
 

                                                      20 ఏళ్ల తర్వాత మారిన రష్యా, భారత్‌ స్థానాలు

2000 ఏడాదిలో 1.07 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, 79 లక్షలతో భారత్‌ మూడో స్థానంలో ఉన్నది. 96 లక్షలతో మెక్సికో అప్పుడు కూడా రెండో స్థానంలో ఉన్నది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత, అంటే 2020లో ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా అధిక పెరుగుదలను నమోదు చేసి భారత్‌ మొదటి స్థానంలో ఉన్నది. ఇక అతిస్వల్ప పెరుగుదలను నమోదు చేసిన రష్యా మూడో స్థానంలో ఉండటం గమనించాల్సిన అంశం.
 

                                         యుఎఇకి భారతీయులు అధికం.. తర్వాతి స్థానాల్లో యుఎస్‌, సౌదీ

భారతీయులు పునరావాసం పొందుతున్న దేశాల పరంగా, సమీపంలోని గల్ఫ్‌ దేశాలు ప్రత్యేకించి అత్యధిక ర్యాంక్‌ను కలిగి ఉన్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ) అనుకూలమైన ప్రదేశం (2020లో 34,71,300 మంది భారతీయ వలసదారులు)గా ఉన్నది. సౌదీ అరేబియా (25,02,337 మంది భారతీయులు) మూడో స్థానంలో నిలిచింది. అక్కడ ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటం దీనికి కారణం. యునైటెడ్‌ స్టేట్స్‌ (27,23,764 మంది భారతీయులు) కూడా లక్షల మంది ప్రజలను ఆకర్షించి రెండవ స్థానంలో ఉన్నది. 2020లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 28.1 కోట్ల మంది అంతర్జాతీయ వలసదారులు నమోదయ్యారు. ఇది 2000లో 17.3 కోట్లుగా, 2010లో 22.1 కోట్లుగా ఉన్నది.
 

                                                         'మోడీ వచ్చిన తర్వాత పెరిగిన వలసలు'

వలసలకు కారణం విద్య, ఉపాధి, మెరుగైన జీవనం వంటివి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెప్తున్నారు. భారత్‌లో కంటే ఇతర దేశాల్లో ఈ సదుపాయాలు మెరుగ్గా ఉన్న కారణంగానే మనవారు విదేశాల వైపు చూస్తున్నారని అంటున్నారు. మోడీ హయాంలో దేశంలో మెరుగైన సౌకర్యాలే ఉంటే వలసలు ఎందుకు పెరుగుతాయని విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఎన్‌డిఎ పాలనలోనే ఈ వలసలు అధికంగా ఉన్నాయనీ, ఇందుకు పైన పేర్కొన్న యుఎన్‌ గణాంకాలే నిదర్శనమని తెలిపారు. ఇప్పటికైనా దేశంలోని యువతను భావోద్వేగ అంశాల వైపునకు మళ్లించకుండా, వారి శక్తిని, ఆలోచనను దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా తీర్చి దిద్దాలని కేంద్రానికి మేధావులు, సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.