Sep 29,2023 19:59

గర్భవతిగా ఉన్న సమయంలో దసరా సినిమా కోసం వర్షంలో రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొనటంతో తాను ఎంతో ఇబ్బంది పడ్డానని నటి పూర్ణ (షమ్నా కాసిమ్‌) అన్నారు. ఇటీవల ఆమె మగబిడ్డకు జన్మ నిచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, 'దసరా సినిమా లో చాలా సన్నివేశాలు రాత్రివేళల్లోనే షూటింగ్‌ జరిగాయి. రెండు రాత్రులు వర్షంలోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో రాత్రి చాలా చలిగా ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డాను. చాలా చల్లగా ఉన్న నీళ్లు తీసుకోవడం మరింత సమస్యలు తెచ్చిపెట్టింది. ఆ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమైంది. అంత కష్టపడ్డా సినిమాలో నేను నటించిన కొన్ని సన్నివేశాలు తొలగించారు' అని పేర్కొంది. 'మరో సన్నివేశం కోసం రాత్రిపూట నిర్మానుష్యమైన రోడ్డులో పరుగెత్తాల్సి వచ్చింది. అప్పుడు వీధి కుక్కల అరుపులు విని భయపడ్డాను. అదృష్టవశాత్తూ అవి నన్ను కరువలేదు. ఆ సన్నివేశంలో కాళ్లకు చెప్పులు కూడా లేవు. చిత్రమేకర్స్‌ అన్ని విధాలుగా సహకరించారు. వారి సాయంతోనే గర్భవతిగా ఉన్న నేను సురక్షితంగా సినిమా పూర్తి చేశా'నని పూర్ణ వివరించారు.