Aug 30,2023 07:12

            ''పాపం పుణ్యం ప్రపంచమార్గం/ కష్టం సౌఖ్యం శ్లేషార్థాలూ/ ఏమీ ఎరుగని పూవుల్లారా, అయిదారేడుల పాపల్లారా!'' అని మహాకవి శ్రీశ్రీ ప్రస్తావించిన అమాయక చూపుల పసివాళ్లే వాళ్లంతా! ఉపాధ్యాయులు ఏది చెబితే అది మనసుకు ఎక్కించుకునే స్వచ్ఛమైన తెల్ల కాగితాల్లాంటి మనసులు వాళ్లవి. అలాంటి చిన్నారులకు మంచి విద్యాబుద్ధులు నేర్పి, రేపటికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దటం పాఠశాలల ప్రాథమిక విధి. కానీ, బిజెపి ఏలుబడిలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో తరచూ విద్యావనాలు విషవలయాలుగా వార్తలకెక్కుతున్నాయి. పిల్లల మధ్య సమానత్వం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా పాటలూ, పాఠాలూ వల్లె వేయించాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు వక్రరీతిన వివక్షా బీజాలు నాటుతున్నారు. చెట్టపట్టాలు పట్టుకొని సమైక్య గీతాలు పాడుకోవాల్సిన పిల్లల మధ్య కుల, మత ఉన్మాదాలను జొప్పిస్తున్నారు. యు.పి లోని ముజఫర్‌నగర్‌ లోని ఖుబ్బాపూర్‌లో నేహా పబ్లిక్‌ పాఠశాలలో తాజాగా ఇలాంటి లజ్జాకరమైన సంఘటన చోటు చేసుకోవడం దేశాన్ని నివ్వెరపరిచింది. ఎక్కాలు సరిగ్గా అప్పగించలేదని రెండో తరగతిలో ఓ ముస్లిం బాలుడిని తోటి హిందూ బాలురతో రెచ్చగొట్టి మరీ కొట్టించిన ఉపాధ్యాయిని త్రిప్తా త్యాగి దుష్క ృత్యం క్షమించరానిది. పదే పదే కొట్టించటం ఒక్కటే కాదు; ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ముస్లిం పిల్లలు బాగా చదవరని, వారి తల్లులు అసలు పట్టించుకోరని ఇష్టారీతిన ఆమె వ్యాఖ్యానించటం- పిల్లల హృదయాల్లో మత వివక్షను నాటడమే అవుతుంది.
            ఇది ఈ ఒక్క పాఠశాలకే, ఈ ఒక్క ఉపాధ్యాయినికే పరిమితమైన సంఘటనగా చూడలేము. యు.పి విద్యాసంస్థల్లో అనేక సందర్భాల్లో, అనేక రూపాల్లో ఇలాంటి వివక్షాపూరిత ఆచరణలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఎన్‌.ఆర్‌.సి ఆందోళనల సమయంలో ఓ స్కూల్లో జరిగిన సాంస్క ృతిక కార్యక్రమంలో- నాటిక ప్రదర్శించిన చిన్నారి మీద, ఆమె తల్లి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసు బనాయించింది. ఆ తల్లిని జైల్లోకి నెట్టింది. చాలా పాఠశాలల్లో ఛత్రపతి శివాజీ ఏకపాత్ర, నాటికల పేరిట ముస్లిం వ్యతిరేక భావాలు బలంగా ప్రచారం పొందుతున్నాయి. పాఠ్యపుస్తకాల్లో ముస్లిం పాలకుల, స్వాతంత్య్ర సమర యోధుల పాఠాలు తొలగించబడ్డాయి. వివిధ ఆందోళనల సందర్భంలో గట్టిగా గొంతు వినిపించిన ముస్లిం విద్యార్థుల, నాయకుల ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేయబడుతున్నాయి. యోగి ప్రభుత్వం నెలకొల్పిన ఇలాంటి వాతావరణమే పసివాళ్లు సంచరించే, పౌరులుగా వికసించే విద్యావనాల్లోనూ ప్రవేశించి, విద్వేషం చిమ్ముతోంది.
            పాఠశాలలో వివక్షను, విద్వేషాన్ని వెదజల్లిన ఉదంతంపై అంతగా స్పందించని యోగి ప్రభుత్వం - ఆ సంఘటనను సోషల్‌ మీడియాలో ప్రచారం చేశాడన్న నెపంతో ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబేర్‌పై మరోసారి కేసు నమోదు చేసింది. బాలుడి గుర్తింపును వెల్లడి చేశారని ఆ బాలుడి కుటుంబంతో ఎలాంటి సంబంధమూ లేని విష్ణుదత్‌ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు బాలల సంరక్షణ చట్టం కింద కేసు బనాయించింది. వాస్తవానికి ఆల్ట్‌ న్యూస్‌లోకి రాకముందే ఆ వీడియో విస్తారంగా వైరల్‌ అయింది. కానీ, తన వెబ్‌సైట్‌ ద్వారా వాస్తవాలను ప్రపంచానికి చాటుతున్న జర్నలిస్టుపై కక్ష సాధింపు కోసం ఈ సందర్భాన్ని కూడా యోగి ప్రభుత్వం వాడుకోజూస్తోంది. జుబేర్‌పై కొన్నేళ్లుగా అనేక ఎఫ్‌ఐఆర్లు నమోదు చేసి, ఒక్కొక్క కేసులో వరసగా అరెస్టు చేస్తూ, భయపెట్టడమే ధ్యేయంగా యు.పి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ దురుద్దేశ ప్రయత్నాన్ని గతంలో సుప్రీం కోర్టు ఎత్తిచూపినా బిజెపి పాలకులు తమ ద్వేషబుద్ధిని వదులుకోవడం లేదు. ఇటీవల మణిపూర్‌ అవమానవీయ సంఘటనల నేపథ్యంలోనూ అక్కడి బిజెపి రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. నిందితులను పట్టుకొని శిక్షించటం కన్నా ఆ సంఘటనల గురించి దేశానికి తెలిసేలా వీడియో తీసిన వారి మీదనే తొట్టతొలిగా విరుచుకుపడింది. హత్య చేయడం కన్నా ఆ హత్యను చూసి, 'అయ్యో పాపం' అనటమే మహాపరాధం అన్నట్టుగా కమలనాథుల ధర్మం అఘోరిస్తోంది.
        ఏ వేదిక మీదైనా, ఏ రూపంలోనైనా బాలల్లో కుల మతోన్మాదాలను, వివక్షా విషబీజాలను నాటే వ్యక్తులను, సంస్థలను ప్రజలు మూకుమ్మడిగా వ్యతిరేకించాలి. మానవ సమాజం ఉన్నతంగా, ఉత్తమంగా పరిఢవిల్లాలంటే- స్వేచ్ఛ, సమానత్వం, సామరస్యం, సుహృద్భావం వెల్లివిరియాలి. నేహా పబ్లిక్‌ స్కూల్లో జరిగిన సంఘటన ఈ దేశ సహృదయులను ఎంతగా కలచివేసిందో- ఆ తరువాతి రోజు రైతు సంఘం నాయకులు, కొందరు గ్రామస్తులూ కలిసి, ఆ బాలురను కలగలిపి ఒకరినొకరు ఆలింగనం చేసుకునేలా సామరస్యం సమకూర్చిన దృశ్యం అంతగా ఆనందపరిచింది. ఇది కదా, మన దేశ సమైక్య సామరస్య సౌభ్రాతృత్వ సంస్క ృతి అనిపించింది !