May 17,2023 11:45

విజయవాడలో ఓ ప్రభుత్వ పాఠశాల.. ఉదయం 8 : 30 గంటలకు క్లాసుల వారీగా పిల్లలందరూ స్కూలు అసెంబ్లీకి చేరుతున్నారు. స్కూలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిఇటి మాస్టారు ఆధ్వర్యంలో స్కూలు ప్రథమ పౌరుడిగా ఎన్నుకున్న గౌతమ్‌ అసెంబ్లీ నిర్వహిస్తున్నాడు. వందేమాతరంతో అసెంబ్లీ ప్రారంభమైంది. ప్రతిజ్ఞ చెప్పారు. దేశభక్తి గీతాలు ఆలపించారు. మధ్యలో 'సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీ' అంటూ ఓ శ్లోకం పాడించారు. ఇది చాలా సర్వసాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. స్కూలు స్థాపించిన దగ్గర నుండి దేశభక్తి గీతాలతో పాటు ఏదేని దేవతా శ్లోకాన్ని అక్కడ ఆలపించడం జరుగుతోంది. అక్కడే కాదు దశాబ్దాలుగా ప్రభుత్వ స్కూళ్లల్లో ఇదే తంతు నడుస్తోంది. ఎవరూ దీనిపై ఎప్పుడూ నోరుమెదపలేదు. ఎక్కడా దీన్ని పెద్ద చర్చనీయాంశ అంశంగానూ పరిగణించ లేదు.. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ స్కూల్లో నిర్వహించిన అసెంబ్లీలో విద్యార్థులందరూ దేశభక్తి గీతాలతో పాటు ఉర్దూ గీతాన్ని ఆలపించారని ఆరోపిస్తూ.. ఆ స్కూలు ప్రిన్సిపాల్‌ను, మరో ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇది మొదటిసారి కాదు.. తరచూ అక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి.
లౌకికవాద దేశంలో ఒక మతానికి కొమ్ముకాయడం లేక వ్యతిరేకించడం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు.. మత రహిత రాజ్యం ఏలుబడి గల దేశంలో అనేక మతాల వారు మతపరమైన స్వేచ్ఛతో జీవించగలగడమే లౌకికవాదం.
 

                                                                  యుపి స్కూల్లో అసలేం జరిగింది..

గతేడాది డిసెంబరులో ఓ ఉదయం వేళ స్థానిక ప్రభుత్వబడిలో స్కూలు అసెంబ్లీ జరుగుతోంది. అందులో ప్రముఖ ఉర్దూ కవి, 'సారే జహాసే అచ్ఛా' వంటి దేశభక్తి గీతాన్ని రచించిన మహ్మద్‌ ఇక్భాల్‌ 20వ శతాబ్దపు ఆరంభంలో రాసిన 'లబే పే ఆతీ హై దువా..' గీతాన్ని విద్యార్థులు ఆలపించారు. కొంతమంది టీచర్లు ఆ సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అది బాగా వైరల్‌ అయి హిందూత్వ మూకల కళ్లబడింది. అంతే! ఆ స్కూల్లో విద్యార్థులను బలవంతంగా ఇస్లాంలోకి నెడుతున్నారని, అందుకే మదర్సాలలో పాడే మతతత్వ గీతాన్ని స్కూల్లో ఆలపిస్తున్నారని ఆరోపిస్తూ స్కూలు ఎదుట నిరసనకు దిగారు. ఈ బృందానికి కొంతమంది తల్లిదండ్రులు కూడా జత కలిశారు.
 

                                                                         అది బడిపిల్లల గేయం..

'ఇదివరకెప్పుడూ ఇలా జరగలేదు. ఆ గేయం బడిపిల్లల విద్యాబుద్ధులకు సంబంధించింది. చీకటి అనే అజ్ఞానాన్ని పారదోలి వెలుగు అనే చదువును ప్రసాదించమని వేడుకునే గీతమది. కొన్ని దశాబ్దాలుగా యూపీ వ్యాప్తంగా హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా పాఠశాలల్లో దీన్ని ఆలపిస్తున్నారు. కాని ఇప్పుడు వాతావరణం అలా లేదు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, అల్లర్లు సృష్టిస్తారని ఆరోపిస్తూ నాపై, మరో ఇద్దరు ఉపాధ్యాయులపై కేసులు పెట్టారు. పదిరోజులు మేం శిక్ష కూడా అనుభవించాం' అంటూ స్కూలు ప్రిన్సిపాల్‌ వజీరుద్దీన్‌ వాపోయారు. యుపిలో ఈ తరహా సంఘటన జరగడం ఇది తొలిసారి కాదు. ఈ పాటను పాడుతున్నారని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం ఇది మూడోసారి. కొన్ని వారాల క్రితమే హత్రాస్‌లో ఒక ప్రైవేటు స్కూలు యాజమాన్యం ముస్లిమేతర విద్యార్థులను నమాజ్‌ చేయాలని నిర్బంధం పెడుతోందని పాఠశాల ఎదుట హిందూత్వ మూకలు దాడికి తెగబడ్డాయి.కానీ, నమాజు చేయించారనటం వాస్తవం కాదు.

                                                               అదొక సాంస్కృతిక కార్యక్రమం..

వాస్తవానికి ఆ స్కూల్లో అటువంటిదేమీ జరగలేదు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా దేశభక్తి గీతాలు పాడారు. దేశ ప్రముఖుల వేషాలు వేశారు. వారి చరిత్రలు చెప్పారు. అందులో భాగంగానే పిల్లల గేయమైన ఈ పాటను ఆలపించారు. కాని బయట నుండి వచ్చిన ఒత్తిడి మేరకు అది నేరంగా భావించి స్కూలు యాజమాన్యం ఇద్దరు టీచర్లను సస్పెండ్‌ చేసింది. 'విచారణలో భాగంగా మేము ఆ వీడియోలను చూశాం. అదొక సాంస్క ృతిక కార్యక్రమం. ఆరోపించదగ్గ నేరమేమీ అక్కడ కనిపించలేదు. కానీ ఆ టీచర్లు సస్పెన్షన్‌లోనే ఉన్నారు' అంటున్నారు విచారణ అధికారిగా ఉన్న జిల్లా మెజిస్ట్రేట్‌ అర్చనా వర్మ.
 

                                                                     కూలీ పనికి వెళుతున్నారు..

ఒక వర్గాన్ని, ఒక మతాన్ని భయభ్రాంతులకు గురిచేసే అధికారం ఆ మూకలకు ఎవరిచ్చారు..? పాఠశాలల్లో దేశభక్తి గీతాలు మాత్రమే ఆలపించాలన్న ఆదేశాలను కొందరు ప్రబుద్ధులు ఎప్పుడో తుంగలో తొక్కారు. చూసీచూడనట్లుగా వ్యవహరించే యంత్రాంగం ఇప్పుడు యూపీ స్కూళ్లల్లో జరుగుతున్న వ్యవహారాన్ని ఎందుకు తప్పుపడుతోంది..? దీని పర్యవసానంగా జైలు శిక్ష అనుభవించిన ముఫ్లై ఏళ్ల అనుభవం ఉన్న వజీరుద్దీన్‌ మాస్టారు ఉద్యోగం పోయి కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలీగా మారారు.
 

                                                               పాఠ్యగ్రంథంగా ఆమోదించినా..

ఫరూఖన్‌ అలీ 2019లో యుపిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహించేవారు. 'ఈ గేయం ఎన్‌సిఇఆర్‌టి ఆమోదించిన ఉర్దూ పాఠ్యపుస్తకాల్లో ప్రారంభగీతంగా ఉంది. అయితే ఇది మదర్సాలలో ఆలపించే గేయమని స్కూల్లో పఠించడం నేరమని నాపై నిందలు వేసి ఉద్యోగం నుండి తొలగించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో మూడురోజుల్లోనే నన్ను విధులకు తీసుకున్నారు. అయితే ఉద్యోగం ఉన్నా నేను మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వేరే ఊరికి బదిలీ చేశారు' అని చెబుతున్న అలీ మాస్టారుని ఆ మూకలు నానా కష్టాలు పెట్టాయి. స్కూలు నిధులను దుర్వినియోగం చేశారని ఆయనపై లేనిపోని నిందలు వేసి పరువుతీసే ప్రయత్నాలు చేశాయి. ఆ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ 'మేము ముస్లిములం. మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేయడమే వారి లక్ష్యం' అంటూ అలీ మాస్టారు చెబుతున్నప్పుడు ఆయన కళ్లు శూన్యంలోకి చూస్తున్నాయి.
          మతాన్ని అడ్డు పెట్టుకుని మైనార్టీలను హింసించే ఈ మూకలు నిరంతరం రభస సృష్టించటానికే కాచుక్కూచుంటున్నాయి. కర్నాటకలో హిజాబ్‌ ఉదంతం చూసైనా వీటి నైజం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దుందుడుకు, దుర్బుద్ధి చర్యలు దేశ సమైక్యతకు, సామరస్యానికి ప్రమాదకరం.