Sep 29,2023 07:18

దేశవ్యాప్తంగా కాషాయ మూకలు ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు చేయడం, ముస్లింలపై దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలోనే బిదూరీ విద్వేష ప్రసంగాలను కూడా చూడాల్సి వుంది. ముస్లిమ్‌లను సమూలంగా నిర్మూలించాంటూ ధర్మ సంసద్‌లు పిలుపివ్వడం, గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారని లేదా గొడ్డు మాంసాన్ని తీసుకెళుతున్నారనే అనుమానాలతో ముస్లింలను వేధించి, కొట్టి చంపడమనేది హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి బిజెపి పాలిత రాష్ట్రాల్లో నిత్యం జరుగుతున్నాయి. రైల్వే రక్షక దళం (ఆర్‌.ఫి.ఎఫ్‌)కి చెందిన కానిస్టేబుల్‌ కదులుతున్న రైల్లో ముగ్గురు ముస్లింలను కాల్చి చంపడం, ముస్లిం విద్యార్థిని సహచర విద్యార్థులు వరుసగా చెంపపై కొట్టాలంటూ ముజఫర్‌ నగర్‌లో ఒక స్కూలు టీచర్‌ ఆదేశించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న తరహా లోనే బిదూరీ సంఘటనను మనం చూడాల్సి వుంది.

            సమాజంలో ఈనాడు విశృంఖలంగా కనిపిస్తున్న ముస్లింలపై విద్వేష ప్రసంగాలనేవి ఇప్పుడు పార్లమెంట్‌ను కూడా ముట్టడించాయి. కొత్త పార్లమెంట్‌ భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాల చివరి రోజున, ఢిల్లీకి చెందిన బిజెపి పార్లమెంట్‌ సభ్యుడు రమేష్‌ బిదూరి, బిఎస్‌పి ఎం.పి డానిష్‌ అలీపై అత్యంత దారుణమైన, అసభ్యకరమైన ముస్లిం వ్యతిరేక పదాలను ఉపయోగించారు. 'ముల్లా టెర్రరిస్ట్‌' అంటూ వాడిన పదాలను గతంలో ఎన్నడూ పార్లమెంట్‌లో విని వుండలేదు. కానీ డానిష్‌ అలీని ఉద్దేశించి బిదూరీ పదే పదే ఆ పదాలను ఉపయోగించారు. బిదూరీ మాట్లాడిన వీడియోను దేశవ్యాప్తంగా పదులు, వేల సంఖ్యలో ప్రజలు చూశారు. తీవ్రమైన ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వెంటనే సదరు సభ్యుడు బిదూరీపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పాలక పార్టీ నాయకత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని ఎవరైనా ఆశిస్తారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. ప్రతిపక్షాల మనోభావాలు దెబ్బతిన్నట్లైతే తాము విచారిస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అంతకు మించి, ముస్లిం వ్యతిరేక దూషణలను ఖండించడం గానీ లేదా డానిష్‌ అలీకి క్షమాపణలు చెప్పడం గానీ జరగలేదు.
           బిదూరీని సభ నుండి సస్పెండ్‌ చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన స్పీకర్‌, కేవలం బిదూరీకి గట్టిగా హెచ్చరిక చేయడంతోనే ఆగిపోయారు. ఇకపై సభలో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించేది లేదని మాత్రం హెచ్చరించి వదిలేశారు.
        ప్రతిపక్ష సభ్యులు పదే పదే తాము లేవదీయాలనుకున్న అంశాలను లేవనెత్తడానికి ప్రయత్నించినా లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నించినా లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రిసైడింగ్‌ అధికారులు వారి పట్ల వ్యవహరించే తీరుకు పూర్తి విరుద్ధంగా పై సంఘటన వుంది. రాజ్యసభలో, 'ఆప్‌' ఎం.పి సంజరు సింగ్‌ను వర్షాకాల సమావేశాలకు మొత్తంగా సస్పెండ్‌ చేశారు. పైగా ఆయనపై గల ఫిర్యాదును సభా హక్కుల కమిటీ పరిష్కరించేవరకు ఆ సస్పెన్షన్‌ను కొనసాగించారు. 'ఆప్‌' మరో ఎం.పి రాఘవ్‌ చద్దా కూడా గత సమావేశాల్లో సస్పెండ్‌ అయ్యారు. లోక్‌సభలో 'ఆప్‌' సభ్యుడు సుహైల్‌ కుమార్‌ రాథి మిగిలిన వర్షాకాల సమావేశాలకు సస్పెండ్‌ కాగా, సభా హక్కుల కమిటీ సమావేశమై, తిరిగి తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేసేవరకు లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి సస్పెండయ్యారు. బిదూరీపై చర్య తీసుకోవాలని కోరుతూ దానిష్‌ అలీ రాసిన లేఖపై స్పీకర్‌ ప్రతిస్పందించలేదు. బిజెపి, బిదూరీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది కానీ ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.
           బిదూరీపై చర్య తీసుకోవడానికి బదులుగా, ఆయనకు అండగా నిలబడే విషయమై బిజెపి ఆందోళన చెందుతోంది. ప్రధానికి వ్యతిరేకంగా అప్రజాస్వామ్య వ్యాఖ్యలు చేయడం ద్వారా అలీ, బిదూరీని రెచ్చగొట్టారంటూ నిషికాంత్‌ దూబే వంటి బిజెపి ఎంపీలు స్పీకర్‌కు లేఖలు రాశారు.
          దేశవ్యాప్తంగా కాషాయ మూకలు ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు చేయడం, ముస్లింలపై దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలోనే బిదూరీ విద్వేష ప్రసంగాలను కూడా చూడాల్సి వుంది. ముస్లిమ్‌లను సమూలంగా నిర్మూలించాంటూ ధర్మ సంసద్‌లు పిలుపివ్వడం, గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారని లేదా గొడ్డు మాంసాన్ని తీసుకెళుతున్నారనే అనుమానాలతో ముస్లింలను వేధించి, కొట్టి చంపడమనేది హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి బిజెపి పాలిత రాష్ట్రాల్లో నిత్యం జరుగుతున్నాయి. రైల్వే రక్షక దళం (ఆర్‌.ఫి.ఎఫ్‌)కి చెందిన కానిస్టేబుల్‌ కదులుతున్న రైల్లో ముగ్గురు ముస్లింలను కాల్చి చంపడం, ముస్లిం విద్యార్థిని సహచర విద్యార్థులు వరుసగా చెంపపై కొట్టాలంటూ ముజఫర్‌ నగర్‌లో ఒక స్కూలు టీచర్‌ ఆదేశించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న తరహా లోనే బిదూరీ సంఘటనను మనం చూడాల్సి వుంది. హిందువులు నివసించే ప్రాంతాల్లో ముస్లిం చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను చేసుకోనివ్వకుండా అడ్డుకోవడం, ఆర్థికంగా వారిని బహిష్కరిం చాలంటూ బెదిరింపుల నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి.
           బిదూరీపై పార్లమెంట్‌లో కఠిన చర్య తీసుకోవడంలో విఫలమవడంతో పార్లమెంట్‌ ప్రతిష్టను కించబరిచినట్లైంది. పాలక పార్టీ పెంచి పోషిస్తున్న ఇస్లామోఫోబియాకు చట్టబద్ధమైన ముద్ర వేసేలా వుంది. బిదూరీ విద్వేష ప్రసంగమనేది మొత్తంగా బిజెపి వైఖరి లేదా దృక్పథంలో భాగమేనన్నది ఈ సంఘటన రుజువు చేస్తోంది. రాజదండాన్ని ప్రతిష్టించిన కొత్త పార్లమెంట్‌ భవనంలో దీన్ని ''హిందూత్వ శక్తి'గా బిజెపి పార్లమెంట్‌ సభ్యులు భాష్యం చెబుతున్నారు. దానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు.
 

( 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం )