Oct 04,2023 07:14

జాతీయ రైతాంగ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ హోదాలో ఆయన చేసిన ప్రాథమిక సిఫార్సులు చాలా గణనీయమైనవి, గుర్తుంచుకోదగ్గవి. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రోత్సాహక ధరలు కల్పించాలి. ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలపడం ద్వారా కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పి) లెక్కించాలి. నాలుగు శాతం వడ్డీ రేటు దాటకుండా అందుబాటు ధరల్లో అందరికీ వ్యవసాయ రుణాలు లభించాలి, ఒడిదుడుకులతో కూడిన మార్కెట్‌ నుండి రైతులకు రక్షణ కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి...అనేవి ఇందులో ముఖ్యమైన సిఫార్సులు. వ్యవసాయ రంగంలో లాభదాయకత క్షీణించడం, రైతుల దుస్థితి పెరగడం, వారి రుణ భారాలు పెరగడాన్ని దృష్టిలో వుంచుకుని, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ పెట్టుబడులు, తోడ్పాటు మరింతగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు ఉద్యమ డిమాండ్లలో స్వామినాథన్‌ ఎంఎస్‌పి ఫార్ములా ప్రధానమైనది. మోడీ ప్రభుత్వం దీనిని అమలు చేయకుండా రైతులను దగా చేసింది.

భారతదేశ హరిత విప్లవ పితామహుడు డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ ఆరు దశాబ్దాలకు పైగా భారతదేశ వ్యవసాయ రంగంలో అద్భుతమైన, స్పష్టమైన అస్తిత్వాన్ని కలిగి వున్నారు. ఇదే కాలంలో ఆహార సంక్షోభం కలిగిన దేశంగా, దిగుమతులపై ఆధారపడే స్థాయి నుండి తగిన ఆహార నిల్వలతో స్వాలంబనను సాధించిన దేశంగా భారత్‌ ఎదిగింది. అనేక కారణాలు, లక్షలాది మంది సమిష్టి కృషి ఇటువంటి పరివర్తనకు దారి తీసినప్పటికీ, హరిత విప్లవానికి, దాని నిర్మాత, రూపశిల్పి డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌కు ప్రధానంగా ఈ ఘనత, ఖ్యాతి దక్కుతుందని చెప్పవచ్చు. అధిక దిగుబడులను ఇచ్చే రకాలు, ఇరిగేషన్‌, రసాయన ఎరువులు ఉపయోగించి ముమ్మరంగా వ్యవసాయం సాగించడం ద్వారా హరిత విప్లవ సాంకేతికతను ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన చోదక శక్తి డాక్టర్‌ స్వామినాథన్‌. అయితే, రైతాంగం, వ్యవసాయ కూలీలు, శాస్త్రవేత్తల కృషి, వ్యవసాయ అనుబంధ సేవలు అలాగే సబ్సిడీల ద్వారా వ్యవసాయ రంగంలో పెట్టుబడుల ద్వారా ప్రభుత్వ తోడ్పాటు, గ్రామీణాభివృద్ధి లేకపోతే ఇదేమీ సాధ్యం కాదని, ఫలించదని ఆయన విశ్వసించారు. 1943లో బెంగాల్‌లో కరువు కాటకాలు సంభవించి, 30 లక్షల మందికి పైగా ప్రజలు ఆకలి దప్పులతో మరణించడం, తీవ్రమైన బియ్యం కొరతను దేశం ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగత ప్రేరణతో వ్యవసాయ రంగంలో పరిశోధనను ప్రారంభించారు. ఆకలి, ఆహార కొరతలకు సంబంధించిన చెరిగిపోని ఈ ముద్రను, ఇటువంటి పరిస్థితులను అధిగమించాలనే తపన ఆయన జీవితాంతం కొనసాగింది. దానికోసం ఆయన తన ప్రయత్నాలను చివరి వరకూ కొనసాగిస్తూనే వచ్చారు. ఆయన పద్ధతులతో ఏకీభవించని వారు సైతం ఈ వాస్తవాన్ని మాత్రం కాదనలేరు.
            బయో టెక్నాలజీ అనేది అత్యంత శక్తివంతమైన సాధనమని, దాన్ని ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాలని స్వామినాథన్‌ విశ్వసించారు. అయితే అంతిమంగా ఉత్పత్తులనేవి ప్రమాదరహితాలని ప్రజలకు నమ్మకం కలిగించేలా ముప్పులను, ప్రయోజనాలను అంచనా వేయాల్సి వుందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. జీవ భద్రతకు సంబంధించిన ఆందోళనలన్నీ పక్కా పద్ధతిలో పరిష్కరించబడ్తాయని హామీ కల్పించేందుకు సరైన సమర్ధవంతమైన స్వతంత్ర సంస్థలతో కఠిన పరీక్షలు నిర్వహించాల్సిన అవసరముందని ఆయన నొక్కి చెప్పారు. దీన్ని కేవలం వ్యవసాయ రంగ వాణిజ్యానికి మాత్రమే వదిలివేయలేమని ఆయన స్పష్టం చేశారు. పైగా స్వీయ ధృవీకరణను ఆయన వ్యతిరేకించారు. తప్పు చేసిన కంపెనీలను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టి, బాధితులకు పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించేలా, సివిల్‌ లయబిలిటీ ఫర్‌ న్యూక్లియర్‌ డ్యామేజ్‌ (అణు విపత్తులు సంభవించినపుడు పౌర బాధ్యత) తరహాలోనే ఒక వ్యవస్థను నెలకొల్పాల్సిన ఆవశ్యకత కూడా వుందని ఆయన పేర్కొన్నారు. రసాయన ఎరువులను అధికంగా ఉపయోగించడం, మోనో కల్చర్స్‌ (ఏక సంస్కృతులను-ఒకే పంట పద్ధతులను) పాటించడం, ఇతర వ్యవసాయ రంగ సాంకేతికాల కారణంగా జరుగుతున్న నష్టాన్ని తనకు తానే అంచనా వేసుకుని, సమీక్షించడం వల్లనే ఆయన ఈ నిర్ధారణకు వచ్చారని ఆయనతో మాట్లాడినపుడే నాకు తెలిసింది. భారతదేశ ఆహార సంక్షోభాన్ని అధిగమించడానికి, అలాగే ఆహార ధాన్యాల దిగుమతుల ద్వారా కొరతను నివారించడమనే పద్ధతిని అధిగమించడానికి హరిత విప్లవం సాయపడిందని ఆయన చాలా ధృఢంగా విశ్వసించారు. మనలాంటి దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేసే కారణాలు (వరదలు, వర్షాలు లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు, నీటిలో లవణ సాంద్రత)ను పరిష్కరించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆయన నొక్కి చెప్పారు.
              బయో టెక్నాలజీ, మాన్‌శాంటో వంటి అగ్రి బిజినెస్‌ల పట్ల ఆయన దృక్పథంలోని కీలకమైన వ్యత్యాసం ఇదే. అందువల్లే, నీటిలో లవణ సాంద్రత, కరువు, వరదలు, వాతావరణ పరిస్థితులను దీటుగా తట్టుకునేలా వివిధ రకాల వంగడాలను అభి వృద్ధిపరచడం వంటి సమస్యలను పరిష్కరించ డంపైనే ఎం.ఎస్‌. స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌) ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మాన్‌శాంటో వంటి అగ్రి బిజినెస్‌లు తెగుళ్ల సమస్యలను, ఫంగల్‌ దాడులు వంటి బయోటిక్‌ (జీవ సంబంధ మైన) కారణాలను ఎదుర్కొనడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. నీటిలో లవణ సాంద్రత, కరువు కాటకాలు లేదా వరదలు వంటి జీవ సంబంధం కాని కారణాలు మొక్కల్లో మార్పులకు అనుగుణంగా వుండవు. మరోపక్క ఉత్పాదకతను తగ్గించే చీడపీడలు, తెగుళ్ళు పట్టడం వంటి జీవ సంబంధిత కారణాలు నిరోధకంగా మారవచ్చు, సూపర్‌ పెస్ట్‌లుగా ఆవిర్భవించవచ్చు, దానితో వాటిని ఎదుర్కొనడానికి మరింత కొత్తవైన, ఖరీదైన రెండో తరం వెరైటీలు అవసరమవుతాయి. భారత్‌ వంటి దేశాల్లో, పేద, సన్నకారు రైతాంగం ప్రధానంగా వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడిన పరిస్థితుల్లో అత్యంత కీలకమైన సమస్యలను పరిష్కరించగల సాంకేతికతలను, వ్యవసాయ పద్ధతులను వ్యాప్తి చేయడం చాలా ముఖ్యమని డాక్టర్‌ స్వామినాథన్‌ బాగా గ్రహించారు. బి.టి వంకాయ వివాదంలో కూడా పక్కా పరీక్షలు జరగకుండా పంటలు వేయాల్సిన ఆవశ్యకత లేదని ఆయన స్పష్టం చేశారు. పైగా దేశం మొత్తం ఆహార భద్రత కోసం వంకాయ వంటి పంటలు పెద్దగా ప్రభావం చూపవని అన్నారు.
              విత్తన బిల్లుపై చర్చ సందర్భంగా ఆయనతో మాట్లాడే మొదటి అవకాశం నాకు లభించింది. వ్యవసాయ రంగంపై విస్తృత పరిజ్ఞానం ఆయనకు వుంది. పైగా నాలాంటి అనుభవం లేని వ్యక్తి చెప్పేది వినే, అంగీకరించే మంచి స్నేహ స్వభావం ఆయనది. తన వైఖరికి భిన్నంగా వున్నప్పటికీ, కిసాన్‌ సభ తరపున రూపొందించిన విత్తన బిల్లు సవరణలు కొన్నింటిలోని తార్కికతను ఆమోదించగలిగే ఉదాత్తత ఆయన స్వంతం. పార్లమెంట్‌లో వాటికి మద్దతిస్తానని చెప్పిన హామీకి ఆయన కట్టుబడి వున్నారు.
ఈ అంశంపై విస్తృత ఏకాభిప్రాయానికి జరిగిన కృషికి కూడా ఆయన మద్దతిచ్చారు. ఈ బిల్లుపై వివిధ రాజకీయ పార్టీలు ఒకే రకమైన వైఖరులు తీసుకోవడంలో ఈ విస్తృత ఏకాభిప్రాయం ప్రతిబింబించింది. అయితే, ఒక శతాబ్ద కాలం విస్తరించిన ఒక వ్యక్తి జీవిత కాలంలో చేసిన సేవలను అంచనా వేసేటపుడు, ఆ వ్యక్తి ప్రజల పక్షాన, దోపిడీకి గురయ్యే పేదల పక్షాల నిలబడ్డారా లేక వారికి వ్యతిరేకంగా నిలబడ్డారా అనేది అంచనా వేయాల్సి వుంటుంది. విమర్శలను అంగీకరించే వినయం, అలాగే తప్పులు జరిగాయని తెలుసుకున్నపుడు వాటిని సరిదిద్దుకునే చర్యలు తీసుకోవడమనేది కూడా ఒక ముఖ్యమైన ప్రామాణికంగా చెప్పవచ్చు.
               నయా ఉదారవాద ఆర్థిక విధానాల విషయంలో ఆయన తీసుకున్న వైఖరులు ఆయనను లక్షలాదిమంది అన్నార్తుల వైపు, లక్షలాదిమంది నిరుపేదలు, సన్న చిన్నకారు రైతాంగం వైపు నిలబెడతాయి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి నుండి వైదొలగడమనే ప్రభుత్వ నయా ఉదారవాద వైఖరికి వ్యతిరేకంగా కృతనిశ్చయంతో నిలబెడతాయి. ఆహార భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా ఆయనకు నిరంతర తపన వుంది. ఆ లక్ష్య సాధన దిశగానే ఆయన పరిశోధన నిర్దేశించబడింది. శాస్త్రీయ సాంకేతికతను వ్యాప్తి చేసేందుకు, రైతాంగానికి సాంకేతికతను బదిలీ చేయడానికి ప్రభుత్వ విస్తరణ వ్యవస్థ (పబ్లిక్‌ ఎక్స్‌టెన్షన్‌ సిస్టమ్‌)కు ఆయన గట్టి మద్దతుదారుగా వున్నారు. లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ, సార్వజనీన ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజ నాలను ఆయన అర్ధం చేసుకున్నారు, ప్రోత్సహించారు. తగిన రక్షణలతో ప్రైవేటు రంగాన్ని అనుమతిస్తూ, ధరలపై నియంత్రణ వుంటూ విత్తనాల ఉత్పత్తి, పరిశోధనలో ప్రభుత్వ రంగ పాత్ర చురుకుగా వుండాలని ఆయన పేర్కొనేవారు.
       జాతీయ రైతాంగ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ హోదాలో ఆయన చేసిన ప్రాథమిక సిఫార్సులు చాలా గణనీయమైనవి, గుర్తుంచుకోదగ్గవి. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రోత్సాహక ధరలు కల్పించాలి. ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలపడం ద్వారా కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పి) లెక్కించాలి. నాలుగు శాతం వడ్డీ రేటు దాటకుండా అందుబాటు ధరల్లో అందరికీ వ్యవసాయ రుణాలు లభించాలి, ఒడిదుడుకులతో కూడిన మార్కెట్‌ నుండి రైతులకు రక్షణ కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి...అనేవి ఇందులో ముఖ్యమైన సిఫార్సులు. వ్యవసాయ రంగంలో లాభదాయకత క్షీణించడం, రైతుల దుస్థితి పెరగడం, వారి రుణ భారాలు పెరగడాన్ని దృష్టిలో వుంచుకుని, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ పెట్టుబడులు, తోడ్పాటు మరింతగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు ఉద్యమ డిమాండ్లలో స్వామినాథన్‌ ఎంఎస్‌పి ఫార్ములా ప్రధానమైనది. మోడీ ప్రభుత్వం దీనిని అమలు చేయకుండా రైతులను దగా చేసింది.
          చిన్న కమతాల వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ఆయన బాసటగా నిలబడ్డారు. పంట-పశువుల సమగ్ర ఉత్పత్తి వ్యవస్థల ద్వారా, ఆగ్రో ప్రాసెసింగ్‌, బయోమాస్‌ వినియోగం వంటి వాటి ద్వారా బహుళ జీవనోపాధి అవకాశాలతో చిన్న కమతాల ఆదాయాన్ని పెంచాలని భావించారు. ఆహార ఉత్పత్తి లక్ష్యాలను ఎదుర్కొనడానికి, ఆకలి, దారిద్య్రం, గ్రామీణ నిరుద్యోగం వంటి సమస్యలను తగ్గించడానికి ఈ రెండూ కీలకమని ఆయన భావించారు. అందరికీ ఆహారమన్న లక్ష్యాన్ని సాకారం చేసుకునే మన సామర్ధ్యం కన్నా చాలా వేగంగా జనాభా పెరుగుతుండడం ఆయన గమనించారు. అదే సమయంలో, కుటుంబాల స్థాయిలో తగిన కొనుగోలు శక్తి లేకపోవడం కారణంగా వినిమయం కూడా పెరగదు. ఆయన మాటల్లో చెప్పాలంటే, ''గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు పేలవంగా పెరుగుతున్న కారణంగా సంభవిస్తున్న జీవనోపాధులు, ఉపాధి సంక్షోభం కుటుంబాల స్థాయిలో ఆహార సంక్షోభానికి దారి తీస్తోంది.'' నయా ఉదారవాద ఆర్థిక విధానాలను చాలా తీవ్రంగా విమర్శించడమే ఇది.
          ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వృద్ధి రేటు క్షీణించడంతో హరిత విప్లవ రంగంలో ఒక రకమైన నిస్సత్తువ నెలకొందని స్వామినాథన్‌ గ్రహించారు. రసాయన ఎరువులు అధికంగా వినియోగించడం, ఒకే పంటను పలుసార్లు వేయడమనే సంస్కృతి పెరగడం అనేక సమస్యలకు దారి తీస్తోందని అంగీక రించారు. ఇప్పటికే ఆలస్యమైందనే విమర్శ సమర్ధనీయమై నప్పటికీ ఆయనలో ఎక్స్‌టర్నల్‌ ఇన్‌పుట్‌ సస్టెయిన్‌బుల్‌ అగ్రికల్చర్‌ (ఎల్‌ఇఐఎస్‌ఎ)-(వెలుపల నుండి తక్కువ పెట్టుబడులతో సుస్థిర వ్యవసాయం), సమగ్ర జాతీయ వనరుల నిర్వహణ, సమగ్ర చీడపీడల నిర్వహణ అలాగే వ్యవసాయ పర్యావరణ వైఖరుల గురించి కూడా గట్టిగా వాదించేవారు.
          పంటల మార్పిడిని కూడా ఆయన సమర్ధించేవారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఏక పంటల పద్ధతి నుండి బయటకు రావాలని కోరేవారు. హరిత విప్లవంతో అవిభాజ్యంగా పెనవేసుకు పోయిన స్వామినాధన్‌ లాంటి వ్యక్తి ఇటువంటి నిర్ధారణలకు వచ్చారంటే వాస్తవాన్ని అంగీకరించ డం, కొత్తదనాన్ని గ్రహించడం వల్లనేనని అర్ధమవుతోంది.
విభేదాలను పక్కనబెడితే, రైతాంగ ఉద్యమం తన డిమాండ్లను రూపొందించుకోవడంలో, పాలక వర్గ విధానాలకు వ్యతిరేకంగా పోరును మరింత ఉధృతం చేయడంలో ఆయన వైఖరులు ఇటీవలి కాలంలో రైతాంగ ఉద్యమానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి.
 

(వ్యాసకర్త ఎఐకెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి) విజూ కృష్ణన్‌