టెల్ అవీవ్ : '' హమాస్ మూల్యం చెల్లించుకోవడం మొదలైంది.. ఇది కేవలం ఆరంభం మాత్రమే '' అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నెలకొన్న నేపథ్యంలో ... నిన్న (శుక్రవారం) ఇజ్రాయెల్ బలగాలు గాజా భూభాగంలో ప్రవేశించాయి. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు శుక్రవారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. హమాస్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఇజ్రాయెల్ సైన్యం గాజాలో అడుగుపెట్టింది. గ్రౌండ్ ఆపరేషన్‌కు ముందు సోదాలు నిర్వహించింది. ఇజ్రాయెల్ భూభాగంలో చొరబడేందుకు బయలుదేరిన యాంటీ ట్యాంగ్ గైడెడ్ మిసైల్ స్క్వాడ్‌ను అడ్డుకున్నాయి. బందీలను ఉంచిన ప్రాంతాల ఆనవాళ్ల కోసం అన్వేషిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇదిలా ఉండగా ... మరోవైపు హమాస్ చెరలో 120 మంది బందీలుగా ఉన్నట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
నెతన్యాహు ప్రసంగం...
గాజా భూభాగంలో ఇజ్రాయెల్ బలగాలు తనిఖీలు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన కొద్ది గంటలకే నెతన్యాహు చేసిన ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. '' మన శత్రువులు వారు చేసిన పనికి మూల్యం చెల్లించుకోవడం మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో ఇప్పుడే నేను చెప్పలేను. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎన్నడూ లేనంత బలంగా ఈ యుద్ధాన్ని మేం ముగిస్తాం. శత్రువులు మాపై పాల్పడిన అరాచకాలను మేం ఎన్నటికీ మర్చిపోలేం. వారిని ఎప్పటికీ క్షమించలేం. హమాస్‌ను సమూలంగా నాశనం చేస్తాం '' అని నెతన్యాహు వ్యాఖ్యానించారు.