Oct 16,2023 07:44

పొద్దు తిరుగుడు పూలు
తలలు వాల్చేశాయి -
గాజా నింగిలో సూర్యుడు లేడు

మేఘాలు
బుల్లెట్లు కురుస్తున్నాయి -
గాజా ఆకాశం

యుద్ధం తరువాత
ఏదో మిగులుతుందనుకున్నారు -
శ్మశానాల దిబ్బ

ఉరుము
ఉలిక్కి పడింది
బాంబుల మోత

యుద్ధం తల
బొప్పికట్టాలని -
పిల్లాడు రాయిసిరాడు

యుద్ధమేఘాలు . . .
పొద్దుతిరుగుడు పూలు
తలలు వాల్చేశాయి

యుద్ధ విమానాల రొద -
పక్షికూతలూ, పిల్లల ఏడుపుల్ని
పొట్టన పెట్టుకుంది!
 

- చిత్తలూరి
91338 32246