Oct 08,2023 21:24

వచ్చే నెల 30న ప్రదానం
ప్రజాశక్తి-విజయనగరం కోట:ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు గురజాడ విశిష్ట పురస్కారం లభించింది. ఆదివారం విజయనగరంలోని గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి గురజాడ విశిష్ట పురస్కారాన్ని సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ప్రముఖులకు ఏటా అందజేస్తున్నారు. నవంబరు 30న గురజాడ అప్పారావు వర్థంతి సందర్భంగా చంద్రబోస్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది తెలుగు పాటకు అంతర్జాతీయ, జాతీయ పురస్కారాలను తెచ్చిన చంద్రబోస్‌ను గురజాడ విశిష్ట పురస్కారంతో సత్కరించనున్నామని గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు పి.వి.నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాశ్‌ వెల్లడించారు. నవంబర్‌ 30న జరిగే ఉత్సవాల్లో తెలుగు సాహిత్య రంగంలో పదిమంది వర్థమాన కవులను గురజాడ ఉత్తమ సాహితీ పురస్కారంతో సత్కరిస్తామని చెప్పారు. గురజాడ రచనలపై విశేషంగా అధ్యయనం చేసి డాక్టరేట్‌ పొందిన సాహితీవేత్తలను ఆహ్వానించి, సత్కరిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో గురజాడ వారసులు గురజాడ వెంకట ప్రసాద్‌, ఇందిర తదితరులు పాల్గొన్నారు.