ప్రజాశక్తి - రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్) : రెడ్డిగూడెం మండలంలో ఆర్ బి కె ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని కోరుతూ ... తహశీల్దార్ ఎం.పాల్ కి రెడ్డిగూడెం మండల రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం మెమోరాండంను సమర్పించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ .... ధాన్యాన్ని కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఒకవైపు ముఖ్యమంత్రి చెబుతున్నారని, కానీ ఆచరణలో చూస్తే అది సాధ్యం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే వారం రోజుల లోపల రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాని పక్షంలో రైతులందరూ కూడాను రోడ్లెక్కి ఆందోళన చేయవలసిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. దీనికి రైతులందరూ పెద్ద ఎత్తున మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు అప్పిరెడ్డి, కార్యదర్శి మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి, బాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడవర్తి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.










