Nov 12,2023 16:07

ఒక ఊరిలో ఒక దొంగ వున్నాడు. ఆ దొంగ ఒకరోజు దొంగతనం చేసి నగలు, డబ్బులు మూటగట్టుకొని ఊరి బైటకు చేరుకున్నాడు. అక్కడ ఒక లోతయిన బావి వుంది. ఆ బావి దగ్గర ఉన్న ఒక చెట్టు కింద కూర్చోని, డబ్బులు లెక్క పెట్టుకోసాగాడు.
ఆ బావికి కొంచెం దూరంలో మేకలు కాసే గోపి వున్నాడు. ఆ గోపి దొంగను చూశాడు. గోపి చాలా తెలివైవాడు. 'ఎలాగైనా సరే దొంగను పట్టుకోవాలి' అనుకున్నాడు.
వెంటనే గట్టిగా ఏడ్చుకుంటూ ఆ బావి దగ్గరికి వచ్చి, తొంగి చూడడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు విన్న దొంగ, గోపి దగ్గరికి వచ్చి 'ఎవరు నువ్వు? ఎందుకలా ఏడుస్తున్నావు?' అని అడిగాడు. గోపి కళ్ళు తుడుచుకుంటూ 'ఇందాక నీళ్లు తాగుతుంటే నా వేలికున్న బంగారు ఉంగరం బావిలో పడిపోయింది. ఇంటికి పోతే మా అమ్మ కిందా మీదా పడేసి కొడుతుంది' అన్నాడు.
ఆ దొంగకు ఉంగరం మీద ఆశ పుట్టింది. నగలమూట గట్టున పెట్టి 'నేను దిగి ఉంగరం వెదుకుతా. అంతవరకూ ఈ మూట కనిపెట్టుకొని వుండు' అంటూ తాడు పట్టుకొని, లోనికి దిగాడు. దొంగ అలా బావిలోకి దిగగానే గోపి ఆ తాడును గబగబా పైకి లాగేశాడు. దాంతో ఆ దొంగ పైకి రాలేక బావిలోనే ఇరుక్కుపోయాడు. వెంటనే గోపి ఉరుక్కుంటా ఊరిలోకి పోయాడు. విషయమంతా వివరించి, జనాలందరినీ పిలుచుకొని వచ్చాడు. వాళ్ళంతా దొంగను పైకిలాగి, మెత్తగా తన్ని భటులకి అప్పజెప్పారు.
కసిరెడ్డి విజిత,
రెండో తరగతి,