Aug 26,2023 07:07

            జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా అత్యధిక విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకోవడం హర్షణీయం. దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం జాతీయ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికై, ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా రికార్డు సృష్టించిన అల్లు అర్జున్‌కు, వివిధ విభాగాల్లో అవార్డులు సాధించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి, ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన 'ఉప్పెన' టీమ్‌కు, 'కొండపొలం' సినిమాలో 'ధమ్‌ధమ్‌ధమ్‌' పాటకు ఉత్తమ గీత రచయితగా మరోమారు ఖ్యాతి గడించిన చంద్రబోస్‌కు, ఉత్తమ సంగీత దర్శకునిగా ఎంపికైన దేవీశ్రీప్రసాద్‌కు అభినందనలు. ఆరు దశాబ్దాల శాస్త్రవేత్తల కృషి చందమామపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తే.. ఏడు దశాబ్దాల తెలుగు చలనచిత్ర రంగ ఆకాంక్షలను 'పుష్పరాజ్‌' రూపంలో అల్లు అర్జున్‌ నెరవేర్చారు. ప్రజానాట్యమండలి ఘన వారసత్వంతో హాస్యనట శిఖరంగా అలరించిన అల్లు రామలింగయ్య మనవడిగా, దిగ్గజ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ కుమారుడిగా ఆ హోదాలకే పరిమితం కాకుండా తనదైన కొత్త శైలితో, నటనా, నృత్య కౌశలంతో వెండితెరపై సత్తాచాటి సౌత్‌ ఇండియా స్టైలిష్‌ స్టార్‌గా కోట్లాది మంది ప్రేక్షకాభిమానాన్ని చూరగొనడం అల్లు అర్జున్‌ ప్రత్యేకత. ఎర్రచందనం దొంగలకు హీరోయిజాన్ని జోడించిన చిత్ర కథానాయకుడికి జాతీయ పురస్కారమా? అంటూ కొందరు పెదవి విరిచినా.. జాతీయ ఉత్తమ నట పురస్కారానికి అల్లు అర్జున్‌ నూటికి నూరు పాళ్లు అర్హుడేనని తెలుగు సినీ పరిశ్రమ యావత్తు గుండెలకు హత్తుకొని జేజేలు పలకడం ఆయన నటనా వైదుష్యానికి నిదర్శనం.
      గురువారం ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు తారలు వెలుగులు విరజిమ్మినందుకు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా.. వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన కుల వివక్ష జాఢ్యాన్ని ప్రశ్నిస్తూ సమాజాన్ని చైతన్య పరిచే 'జైభీమ్‌' లాంటి చిత్రాలకు అవార్డుల జాబితాలో చోటు దక్కకపోవడం పురస్కారాల ఎంపిక కమిటీ పారదర్శకతను ప్రశ్నార్థకం చేశాయి. కేంద్ర ప్రభుత్వ నిర్దేశంలో సంఫ్‌ు పరివార్‌ మెప్పుల కోసమే జ్యూరీ పనిచేసినట్లుగా కొన్ని ఎంపికలు తేటతెల్లం చేస్తున్నాయి. మత విద్వేషాలు రాజేసే దురుద్దేశంతో సంఫ్‌ు పరివార్‌ పెద్దల దిశానిర్దేశంతో వండివార్చిన కథాంశంతో అనేక వివాదాలు మూటగట్టుకొని తెరకెక్కిన 'ది కాశ్మీర్‌ ఫైల్స్‌'ను ఏకంగా జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపిక చేయడం, అలాగే శత్రు దేశాల గూఢచారిగా పనిచేశారన్న ఆరోపణలతో వివాదాస్పద వ్యక్తిగా చరిత్రలో నిలిచిన 'నంబి నారాయణ్‌' జీవితకథ ఆధారంగా రూపొందించిన 'రాకెట్రీ- ది నంబీ ఎఫెక్ట్‌' చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం ప్రకటించడం జ్యూరీ నిర్ణయాల నిజాయతీని శంకిస్తున్నాయి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థలు, అత్యున్నత విద్యా, సాంకేతిక, పరిశోధన సంస్థల్లో మనువాద జాఢ్యాన్ని జొప్పిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చివరకు చలన చిత్ర పరిశ్రమ పురస్కారాలకూ ఈ మకిలీని అంటించడం సిగ్గుచేటు. మతాల మధ్య విద్వేషాలు రాజేయడం ద్వారా సమాజాన్ని చీల్చి రాజకీయ లబ్ది పొందాలనే దురుద్దేశంతో, ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకునే కుట్రపూరిత వ్యూహాల్లో భాగంగానే ది కాశ్మీర్‌ ఫైల్స్‌, ఆ తర్వాత ది కేరళ ఫైల్స్‌, రాకెట్రీ వంటి చిత్రాలు సంఫ్‌ు పరివార్‌ దిశానిర్దేశంతో తెరకెక్కాయన్నది జగద్విదితమే. కుల వివక్ష నిర్మూలనకు కృషి చేసిన 'జైభీమ్‌' లాంటి చిత్రాలను విస్మరించడం, మత విద్వేషాలు రాజేసే 'ది కాశ్మీర్‌ ఫైల్స్‌' లాంటి చిత్రాలను నెత్తిన పెట్టుకోవడం జాతీయ పురస్కారాల స్థాయిని దిగజారుస్తాయి.
           ఆశ్చర్యకరంగా బాలీవుడ్‌ ప్రధాన తారాగణం జాతీయ పురస్కారాలపై మౌనం దాల్చడం మరో విశేషం. సామాజిక మాధ్యమాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించే సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచన్‌తో పాటు షారుఖ్‌ఖాన్‌, అక్షరు కుమార్‌, హృతిక్‌ రోషన్‌ తదితర తారలు కనీసం అభినందనలు కూడా చెప్పకపోవడం చర్చనీయాంశమైంది. అజరు దేవగణ్‌ ఒక్కరే 'రాకెట్రీ' బృందానికి అభినందనలు తెలిపినా.. తాను స్వయంగా నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' బృందానికి అభినందనలు చెప్పకపోవడం విస్మయం కలిగిస్తోంది. చాలా మంది బాలీవుడ్‌ నటులు తమ ఇండిస్టీకే చెందిన అలియా భట్‌, కృతి సనన్‌లకు పురస్కారాలు లభించినా ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడం జాతీయ చలన చిత్ర పురస్కారాల పట్ల బాలీవుడ్‌ అసంతృప్తికి దర్పణం పట్టింది. ఏదేమైనా సాహిత్యం, ప్రజా కళలు, చిత్ర రంగం ప్రజలను ప్రభావితం చేసే శక్తిమంతమైన మాధ్యమాలు. స్వార్థపూరిత స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగించుకోజూడడం విచారకరం. స్వేచ్ఛగా, స్వతంత్రంగా సాహిత్యం, కళలు వర్ధిల్లేలా చూడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపైనా ఉంది.