- చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తోన్న జియో మైసూర్ సంస్థ
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం తవ్వకాల కోసం జియో మైసూర్ సంస్థకు భూములు ఇచ్చిన రైతులకు లీజు డబ్బులు అందడం లేదు. భూములు తీసుకున్న తర్వాత ఐదు సంవత్సరాలకు సంబంధించి లీజు మాత్రమే ఆ సంస్థ చెల్లించింది. ఇంకా 11 సంవత్సరాల లీజు బకాయి ఉంది. తవ్వకాలు ప్రారంభం కాలేదనే పేరుతో లీజు చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. నెల రోజుల నుంచి తవ్వకాలు ప్రారంభమైనా లీజు బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. దీంతో, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గోల్డ్ మైనింగ్ ద్వారా టన్ను మట్టి నుంచి 1.5 నుంచి 2 గ్రాములు బంగారం ఉత్పత్తి అవుతుంది. మట్టి నుంచి ముడిసరుకును వేరుచేసి ఇతర ప్రాసెస్ పనులు పూర్తి చేయడానికి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది. తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ 2004లో నిర్ధారించింది. దీంతో, మైనింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత 2005లో జియో మైసూర్ సంస్థ తుగ్గలి మండలం జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ నిర్వహణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. అప్పటి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఇందుకు అనుమతులు మంజూరయ్యాయి. 2014లో ఇందుకు సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభించింది. 2006లో 700 మంది రైతుల నుంచి 1500 ఎకరాలను లీజుకు తీసుకుంది. ఎకరాకు ఏటా రూ.18,500 లీజు చెల్లించడానికి ఒప్పుకుంది. తొలి మూడేళ్లు రైతులకు సక్రమంగానే లీజు చెల్లించింది. ఆ తర్వాత నుంచి లీజు చెల్లించడం మానేసింది. రైతులు పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడంతో గత దసరాకు రెండు సంవత్సరాల లీజు మొత్తాన్ని చెల్లించింది. ఆ తర్వాత నుంచి మళ్లీ లీజు చెల్లించడం లేదు. బంగారం మైనింగ్ కోసం తీసుకున్న భూములకు లీజు చెల్లింపులో ఇంత జాప్యం జరుగుతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం సోలార్, విండ్ ఎనర్జీ కోసం భూములిచ్చే వారికి ఏడాదికి రూ.30 వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్తుండడం గమనార్హం.
రైతుల నుంచి భూముల కొనుగోలు
మొత్తం 1500 ఎకరాల్లో 150 ఎకరాలను రెండు నెలల క్రితం కొనుగోలు చేసింది. ఎకరా ఒక్కంటికీ రూ.13 లక్షలు చెల్లించింది. మిగతా 1350 ఎకరాలకు సంబంధించి 630 మంది రైతులకు లీజు చెల్లించడం లేదు. జియో మైసూర్ పేరు మీద లీజు ఉండడంతో రైతులు ఆ భూముల మీద బ్యాంకుల్లో రుణాలు తీసుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. ఆ భూముల రైతులకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు కూడా పొందే వీలులేకుండా అయింది. కంపెనీలో ఉద్యోగం ఇస్తామని, లీజు చెల్లిస్తామని, గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పడంతోనే కంపెనీకి భూములు ఇచ్చామని, ఇప్పుడు లీజు చెల్లించకపోవడంతో తమకు భూమిపై ఆదాయం లేకుండాపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆ సంస్థలో అప్పట్లో చెప్పింది.
ఆలస్యమైనా చెల్లిస్తాం
గోల్డ్ మైనింగ్ కోసం 1500 ఎకరాలు లీజుకు తీసుకున్నాం. ఇందులో 150 ఎకరాలు ఇప్పటికే కొనుగోలు చేశాం. మరో 200 ఎకరాలు కూడా కొనుగోలు చేయనున్నాం. మిగిలిన 1,150 ఎకరాలూ మా కంపెనీ లీజులోనే ఉన్నాయి. లీజు చెల్లించడం ఆలస్యం కావచ్చు కానీ చెల్లించకుండా ఉండం. తప్పకుండా చెల్లిస్తాం.
- హనుమ ప్రసాద్, సిఇఒ, జియో మైసూర్ కంపెనీ
తక్షణం చెల్లించాలి
లీజుల పేరుతో పరిశ్రమలు రైతులను దగా చేస్తున్నాయి. గోల్డ్ మైనింగ్ పేరుతో రైతులను పంటలు వేసుకోనీయలేదు. లీజు చెల్లించకుండా కంపెనీ తాత్సారం చేస్తోంది. ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. రైతులకు లీజు బకాయిలు తక్షణం చెల్లించే చర్యలు తీసుకోవాలి.
- జి.రామకృష్ణ, ఎపి రైతు సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి










