Jul 27,2023 22:20

- లంకల్లోకి చేరిన వరద నీరు
- ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు
- అనేక గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ప్రజాశక్తి - యంత్రాంగం :ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సహా ఎపిలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. కాటన్‌ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి దగ్గరలో వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇదే సమయంలో భద్రాచలం వద్ద 48.10 అడుగుల నీటి మట్టం నమోదైంది అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. దిగువకు 12 లక్షల క్యూసెక్కుల వరకూ వరదనీటి ప్రవాహం ఉండటంతో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం కాటన్‌ బ్యారేజీ వద్ద 13.70 అడుగల నీటి మట్టం నమోదైంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. బ్యారేజీకి చెందిన 175 గేట్లను పైకి లేపి 12,63,605 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద నీరు చేరవచ్చని ఇరిగేషన్‌ అధికారుల అంచనా వేస్తున్నారు. దిగువకు పెద్దమొత్తంలో నీటిని విడుదల చేయడంతో లంకల్లోకి వరద ప్రవేశించింది. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో పెదపట్నం లంక, బి.దొడ్డవరం, అప్పనపల్లికి వెళ్లే రహదారిలోకి వరదనీరు చేరింది. కోటిపల్లి రేవును పూర్తిగా మూసేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో గోష్పాదక్షేత్రంలో ఆలయాల వద్దకు వరద నీరు చేరింది.
పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 34 మీటర్లు దాటింది. దీంతో దిగువకు 11.78 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుక్కునూరు ఎ-బ్లాక్‌కు చెందిన దాదాపు 200 కుటుంబాలు కివ్వాక పునరావాస కాలనీకి తరలివెళ్లాయి. దాచారం, కుక్కునూరు, ముత్యాలంపాడు, వింజరం, సీతారాంనగరం, శ్రీధర్‌ గ్రామాల మధ్య కాజ్‌వేలు నీట మునగడంతో 20 గ్రామాలకుపైగా రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరు, బూర్గంపాడు మధ్యలో ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం వెళ్లే బస్సులు కుక్కునూరు నుంచి వెనక్కి తిరుగుముఖం పడుతున్నాయి. తమ్మిలేరు రిజర్వాయర్‌కు వరద నీరు భారీగా చేరడంతో ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తమ్మిలేరు రిజర్వాయర్‌ గరిష్ట నీటిమట్టం 355 అడుగులు కాగా ప్రస్తుతం 345 అడుగులకు వరద నీరు చేరింది. ఏజెన్సీలోని జల్లేరు రిజర్వాయర్‌కు, ఎర్రకాల్వ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వస్తోంది. దిగువకు నీరు విడుదలచేస్తే జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం మండలాలతోపాటు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, భీమవరం, తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు ప్రాంతాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. తమ్మిలేరు ప్రాజెక్టు నుంచి వరదనీరు దిగువకు విడుదల చేస్తే జిల్లా కేంద్రం ఏలూరును సైతం వరద నీరు చుట్టుముట్టనుంది.

  • ఆంధ్ర- ఒడిశా మధ్య నిలిచిన రాకపోకలు

అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద శబరి నది 41.6 మీటర్ల నీటిమట్టం నమోదైంది. కొయుగురు వాగు పొంగి ప్రవహించటంతో రెండు రోజులుగా ఆంధ్ర - ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చట్టి వద్ద జాతీయ రహదారి - 30 పైకి వరద నీరు చేరడంతో భద్రాచలం - చింతూరు మధ్య రవాణా సౌకర్యం నిలిచిపోయింది. సోకులేరు వాగు పొంగి ప్రవహించడంతో చింతూరు - విఆర్‌.పురం మండలాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. విఆర్‌.పురం మండలంలోని ఒడ్డిగూడెం, అడవి వెంకన్నగూడెం, రామవరం, సోంపల్లి, సుష్టివారిగూడెం, చింతరేగు పల్లి, గుర్రంపేట, విఆర్‌.పురం గ్రామాల చుట్టూ నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శ్రీరామగిరి, కొల్లూరు, కోటార్‌ గొమ్ము, ములకలపల్లి జలదిగ్బంధనంలో ఉండటంతో అధికారులు అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అలాగే భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న మురుమూరు వద్ద నీళ్లు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని పలు గ్రామాల సమీపంలోకి వరద నీరు వచ్చి చేరింది. విఆర్‌.పురంలోని వరద బాధిత గ్రామాలైన ఒడ్డుగూడెం, అడవి వెంకన్నగూడెం, శ్రీరామగిరిల్లో సిపిఎం నాయకులు పర్యటించి బాధితులను పరామర్శించారు.

  • వరదల్లో మమ్మల్ని వదిలేశారు

గోదావరి వరదల్లో ఇల్లు మునిగిపోయి సర్వం కోల్పోతున్న మమ్మల్ని ప్రభుత్వం, అధికారులు వదిలేశారు. తాజా వరదల్లో మా ఇల్లు మునిగిపోయింది. గ్రామాన్ని వదలి గుట్టపైకి వచ్చి గుడారం వేసుకున్నాం. ప్రభుత్వం నుంచి సాయం కరువైంది. పునరావాస కేంద్రాలకు సైతం తీసుకెళ్లలేదు. కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి వెళ్లిపోయారు. ఎలా వండుకోవాలి.. ఏం తినాలి. పైన వర్షం, కింద వరద. ఇటువంటి సమయంలో ఉప్పు, పప్పు, కారం, కొవ్వొత్తులు వంటివి కూడా ఇవ్వకపోవడం చాలా దారుణం.
బగ్గ రామమ్మ, కుమ్మూరు గ్రామం, చింతూరు మండలం

victims
  • మాపై ఇంత చిన్నచూపా..

పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మాపై చిన్నచూపు తగదు. గుడారం వేసుకుందామంటే బరకాలు కూడా ఇవ్వలేదు. బుధవారం నుంచి తిండి లేక అలాగే ఉన్నాం. పాల ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు కూడా అందించలేదు. ఏ అధికారీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు.
పోర్తుల సాయి, ఒడ్డుగూడెం, విఆర్‌.పురం మండలం

  • శ్రీశైలానికి వరద నీరు

శ్రీశైలం జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు ప్రస్తుత నీటి మట్టం 817.70 అడుగులుగా ఉంది. జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 39.2025 టిఎంసిలుగా ఉంది. తుంగభద్ర డ్యాం నీటినిలువ సామర్థ్యం 105.78 టిఎంసిలకు గాను ప్రస్తుతం 49.76 టిఎంసిలుగా నమోదయింది. ఇన్‌ప్లో 1,11566 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి1,37,294 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1,36,850 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

varada
  • హైదరాబాద్‌-విజయవాడకు స్తంభించిన రాకపోకలు

ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో మునేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారి (ఎన్‌హెచ్‌ 65)పైకి వరద నీరు చేరింది. రహదారిపై రెండు అడుగులకుపైగా వరద ప్రవహిస్తోంది. దీంతో ఎపి-తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వందలాది వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ వైపు వచ్చే వాహనాలను ఐతవరం వద్ద, హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను కీసర టోల్‌ గేట్‌ వద్ద నిలిపివేశారు. కంచికచర్ల మండలం కీసర వద్ద మునేరు, వైరా ఏరు, కట్టలేరు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నందిగామ మండలం కంచెల వద్ద మునేరు వరదల్లో పది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు చిక్కుకున్నారు. ఉదయం పొలానికి వెళ్లిన వీరు తిరిగి వచ్చే క్రమంలో వరద పెరగడంతో చిక్కుకుపోయారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు వీరిని రక్షించాయి.