Nov 20,2023 13:19

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా నష్టపోయిన ప్రతి పంటకు నష్టపరిహారం ఇవ్వాలి అని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ వాస్తవంగా సాగులో ఉన్న కౌలు రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. బ్యాంకు రైతుల అప్పులు మాఫీ చేయాలన్నారు. ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించి రోజుకు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో పుట్లూరు మండల కేంద్రంలోని తహశీల్దార్‌ ఆఫీస్‌ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ మల్లేష్‌ ప్రసాద్‌ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయనీ.. ఆగస్టు సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో వర్షాలు రాకపోవడంతో వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, జన్న, మొక్కజన్న, తదితర పంటలు పూర్తిగా నష్టపోయాయన్నారు. '' జిల్లాలోని మొత్తం 31 మండలాలకుగాను 28 మండలాలను కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 31న ప్రకటించింది. పంట నష్టపరిహారం అంచనాల కోసం ఈనెల 14న జీవో నెంబర్‌ 5న విడుదల చేసింది. ఇందులోని నిబంధనలను రైతులకు ఉపశమనం కలిగించే విధంగా లేకపోగా తీవ్ర నష్టం చేస్తాయి. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన సమయంలో 33 శాతం పైగా పంట నష్టం జరిగి ఉండాలని గరిష్టంగా రెండు హెక్టార్లకు మాత్రమే పరిహారం ఇవ్వాలని, వేరుశనగ పత్తి పంటలు పెట్టుబడి ఖర్చు ఎకరాక 45,000 అవుతుండగా ప్రస్తుత నిబంధనల వల్ల ఎకరా కేవలం 6800 రూపాయలు మాత్రమే అందుతుంది. అలాగే ఇతర పంటల పరిహారం ఇచ్చే పరిస్థితి కూడా రైతులను ఆదుకునే విధంగా లేదు. పంటల సాగుకు బ్యాంకులు పెట్టుబడి రుణం ఇవ్వడానికి నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా పంట నష్టపరిహారం ఇవ్వాలి '' అని కోరుతున్నామన్నారు.