Sep 26,2023 07:02

           ఆంధ్రప్రదేశ్‌లో సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేస్తానన్న మాట అమలు కోసం గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఉద్యోగి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కనీసం ఎన్నికల ముందయినా ఇచ్చిన మాటను నిలబెట్టు కొంటారన్న ఆశ, ఇప్పుడు అడుగంటిపోయింది. మానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన మొదటి హామీనే సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తామని. హామీని నిలబెట్టుకోక పోవడంతో...ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
         గత ఎన్నికల ముందు 2018 డిసెంబర్‌ 11న శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పాదయాత్ర సందర్భంగా ''మేం ఎన్నికల్లో గెలిస్తే ఉద్యోగులు కోరుకున్న విధంగా సిపిఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇస్తున్నాం'' అని వైఎస్‌ జగన్‌ అన్నారు. కానీ నేడు ''సిపిఎస్‌ రద్దు చేస్తున్నాం. గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌ ప్రవేశపెడుతున్నాం. రిటైర్మెంట్‌ నాటి బేసిక్‌ వేతనం మీద 50 శాతం పెన్షన్‌ గ్యారంటీ చేస్తున్నాం. ఇది దేశానికే ఆదర్శం కాబోతోంది'' అని ఎ.పి.ఎన్‌.జి.వోల సమావేశంతో సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించడంతో...ఇక ఈ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గానికి అర్ధమైంది. తాజా క్యాబినెట్‌ భేటీలో కొత్త పెన్షన్‌ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల హామీకి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఒ.పి.ఎస్‌) పున:ప్రవేశ పెట్టడం పెనుభారంగా మారుతుంది కాబట్టి కొత్త విధానం తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ శాసన సభ సమావేశాలలో గ్యారంటీ పెన్షన్‌ విధానం (జిపిఎస్‌) బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
            ప్రస్తుతం అమలులో ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎస్‌)ను 2003 నుంచి అమలు చేస్తున్నారు. 2004 జనవరి 1 నుంచి విధుల్లో చేరుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు దీనిని అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి తన వేతనం నుంచి 10 శాతం, దాంతో సమానంగా ప్రభుత్వం తరపున వాటా కూడా చెల్లిస్తారు. అంతకు ముందు రిటైరైన ఉద్యోగులందరికీ ప్రభుత్వమే పెన్షన్‌ చెల్లించేది. కానీ సిపిఎస్‌ వచ్చిన నాటి నుంచి సిబ్బంది తాము దాచుకున్న మొత్తం పెన్షన్‌ నిధిగా లెక్కిస్తూ నేషనల్‌ పెన్షన్‌ స్కీం-ఎన్‌పిఎస్‌ ట్రస్టు, నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌-ఎన్‌ఎస్‌డిఎల్‌ ద్వారా షేర్‌ మార్కెట్‌లో మదుపు చేస్తారు. ఉద్యోగి, ప్రభుత్వం వాటాగా జమ చేసిన మొత్తం షేర్‌ మార్కెట్‌ ఆధారంగా పెన్షన్‌ చెల్లింపు జరుగుతుంది. దీని మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అనేక రాష్ట్రాల్లో ఉద్యోగుల ఆందోళనలతో ప్రభుత్వాలు సిపిఎస్‌ రద్దు చేసి తిరిగి పాత పెన్షన్‌ విధానం (ఒపిఎస్‌) ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించాయి.
          సిపిఎస్‌ లో పెన్షన్‌ గ్యారంటీ లేకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తుండడం వల్ల వారికి పెన్షన్‌ గ్యారంటీ చేసే విధానం తాము తీసుకొచ్చామని ఎ.పి ప్రభుత్వం అంటోంది. ఉద్యోగుల డిమాండ్‌ మేరకు సిపిఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్న ఎ.పి ప్రభుత్వం చెబుతోంది.
         ఎ.పి గ్యారంటీడ్‌ పెన్షన్‌ బిల్లు 2023 పేరుతో దీనిని పేర్కొంది. ఎ.పి క్యాబినెట్‌ ఆమోదించడంతో త్వరలోనే చట్టం అవుతుంది. ఎ.పి లో ప్రస్తుతం సి.పి.ఎస్‌ పరిధిలో ఉన్న ఉద్యోగులు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అత్యధికులకు ప్రస్తుతం సి.పి.ఎస్‌ అమలవుతోంది. దాని స్థానంలో ప్రవేశపెడుతున్న జిపిఎస్‌ కారణంగా ఉద్యోగులకు పెన్షన్‌ గ్యారంటీ అవుతుందని, దానివల్ల సమస్య తీరినట్టేనని ప్రభుత్వం అంటోంది. పాత పెన్షన్‌ విధానంలో ఎటువంటి కంట్రిబ్యూషన్‌ చెల్లించని ఉద్యోగి సిపిఎస్‌ విధానంలో కాంట్రిబ్యూషన్‌ చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారంటీ పెన్షన్‌ స్కీంలో కూడా కంట్రిబ్యూషన్‌ చెల్లించాల్సిందే. అంటే సిపిఎస్‌ జిపిఎస్‌గా మారింది తప్ప ప్రభుత్వం చెబుతున్న గ్యారంటీ పెన్షన్‌ లేదని అర్ధం అవుతుంది. పేరు మార్చారు తప్ప విధానాల్లో మార్పు లేదు. ఉద్యోగులు తన బేసిక్‌ పే, డి.ఎ నుంచి 10 శాతం కంట్రిబ్యూట్‌ చేస్తూనే ఉండాలి. ప్రభుత్వ వాటా సంగతి స్పష్టత లేదు. పెన్షన్‌ నిధిని ఎన్‌ఎస్‌డిఎల్‌కు జత చేయడం మానేస్తామని చెబుతున్నారు. గ్రాట్యూటీ చెల్లింపు లేదు. ఉద్యోగుల పెన్షన్‌ నుంచి ట్యాక్స్‌ వసూలు చేస్తారు. ఇది ప్రభుత్వానికి భారం తగ్గించుకునే ప్రయత్నంగానే ఉంది. ఉద్యోగులకు దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.
          'రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ కటింగ్‌ ఆగిపోయింది. ఎ.పి ప్రభుత్వం మాత్రం విధానపరంగా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో కనిపించడం లేదు. సిపిఎస్‌ రద్దు విషయంలో చిత్తశుద్ధి లేదు. దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటుగా వైసిపి కూడా సిపిఎస్‌ రద్దుకి సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. పేరు మారుస్తున్నప్పటికీ జిపిఎస్‌లో కూడా అనేక సమస్యలున్నాయి. రిటైర్మెంట్‌ తర్వాత బేసిక్‌లో సగం మాత్రమే పెన్షన్‌ అని చెప్పడం ద్వారా ఉద్యోగుల ఆశలను నిలువునా కూల్చేసిన పరిస్థితి ఏర్పడింది.
సిపిఎస్‌లో తీవ్ర అన్యాయం జరగడం వల్లనే ఉద్యమం వచ్చింది. నేడు ఆ ఉద్యమాన్ని నీరుగార్చుతూ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం, ప్రభుత్వ విధానానికి బాజా భజంత్రీలుగా మారి ఉద్యమ బండిని పక్కదారి పట్టించిన నాయకులకు కూడా బొప్పి కట్టే పరిస్థితి వస్తుందని ఆయా నాయకత్వాలు గమనిస్తే మంచిది. ఉపాధ్యాయ సంఘాలతో పాటుగా సాధారణ ప్రభుత్వ ఉద్యోగులలో కూడా కొత్త విధానం పట్ల పూర్తిస్థాయి అసంతృప్తి వ్యక్తమైంది.
        అవసరమైతే గ్యారంటీ పెన్షన్‌ విధానంలో ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచుతామని, దీనితో చివరి నెల వేతనంలో 50 శాతం పెన్షన్‌ వస్తుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కంట్రిబ్యూషన్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేస్తేనే అంగీకరిస్తామని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమిస్తున్నాయి. పేరు మార్చి గ్యారంటీ అన్నంత మాత్రాన దీనిని అంగీకరించేది లేదని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం తను హామీ ఇచ్చినట్లు పాత పెన్షన్‌ను అమలు చేయకుండా, సిపిఎస్‌ స్థానంలో గ్యారంటీ పెన్షన్‌ స్కీంను చట్టంగా అమోదించేస్తే, దాని ప్రభావం 2024 ఎన్నికల సమయంలో రాజకీయ ముఖచిత్రంపై కనిపించవచ్చు.

/ వ్యాసకర్త ఎ.పి.యు.టి.ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి,
సెల్‌ : 9490762412 /
ఎస్‌.పి.మనోహర్‌ కుమార్‌

2