
జన్యుమార్పిడి ఆవాలను (జి.యం మస్టర్డ్) ప్రవేశపెట్టటానికి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. కేంద్ర పర్యావరణ శాఖ కింద పని చేసే జెనిటెక్ ఇంజనీరింగ్ మదింపు కమిటీ జన్యుపరంగా మార్పు చేసిన బి.టి ఆవాలకు 2022 అక్టోబర్ 25న అనుమతించింది. భారతదేశ శాస్త్రవేత్త దీపక్ పెంటేల్ ప్రభుత్వ నిధుల సహాయంతో 'ధారా మస్టర్డ్ హైబ్రిడ్-డిఎంహెచ్-11' విత్తనాలను అభివృద్ధి చేశారు. వీటిని బహిరంగంగా పొలాలలో ప్రయోగాత్మకంగా సాగు చేయటానికి, ప్రదర్శనకు, విత్తనాల ఉత్పత్తికి అనుమతించారు.
జన్యుపరంగా మార్పు చెందిన ఆవాల పంట మన దేశంలో తేనె ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని జన్యుమార్పిడి పంటలో వచ్చిన తేనెను విదేశాలు కొనవనీ, విదేశీ మారకద్రవ్యం రాదనీ గ్లూఫోసినేట్ హెర్బిసైడ్ కలుపు మందు ఆవ పంటలో వాడితే, ఎవరూ కొననందున తమ బతుకులు బజారున పడతాయని తేనె సాగుదారులు ఆందోళనకు దిగారు. రైతులు 150,000 టన్నుల తేనెను తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇది మనకు రూ.75,000 కోట్లు ఆర్జించే తేనె ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. జి.యం ఆవాలతో తేనెటీగ జనాభా నశిస్తుంది. నేడు, తేనెటీగల రైతులు ఆధారపడిన ఏకైక సహజ పంట ఆవాలు.
ప్రజాప్రయోజనాల దృష్ట్యా సామాజిక కార్యకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జన్యుమార్పిడి పంటల సమస్యను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని కోర్టుకి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ (2013), జన్యు మార్పిడి పంటలను పరిశీలించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నివేదికలు ఏకగ్రీవంగా జన్యుమార్పిడి పంటలపై పూర్తి నిషేధాన్ని సిఫార్సు చేశాయి. మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్యం, జీవ వైవిధ్యంపై దీర్ఘకాలిక ప్రభావం గురించి ఎటువంటి అధ్యయనాలు నిర్వహించనందున హెర్బిసైడ్ (కలుపు మందులు) వాడే పంటలపై పూర్తి నిషేధాన్ని విధించాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసిందని కోర్టుకు గుర్తుచేశారు. జన్యుమార్పిడి పంటలపై స్వతంత్ర అధ్యయనం చేయకుండా స్వంత ఆర్థిక ప్రయోజనాలున్న కంపెనీలే ప్రయోగాలు, అధ్యయనాలు చేయటం, ఆ రిపోర్టులపై ఆధారపడి పర్యావరణ అనుమతులివ్వడం తగదని ప్రశాంత్ భూషణ్ నివేదించారు. జన్యుమార్పిడి ఆవాల విత్తనాలపై యథాస్ధితిని కొనసాగించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆహారంలో జన్యుమార్పిడి పదార్ధాలను ప్రవేశపెట్టే ముందు అందరికీ తెలిసేటట్లుగా క్షేత్ర ప్రయోగాలు భారీ ఎత్తున పారదర్శకంగా జరగాలి. కానీ జరగలేదు. తేనెటీగలు, తేనెపై బతికే వారి సమస్యలే కాకుండా ఆవాలు తిన్నందువలన, ఆవ నూనె వాడినందువలన మనుషులపై, తాగే నీటిపై, పశువులపై, భూమిపై, పర్యావరణంపై ప్రభావం ఏమిటో తెలుసుకునేందుకు తాత్కాలిక, దీర్ఘకాలిక పరిశోధనలు జరగాలి. ఆహార భద్రత అంశాన్ని శాస్త్రీయంగా పరిశోధనలతో నిర్ణయించాలి. అలాంటిది రాజకీయ ప్రయోజనాలను, వ్యాపార ప్రయోజనాలను, విదేశీ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని అగ్ర రాజ్యాల ఒత్తిడికి లొంగి నిర్ణయం చేయటమంటే మన దేశ స్వాతంత్య్రాన్ని అమ్ముకోవటమే. కలుపు నివారణ మందులను, జన్యుమార్పిడి హైబ్రిడ్ విత్తనాలను అమ్ముకోవాలనీ, లాభాలను దండుకోవాలనీ కంపెనీలు తహతహలాడుతున్నాయి. ఒక పక్క ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అంటూ ప్రచారం చేస్తూ మరోపక్క భూమిని, భూసారాన్ని, ప్రజారోగ్యాన్ని నాశనం చేసే జన్యుమార్పిడి పంటలకు, కలుపు మందుల పంటలకు అనుమతులనిస్తున్నది. భూమికి, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమన్న రుజువుల కారణంగా గ్లైఫోసేట్ కలుపు నివారణ మందులను నిషేధించక తప్పలేదు. ప్రభుత్వ వైఫల్యం వలన ప్రమాదకరమైన నిషేధిత మందులు కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. కలుపు మందులు అమ్ముకోవటానికి వీలుగా విత్తనాలనే జన్యుమార్పిడి చేశారు. కలుపు మందులతో భూమికి, మనిషికి, పశువులకు, వాతావరణానికి ప్రమాదమని నిర్ధారించి నిషేధించారు. మరోపక్క హెర్బిసైడ్ టాలరెంట్ జన్యుమార్పిడి ఆవాల పంటలకు అనుమతించి హెర్బిసైడ్ కలుపు నివారణ మందులను యథేచ్ఛగా వాడుకోమంటున్నారు. బిజెపి ఎన్నికల ప్రణాళికలలో ఆహారంలో జన్యుమార్పిడి పంటలను, హెర్బిసైడ్ కలుపు నివారణ మందులకు అనుమతులు ఇవ్వమన్నారు. ఆచరణలో జన్యుమార్పిడి పంటలకు హెర్బిసైడ్ కలుపు నివారణ మందుల వ్యాపార కంపెనీలకు స్వేచ్ఛనిచ్చి ప్రజలను మోసంచేస్తున్నారు.
జన్యుమార్పిడి పంటలతో పాటుగా, హెర్బిసైడ్స్ వాడకం వలనభూమి నాశనమవటం వలన ఏ మందులకూ లొంగని ''సూపర్ వీడ్స్'' వృద్ధి చెందుతున్నాయి. ఇంకా ఎక్కువగా పురుగు మందులు వాడాల్సిన అవసరం పెరిగి భూమి, పర్యావరణం మరింతగా నాశనమైౖ...క్యాన్సర్ లాంటి జబ్బులతో మానవుని మనుగడ ప్రశ్నార్ధకమౌతుంది. జన్యమార్పిడి ఆవాల పంటవలన ఆవాల దిగుబడి పెరిగి ఆవనూనె దిగుమతులను తగ్గించవచ్చనీ, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చనీ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. ఎన్‌డిడిబి-డిఎంహెచ్-1 సాంప్రదాయ విత్తనంతో 2924 కేజీల దిగుబడిని, ఎన్‌డిడిబి-డిఎంహెచ్-4 సాంప్రదాయ విత్తనంతో 3012 కేజీల దిగుబడిని సాధించారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న జన్యుమార్పిడి హెర్బిసైడ్ టాలరెంటు విత్తనం జి.ఎం ఆవాల వలన 2626 కేజీల దిగుబడి మాత్రమే వచ్చింది. అదేమంటే మీరు సైన్సుకు వ్యతిరేకం అని దబాయిస్తున్నారు.
ఆవనూనెను దక్షిణ భారతదేశంలో వాడరు. ఆవ నూనెను ఉత్తర భారతదేశంలో విరివిగా వాడతారు. విస్తారంగా పండిస్తారు. మన దేశంలో వంటనూనెల ఉత్పత్తిలో 40 శాతం ఆవనూనెదే. ఆవపంటను 80 లక్షల ఎకరాలలో 60 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. 1993-1994 లోనే, ఆవనూనెలో స్వయం సమృద్ధిని సాధించారు. విదేశాల నుండి దిగుమతి చేస్తున్న పామాయిల్, సన్‌ఫ్లవర్ వంటనూనెలకు దిగుమతి సుంకాలను తగ్గించి సింగపూర్, ఇండోనేషియా, ఉక్రెయిన్ ప్రభుత్వాలకు సహాయం చేస్తున్నారు. మన దేశంలోని పామాయిల్, వేరుశనగ, నువ్వుల నూనె, కొబ్బరినూనె రైతులకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారంటీ లేదు. లాభసాటి ధర, గిట్టుబాటు ధరల మాటే లేదు. ప్రకృతి వైపరీత్యాలలో రైతుకు దిక్కే లేదు. 2022 సంవత్సరానికి రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్దానాన్ని మరిచారు.
యూరప్ దేశాలు జి.ఎం పంటలను గట్టిగా వ్యతిరేకించాయి. యూరప్ ప్రజలు తినని ఆహారం మనం ఎందుకు తినాలో ప్రభుత్వం చెప్పాలి. తినే ఆహారంలో విషతుల్యమైన జన్యుమార్పిడి పదార్ధాలు వున్నాయేమోనని అమెరికా ప్రజలు అనుమానిస్తున్నారు. ఆహార పదార్ధాలపై జి.యం లేబుళ్లు అతికించమని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. శక్తివంతమైన విత్తన సంస్ధల ఒత్తిడికి లొంగి మాన్సాంటో, బేయర్స్ కంపెనీలకు అనుమతులు, పేటెంట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మన దేశంలో జన్యుమార్పిడి పంటలను, ఆహారాన్ని అనుమతించబోమని ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చెప్పిన బీజేపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత పంధా మార్చుకుంది. బహుళజాతి సంస్థల ఒత్తిడికి ప్రభుత్వం లొంగిపోయింది. విత్తన కార్పొరేట్ కంపెనీలు ధారా మస్టర్డ్ హైబ్రిడ్ డిఎంహెచ్-11 అమ్మకాలకు అనుమతులు పొందాయి.
అమెరికాలో ''లైబిలిటీ లా'' వుంది. పరిశోధనల ఫలితాలకు భిన్నంగా దుష్ట పరిణామాలు సంభవిస్తే ఎవరు బాధ్యులో నిర్ణయించి తగిన చర్యలు చేపడ్తారు. మన దేశంలో, మీకేమీ కాదన్న ప్రభుత్వం, దిగుబడులు పెరుగుతాయన్న కంపెనీలు, ఆరోగ్యానికి ఢోకా లేదన్న జిఇఎసి సభ్యులు, ప్రభుత్వం - ఎవరిదీ బాధ్యత?
వివిధ వాతావరణ పరిస్ధితులున్న భారతదేశం జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. వైవిధ్యమైన జన్యు వనరులున్నాయి. మన విత్తనోత్పత్తి చాలా శక్తివంతమైనది. మన రైతులు ప్రపంచంలోనే అతిపెద్ద విత్తనోత్పత్తిదారులు. జీవ వైవిధ్యం మన గొప్ప బలాలలో ఒకటి. అది నాశనం చేసి ఒకటే దేశం, ఒకటే విత్తనం, ఒక్కటే పంట అంటూ విశాల భూక్షేత్రాలలో మోనోక్రాప్‌తో కోర్పొరేట్ స్ధాయి వ్యవసాయం వైపు నడిపిస్తున్నారు.
ఇప్పటికే 86 శాతం మంది చిన్న రైతులు ఒత్తిడిలో ఉన్నారు. జి.ఎం టెక్నాలజీ పేరున కంపెనీలు దారుణంగా పెంచుతున్న రేట్లలో ఖరీదైన జి.యం విత్తనాలను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. పెరుగుతున్న ధరలతో ఎరువులను కొనలేరు. పెంచనున్న విద్యుత్ చార్జీలను భరించలేరు. అప్పులను కట్టలేరు. కనీల ధరకు చట్టపరమైన గ్యారంటీ లేదు. వారేం చేయాలి. వారి పరిస్థితి ఏంటి? ఢిల్లీ సరిహద్దులలో సంవత్సరం పైగా సాగిన రైతాంగ పోరాటమే రహదారి. అదే స్ఫూర్తితో మరింత శక్తివంతంగా సాగించే రైతాంగ పోరాటాలే వ్యవసాయ సమస్యలన్నిటికీ పరిష్కారం.
వ్యాసకర్త డా|| కొల్లా రాజమోహన్- సెల్ : 9000657799