అక్టోబరు 3, 2023 తెలుగు కవిత్వంలో ఒక గుర్తుంచుకోదగిన రోజు. 30 ఏళ్ళ కిందట తెలుగు కవిత్వాన్ని ఒక కుదుపు కుదిపిన 'నీలిమేఘాలు' నాల్గవ ముద్రణ హైదరాబాదులో ఆవిష్కరణ జరిగిన రోజు. మళ్ళీ మూడు దశాబ్దాల తర్వాత అదే నగరంలో ఆవిష్కరణకు అందరూ కలిసిన రోజు.
తెలుగు కవిత్వంలో భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం ... ఇలా ఎన్నో విభిన్న పాయ లున్నాయి. ఇంచుమించు ఈ కవిత్వమంతా పురుషులు రచించిందే. పితృస్వామ్య వ్యవస్థలో సమాజం, సాహిత్యం, కవిత్వం అన్నిట్లో పురుషులదే పైచేయి. స్త్రీల ప్రవేశం, పాత్ర ఇంచుమించు శూన్యం అని చెప్పవచ్చు. స్త్రీలూ పురుషులూ సమానమే అన్నారు. ఆకాశంలో సగం అని అతిశయోక్తులు పలికారు. వాస్తవంలో మాత్రం అంతా విరుద్ధమే !
కవిత్వం మీద కాపీ రైటు మాదే అన్నారు. అందుకే పురాణ యుగంలో నన్నయ, తిక్కనల దగ్గర నుంచి శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, అజంతా, బైరాగి, నగముని, చెరబండ రాజుల వరకు అందరి పేర్లూ పురుషులవే. ఎక్కడా స్త్రీల పేర్లు కనిపించవు. ఆనాడు ప్రబంధ యుగంలో కవులందరు స్త్రీలంటే శరీరాలే అని భావించారు. అంగాంగ వర్ణన చేశారు. భావకవులు మాత్రం ఊర్వశి, ప్రేయసి అని భావించారు. మాతృదేవత అని పూజించారు. కానీ విచిత్రం ఏమిటంటే ఎవరూ స్త్రీలను తమతో సమానంగా మనుషులుగా భావించలేదు. 'ఆమె కన్నులలో ననంతాం బరపు నీలినీడలు కలవు' అని చెప్పారు. స్త్రీల బాధలు, అనుభూతుల గురించి ఎవరూ నోరు విప్పి చెప్పలేదు.
సమాజంలో స్త్రీ పురుషులకు వేరు వేరు ధర్మాలు. పురుషుడు మహారాజు. స్త్రీ బానిస. చదువులో, ఉద్యోగాల్లో, సాహిత్యంలో, రాజకీయంలో అన్నిటా అసమానతలు. కనిపించని సంకెళ్ళు, మాటలకందని హింస. అంతా బాగున్నట్లే వుంటుంది. కానీ లోపల ఏమీ బాగా లేకపోవడం వివాహం, సంతానం, ఉద్యోగం అన్నిట్లో అణచివేత. ఈ సమయంలో 80లలో స్త్రీవాద కవిత్వం ప్రారంభమైంది. 81లో రేవతీదేవి అనురాగ దగ్థా సమాధి వచ్చింది. 84లో సావిత్రి బందిపోట్లు వచ్చింది. ఇక అక్కడ నుంచి పితృస్వామ్యం నిర్ణయించిన నీతులను బద్దలు కొడుతూ, లేబర్ రూం, అబార్షన్ స్టేట్‌మెంట్, జుగల్‌బందీ, వంటిల్లు, సర్పపరిష్వంగం, పైటను తగలేస్తాను కవితలు వచ్చాయి. కవిత్వరంగంలో పెను సంచలనాన్ని కలిగించాయి. 10 ఏళ్ళ తర్వాత ఓల్గా గారు స్త్రీవాద కవితలతో ఒక సంకలనం తేవాలని సంకల్పించారు. 31 మంది కవయిత్రులతో 'నీలిమేఘాలు' కవితాసంపుటి ప్రచురించారు. 30 ఏళ్ళ కిందట హైదరాబాదులో ఆవిష్కరించారు.
మళ్ళీ 3 దశాబ్దాల తర్వాత రవీంద్ర భారతిలో నీలిమేఘాలు ఆవిష్కరణ సభకు వెళ్తున్నపుడు మనసులో కలిగిన జ్ఞాపకాలివి. ఆ రోజు సాయంత్రం రవీంద్రభారతి ఆవరణలో అడుగుబెడుతూనే ఎస్. రఘు గారు చిరునవ్వుతో ఆహ్వానించారు. మీ 'ద్విపాత్రాభినయం' మా యూనివర్శిటీ వాళ్ళకు 6 ఏళ్ళుగా సిలబస్‌లో ఉన్నదని చెప్పారు. ఆయన ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్. ఇంకా లోపలికి వెళుతున్నాను. సభాప్రాంగణం లోనే ఓల్గా గారు కూర్చున్నారు. ఓల్గా గారితో మాటలాడి సభలోకి అడుగుపెడుతూనే మెర్సీ మార్గరెట్ వచ్చి... ఈ సభ అంతా సర్పాలే. పాకుతున్న సర్పాలే. మీ సర్పపరిష్వంగం కవితే నాకు పదే పదే గుర్తుకువస్తుంది అన్నది. ఆ తర్వాత ఎంతోమంది పలకరించారు. మృణాళిని గారు మాటలాడారు. అప్పటికే కొండేపూడి నిర్మల, కుప్పిలి పద్మ వచ్చారు. సభ మొదలయింది. వేదిక మీద మృణాళిని గారు, నీరజ గారు, సూరేపల్లి సుజాత, మెర్సీ మార్గరెట్, పింగళి చైతన్య ఉన్నారు.
స్త్రీవాద కవిత్వం విద్యార్థులను ఎలా ప్రభావితం చేసిందో మృణాళిని చెప్పారు. హైదరాబాద్ సిటీ కాలేజీలో లెక్చరర్ జె.నీరజ గారు 'ఈ రోజు సారంగలో నీలిమేఘాల మీద మందరపు హైమవతి రాసిన వ్యాసం బావుంది' అనే మాటలతో తన ఉపన్యాసం మొదలుపెట్టారు. సూరేపల్లి సుజాత- నీలిమేఘాలులోని కవితల గురించి చెప్పారు. ఆ తర్వాత పింగళి చైతన్య 'నీలిమేఘాలు' తన జీవితంపై కలిగించిన ప్రభావం గురించి చెప్తూ... ఆత్మహత్య చేసుకోవాలనిపించిన ఒకానొక సమయంలో నీలిమేఘాలు ఎలా ధైర్యమిచ్చిందో, నిత్య జీవితంలో లేబర్ రూం, వంటిల్లు, సర్పపరిష్వంగం, జుగల్‌బందీ కవితలు ఎలాంటి ప్రభావం కలిగించాయో, ఎంత ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయో చెప్పారు. ఒక గొప్ప భావోద్వేగంతో చేసిన ఆ ప్రసంగం శ్రోతలను విపరీతంగా ఆకర్షించింది. పైగా తను మాట్లాడుతూ ఈ సభ ఇలా జరగకూడదు. వేదిక మీద కాకుండా కింద అందరూ కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది అన్నారు. ''ఈ ఆనంద సమయంలో డాన్స్ చేయాలి. పాటలు పాడాలి. 30 ఏళ్ళ తర్వాత ఇలా ఈ సంపుటి ఆవిష్కరణ జరగడం ఎంతో ఆనందంగా వుంది. ఉద్వేగంగా ఉంది. ఈ కవయిత్రులందరూ మా దృష్టిలో హీరోయిన్లు. ఈ సభ తర్వాత మేమొక సభ పెడతాము. ఈ కవయిత్రులందర్ని పిలిచి మాట్లాడతాము. కొంతమంది రాయడం ఆపేసారు. ఎందుకు ఆపేసారో ప్రశ్నలడుగుతాము. కొన్ని సందిగ్ధ సమయాల్లో, కొన్ని సంక్షుభిత సమయాల్లో మాకు వెన్నుతట్టి ధైర్యమిచ్చిన ఈ కవితలు రచించిన కవయిత్రులు, మమ్మల్ని ఆత్మవిశ్వాస గీతికలుగా మార్చిన కవయిత్రులకు అభినందనలు'' అని ఉద్వేగపూర్వకంగా మాటలాడారు.
ఆ తర్వాత మెర్సీ మార్గరెట్- తన కవిత్వ జీవితాన్ని నీలిమేఘాలు, నల్లపొద్దు సంపుటాలు ఎలా ప్రభావితం చేసాయో చెప్పారు. కవితా రంగంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పారు. 'నేను రాసినవి కవితలే కాదన్నారు. ఒక దళితుని మీద ఉచ్చపోస్తే ఆ సంఘటన గురించి కవితా సంపుటి తెస్తున్నాను అని తెలిసి- మణిపూర్ సంఘటన మీద కూడా కవితా సంపుటి తెమ్మన్నారు. ఒకపక్క కులాలుగా, గ్రూపులుగా విడిపోయిన కవులు ఎలా స్పందిస్తారో తెలియక తేవడం లేదు' అన్నారు. అప్పటికంటే ఇప్పుడే వివక్ష ఎక్కువగా ఉందని అన్నారు.
తర్వాత కొండేపూడి నిర్మల, విమల, ఘంటశాల నిర్మల, సుధ, బి.పద్మావతి, కె.వరలక్ష్మి, జయ, మందరపు హైమవతి కవితలు చదివారు. చాలామంది 'నీలిమేఘాలు'లో కవితలు చదివారు. నేనూ 'సర్పపరిష్వంగం' చదివాను. 'ఓల్గా గారు ఈ సభకు రమ్మన్నారు. తప్పకుండా రమ్మని చెప్పారు. 30 ఏళ్ళ తర్వాత నీలిమేఘాల పునర్ముద్రణ జరిగిన ఈ చారిత్రక సందర్భంలో పాల్గొనడాన్ని నేను ఆనందిస్తున్నాను. గర్విస్తున్నాను' అని చెప్పి 'సర్పపరిష్వంగం' కవిత చదివాను. 'జీతమెప్పుడిస్తారు' ఆ వాక్యం చదవగానే సభంతా చప్పట్లు. చాలా మంచి స్పందన వచ్చింది.
ఈ సభ విశేషం ఏమిటంటే సభలో అందరూ కొత్తవాళ్ళు. యూనివర్శిటీ విద్యార్థులు, యువతరం ఉన్నారు. శ్రద్ధగా విన్నారు. సభ అంతా సజీవ స్రవంతిలాగా సాగింది. ఒక ఉత్సాహపూరిత, ఉద్విగభరిత వాతావరణంలో కవిత్వం పల్లవించింది. పరిమళించింది. యాంత్రిక జీవితాలతో చచ్చుబడిన క్షణాలకు ఒక నూతన ఉత్తేజం, అద్భుతమైన చైతన్యం కలిగించింది. ప్రతి ఒక్కరినీ సమ్మోహపరిచిన కవిత్వ క్షణాలను ఆనందించడానికి కారణమైన ఓల్గా, వసంత కన్నభిరాన్, కల్పన కన్నభిరాన్ గార్లకు కృతజ్ఞతలు.
నీలిమేఘాలు వచ్చాక సమాజంలో స్త్రీలను చూసే విధానం మారింది. ఇదివరకటి లాగా చులకనగా మాట్లాడడానికి భయపడుతున్నారు. పురుషులలో మార్పు వచ్చింది. ఇంటి పనులు చేస్తున్నారు. వంటలో సాయం చేస్తున్నారు. ఈ మార్పులో నీలిమేఘాలు పాత్రా ఉంది.
ఈ సభలోనే 'ప్రభా విభాతములు' 'వాయిసెస్ ఆఫ్ రెసిస్టెన్స్' పుస్తకాలు కూడా ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక సభలో పాల్గొన్నందుకు ఆ ఉద్విగ క్షణాలను హృదయంలో పదిలపరుచుకొంటూ అపూర్వ పారవశ్యంతో... నేను.
- మందరపు హైమవతి
82473 67061