Sep 25,2023 10:50

సినిమాల్లో నటించాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ, కొందరికీ ఆ అవకాశం వస్తుంది. కొందరు సినీరంగంలోని వివిధ శాఖల్లో పనిచేస్తూ, అనుకోకుండా తెర మీదికి వచ్చి ప్రేక్షకులను అలరిస్తారు. తెలుగు తెరపై అలా వెలగిన ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. సినిమా తెర పైనా, తెర వెనుకా గొప్పగా రాణించినవారూ ఉన్నారు. కొందరు దర్శత్వం వహిస్తూనే అప్పుడప్పుడు తమ సినిమాలో ఏదో ఒక అప్రధాన పాత్ర తళుక్కున మెరిసేవారూ ఉన్నారు. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తాజాగా 'పెదకాపు 1'లో విలన్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో తెర వెనక నుంచి తెర పైకి వచ్చిన కొందరి గురించి తెలుసుకుందాం.

1

కె.విశ్వనాథ్‌ : అరుదైన చిత్రాల రూపకర్తగా ఐదు దశాబ్దాల సినీరంగ ప్రస్థానం చేశారు. తన వృత్తిని నటనగా మార్చుకుని కెమెరా వెనుకనే కాకుండా వెండితెరపైనా కూడా తన సత్తా చాటారు. అనేక కుటుంబ కథా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. అదే స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు విశ్వనాధ్‌. తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్‌ రికార్డిస్ట్‌గా పనిచేశారు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్లు సహాయ దర్శకుడిగా పనిచేశారు. 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా అవకాశం లభించింది. తొలి సినిమాకే నంది అవార్డును అందుకున్నారు. సంగీతం లేదా నృత్యాన్ని జోడించి కథను అందమైన దృశ్యరూపంగా మలచడంలో దిట్ట. శంకరాభరణం, సాగరసంగమం, సిరిసిరిమువ్వ, స్వర్ణకమలం తదితర చిత్రాలు పలు అవార్డులను అందుకున్నారు.

2

దాసరి నారాయణరావు : అత్యధిక చిత్రాలకు (150) దర్శకుడిగా గిన్నిస్‌ రికార్డులకెక్కారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. 250కు పైగా చిత్రాలకు సంభాషణ రచయిత, గీత రచయితగా పనిచేశారు. తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాల్లో నటించారు. తెరపైనా, కెమెరా వెనుకా మెరిశారు. దర్శకుడు, నటుడిగా కూడా మెప్పించారు. తన బహుముఖ ప్రజ్ఞతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

3

కె.రాఘవేంద్రరావు : తన 78 ఏళ్ల వయసులో వచ్చిన 'పెళ్లిసందడి' చిత్రంలో నటించారు. మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. దర్శకుడిగానే కాకుండా నిర్మాత, స్క్రీన్‌ రైటర్‌గా పనిచేశారు. నృత్యదర్శకుడిగా కూడా వ్యవహరించారు. కొన్ని హిందీ చిత్రాలకు సైతం దర్శకత్వం వహించారు.
వి.వి.వినాయక్‌ : దర్శకుడు వివి వినాయక్‌ కూడా ఠాగూర్‌, ఖైదీనంబర్‌ 150 వంటి చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ఆది (2002) సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. సీనయ్య సినిమాలో ఆయన హీరోగా నటిస్తున్నారు.

4

ఎస్‌ఎస్‌ రాజమౌళి : దర్శకుడు రాజమౌళి కూడా 'బాహుబలి' చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. హీరో నాని ప్రధాన పాత్రలో నటించిన మజ్ను సినిమాలో కూడా కనిపించారు. బాహుబలి రెండు భాగాలు విజయవంతం కావటంతో బాలీవుడ్‌తోపాటుగా హాలీవుడ్‌లోనూ రాజమౌళికి గుర్తింపు లభించింది.

5

రామ్‌గోపాల్‌వర్మ : దర్శకుడు, నిర్మాత, రచయితగా రామ్‌గోపాల్‌వర్మ ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. మాఫియా, హార్రర్‌ నేపధ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్ధహస్తులు. 'కోబ్రా' 2019లో నటించారు.

6

అనిల్‌ రావిపూడి 'ఎఫ్‌ 3' చిత్రంలో డ్రైవర్‌ పాత్రలో నటించారు. పూరి జగన్నాథ్‌ కూడా సినిమాల్లో నటించారు. నేనింతే, వ్యాపారవేత్త, టెంపర్‌, ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాల్లో అతిథిగా నటించారు. ప్రతి నాయక పాత్రల్లో మెప్పించిన రామిరెడ్డి తెలుగులో అంకుశం చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఉర్దూ పత్రికకు జర్నలిస్టుగా ఆయన పనిచేసేవారు. క్యాస్ట్యూమ్స్‌ కృష్ణ నిర్మాతగా 8 సినిమాలను తీశారు. నటుడుగానూ, ప్రతినాయకుడిగానూ, సహాయ నటుడుగానూ పాత్రలు పోషించారు. 1954లో చెన్నై వెళ్లి అసిస్టెంట్‌ కాస్ట్యూమర్‌గా పనిచేశారు. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్‌బంద్‌ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు.

7