Oct 29,2023 10:18
  • పాత పెన్షన్‌ పథకానికి మద్దతు
  • పశువుల పేడ కొనుగోలు
  • రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల వాగ్దానాలు

జైపూర్‌ : రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌ ఎన్నికల హామీల జాబితాను విడుదల చేసింది. ఓటర్లలో అధిక సంఖ్యలో ఉన్న, కీలకమైన విద్యార్థులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా తన వాగ్దానాలను ప్రకటించింది. కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం చట్టం ద్వారా పాత పెన్షన్‌ పథకం (ఓపీఎస్‌)కు మద్దతుగా నిలవటం, పశువుల పేడను కొనటం వంటివి ఇందులో ఉన్నాయి. ఆయన ఇలా ఐదు కొత్త ఎన్నికల హామీలను అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రకటించింది.
           ఆ రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో విలేకరుల సమావేశంలో గెహ్లాట్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పశువుల పేడను కిలో రూ.2 చొప్పున కొనుగోలు చేస్తుందన్నారు. ''ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని భూపేష్‌ బఘెల్‌ ప్రభుత్వం మాత్రమే అటువంటి పథకాన్ని అమలు చేస్తోంది. దీనిని గోధన్‌ న్యారు యోజనతో అమలు చేస్తున్నది. ఇది బయోగ్యాస్‌, సహజ ఎరువులు మొదలైనవాటిగా ఉపయోగించబడుతున్నది. ఇది రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది'' అని గెహ్లాట్‌ చెప్పారు. ప్రతి విద్యార్థికీ ఇంగ్లీషు మీడియం విద్యనందిస్తామన్న హామీని ప్రకటించారు. ఇప్పటి వరకు 3 వేల ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ప్రారంభించామనీ, అందులో 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ప్రస్తుతం లాటరీ విధానంలో విద్యార్థులను కేటాయించాల్సి ఉండగా, డిమాండ్‌ ఉన్న చోట ఇంగ్లీషు మీడియం పాఠశాలను తెరుస్తామని పార్టీ హామీ ఇస్తున్నదని తెలిపారు. దీనితో రాష్ట్రంలోని మానవ వనరుల నాణ్యత మెరుగుపడుతుందని చెప్పారు.
         ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ లేదా ట్యాబ్లెట్‌ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఏటా 7-8 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎస్‌) చట్టానికి మద్దతుగా కాంగ్రెస్‌ ఉంటుందని ఆయన చెప్పారు. ఓపీఎస్‌ను బీజేపీ వ్యతిరేకిస్తున్నందున, రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఓపీఎస్‌ను ఉపసంహరించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భయపడుతున్నారని ఆయన అన్నారు. అందుకే, భవిష్యత్తులో కూడా ఏ ప్రభుత్వమూ దానిని ఉపసంహరించుకోలేని విధంగా చట్టంతో మద్దతు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నామని అశోక్‌ గెహ్లాట్‌ వివరించారు. పెరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం చిరంజీవి ఆపద బీమా హామీని తీసుకువస్తుందనీ, ఇందులో ప్రతి బాధిత కుటుంబానికీ రూ. 15 లక్షల వరకు బీమా కల్పిస్తామని ఆయన చెప్పారు.
           మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఐదు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. జుంజునులో జరిగిన ర్యాలీలో పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ సమక్షంలో గెహ్లాట్‌ గృహ లక్ష్మి యోజన కింద కుటుంబ పెద్దలకు ఏటా రూ. 10,000 ప్రకటించారు.