ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత స్వదేశానికి రానున్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పిఎంఎల్-ఎన్) పార్టీ అధినేత, మూడుసార్లు ప్రధానిగా చేసిన నవాజ్ షరీఫ్ దుబారు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన శనివారం మధ్యాహ్నం పాకిస్తాన్‌లో అడుగుపెట్టనున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరిలో పాకిస్తాన్‌లో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నవాజ్ స్వదేశానికి రావడం పట్ల జరగబోయే ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు మారనున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు, 'పనామా పేపర్స్' లీక్‌ల కేసులో అతనికి ఆ దేశ సుప్రీంకోర్టు 2017లో అతనిపై అనర్హత వేటు వేసింది. అలాగే అవినీతి కేసుల్లో విచారణ అనంతరం జులై 6, 2018న పాకిస్తాన్ ఫెడరల్ జ్యుడిషియల్ కాంప్లెక్స్ నవాజ్‌కు పదేళ్ల జైలు శిక్షతోపాటు 1.3 బిలియన్‌ల జరిమానా విధించింది. అయితే వైద్య చికిత్స కోసం సమయం ఇవ్వడం లేదని అప్పటి ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంపై నవాజ్ కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో ఇస్లామాబాద్ హైకోర్టు మానవతాదృక్పథంతో వైద్య చికిత్స కోసం లండన్‌కి వెళ్లేందుకు నవాజ్‌కి బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దుబారులో కొన్నాళ్లు చికిత్స పొందిన ఆయన .. ఈరోజు ఇస్లామాబాద్ చేరుకోనున్నారు. ఈ మంగళవారం వరకే ఓ కేసులో షరీఫ్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది.