
మరకేష్, మొరాకో : యాభై ఏళ్లలో తొలిసారి ఆఫ్రికా గడ్డపై ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాలు నిర్వహించనున్నాయి. రుణ భారం, వాతావరణ మార్పులతో నలిగిపోతున్న పేద దేశాల రుణాలను మాఫీ చేయాలని, సాయంపేరుతో దుర్మార్గమైన షరతులు విధించడం మానుకోవాలని తృతీయ ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బ్రెటన్‌వుడ్స్ సంస్థలు తమ వార్షిక సమావేశాలకు ఆఫ్రికాను వేదికగా చేసుకోవడం గమనార్హం. ప్రతి మూడేళ్లకోసారి వాషింగ్టన్ ప్రధాన కార్యాలయానికి వెలుపల ఈ రెండు సంస్థలు తమ వార్షిక సమావేశాలను నిర్వహిస్తాయి. 2021లో మరకేష్‌లో ఈ సమావేశాలు జరగాల్సి వుంది. కానీ కోవిడ్ కారణంగా రెండుసార్లు వాయిదా పడ్డాయి. గత నెలలో దక్షిణ మరకేష్ ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించి దాదాపు 3వేల మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో మొరాకో ప్రభుత్వం ఈ సమావేశాల నిర్వహణకు ముందుకొచ్చింది. 1973లో చివరిసారిగా ఆఫ్రికా గడ్డపై ఈ సమావేశాలు జరిగాయి. అప్పుడు కెన్యా ఆతిథ్యమిచ్చింది. అర్ధశతాబ్దం గడిచిన తర్వాత కూడా ఆఫ్రికా ఖండం ఇంకా అనేక సవాళ్ల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. 21వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుసంపన్నంగా వుండాలంటే సంపద్వంతమైన ఆఫ్రికా వుండాల్సిన అవసరం వుందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలినా జార్జివా వ్యాఖ్యానించారు.