
మన దేశంలో హేతువాద ఉద్యమానికి వేల సంవత్సరాల చరిత్ర వుంది. 2500 సంవత్సరాల క్రితమే చార్వాకులు దేవుని ఉనికిని ప్రశ్నించారు. మానవుడే దేవుణ్ణి సృష్టించాడని, యజ్ఞయాగాలు, కర్మకాండలు పురోహితుల బతుకుదెరువు కోసమేనని ఆ రోజుల్లోనే మూఢ నమ్మకాలను ఉతికి ఆరేశారు. ఆ తరువాత వేమన కూడా ముహూర్తాలను, తద్దినాలను అందులోని గుట్టును బట్టబయలు చేశాడు. ఆ తరవాత బ్రాహ్మణీయ భావజాల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే, కేరళలో నారాయణగురు, ఉమ్మడి మద్రాసులో పెరియార్ రామస్వామి, త్రిపురనేని రామస్వామి, గోరా, ఆ తరవాత కందుకూరి వీరేశలింగము, గురజాడ అప్పారావు లాంటి వారు మూఢనమ్మకాల నిర్మూలనకోసం ఎంతో కృషిచేశారు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మహారాష్ట్రలో ముప్పై సంవత్సరాలుకు పైగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు డాక్టరు నరేంద్ర దభోల్కర్. చివరికి పదేళ్ల కిందట పూనాలో ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో మతోన్మాదుల చేతిలో తుపాకీ గుళ్లకు బలయ్యారు. ఆ మరుసటిరోజే మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని ఆర్డినెన్స్‌గా తీసుకొచ్చారు. తరువాత చట్టమైంది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా దభోల్కర్ చేసిన కృషి దీని వెనుక వుంది.
పది సంవత్సరాల పాటు డాక్టరుగా పని చేసి, ప్రజలను మోసగిస్తున్న దొంగబాబాలకు వ్యతిరేకంగా, నరబలులు, క్షుద్రపూజలు, చేతబడులు పేరుతో జరిగే మోసాలను బట్టబయలు చేస్తూ మహారాష్ట్రలో 1989లో 'మహారాష్ట్ర అంధశ్రద్ద నిర్మూలనా సమితి'ని ఏర్పాటు చేసి కొన్ని వేల సమావేశాలు ఏర్పాటుచేశారు. 2008లో ఎట్టకేలకు మూఢనమ్మకాల నిర్మూలన మోడల్ చట్టం ఏర్పటుచేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టించారు. ఆనాడు అసెంబ్లీలో మెజార్టీగా ఉన్న బిజెపి సభ్యులు ఈ చట్టాన్ని తిప్పి పంపారు. పట్టువీడని విక్రమార్కుడిలా 2011లో కూడా మరలా బిల్లును అసెంబ్లీలో ప్రవెశపెట్టించారు. బిజెపి సభ్యులు అడుగడుగునా అడ్డుపడ్డారు. దభోల్కర్‌ను గాంధీని చంపినట్లు చంపుతామని కూడా మతోన్మాదులు బెదిరించారు. కానీ భయపడలేదు. అయితే నిజంగానే మతోన్మాదులు 2013 ఆగస్టు 20న వాకింగ్ సమయంలో పొంచి ఉండి కాల్చి చంపారు. ఆ తరువాత అదే క్రమంలో మహారాష్ట్రలో ప్రముఖ సంఘసంస్కర్త పన్సారేను, కర్ణాటకలో గౌరీ లంకేశ్‌ను, కల్బుర్గిని మతోన్మాదులు కాల్చి చంపారు. వారి ఆశయాలను ముందుకి తీసుకుపోవటమే మన లక్ష్యంగా భావించి హేతువాద నాస్తికులు, అభ్యుదయవాదులు, సమాజ మార్పు కోసం పని చేయాలి.
/20న దభోల్కర్ పదవ వర్ధంతి/
- నార్నె వెంకట సుబ్బయ్య,
ఎ.పి హేతువాద సంఘం అధ్యక్షుడు.