
కొందరు నిర్మిస్తుంటారు...మరికొందరు కూలదోస్తుంటారు. ఇళ్లు, వీధులు, పురాతన భవనాలకే కాదు... జీవితాలను, మానవతను కూడా కూలదోస్తారు. తరతరాలుగా నిర్మించుకున్న సంస్కృతిని నేలమట్టం చేస్తారు. 'అధికారం చేతికి చిక్కిన నీడల్లో/ భూమి అంతటా మానవ హక్కులు ద్రోహం చేయబడ్డాయి/ స్వరాలు వణుకుతున్న చోట, స్వేచ్ఛలు మసకబారతాయి/ చీకట్లో అన్యాయం వర్థిల్లుతుంది' అంటాడో కవి. సమాజ రక్షణ కోసం ఏర్పడిన రాజ్యం...మనిషితనాన్ని మరచిపోయి... మనుషి రక్తాన్ని మరిగినప్పుడు- ఈ దుష్ట సంస్కృతిని, నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ...'మేమూ మనుషులమే...మమ్మల్ని బతకనీయండి' అంటూ నినదించే పౌర సమాజ బృందాలు, కార్యకర్తల గొంతులను, బిగించిన పిడికిళ్లను బుల్డోజ్ చేస్తూ...అణచివేస్తుంటే...ఆ అణచివేతను, ఆ నిరంకుశత్వాన్ని ఎదిరించే పోరాటాలే మానవ హక్కులయ్యాయి. ఏ దేశంలోనైనా మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత... ఆందోళన కలిగించే విషయమే. 'ప్రజల మానవ హక్కులను తిరస్కరించడం అంటే...వారి మానవత్వాన్ని సవాలు చేయడమే' అంటాడు నెల్సన్ మండేలా. మానవ హక్కులు న్యాయమైన, సమానమైన సమాజానికి పునాది. జాతీయత, మతం, వర్గం, జాతి నేపథ్యంతో సంబంధం లేకుండా సమాజమంతటికీ లభించే సమానత్వం, గౌరవం, స్వేచ్ఛ కనీస అవసరం.
పౌర సమాజ బందాలను, కార్యకర్తలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అణచివేస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విమర్శించింది. ఇందుకోసం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఎటిఎఫ్) చేసిన సిఫార్సులను దుర్వినియోగం చేస్తోందని, ఆ సిఫార్సుల ఆధారంగా క్రూరమైన చట్టాలను అమలు చేసేందుకు పూనుకుంటున్నారని, స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలపై ఉగ్రవాద సంబంధమైన ఆరోపణలు మోపుతున్నారని ఆమ్నెస్టీ వెల్లడించింది. 'ఉగ్రవాదంపై పోరాటం పేరుతో చట్టాలను దుర్వినియోగం చేస్తూ... ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఆమ్నెస్టీ తెలిపింది. అట్టడుగు వర్గాల ప్రజలు, మైనారిటీలు, వాతావరణ మార్పులపై పని చేస్తున్న 16 స్వచ్ఛంద సంస్థలలో 11 సంస్థల లైసెన్సులను ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. భీమా కోరెగావ్ కేసులో ముస్లిం విద్యార్థి ఉమర్ ఖలీద్, కాశ్మీర్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త ఖుర్రమ్ పర్వేజ్, పాత్రికేయుడు ఇర్ఫాన్ మెహ్రాజ్, మరో 16 మంది 2018 నుంచి ఎలాంటి విచారణ లేకుండా జైలులో మగ్గుతున్నారు. హక్కుల కోసం ఎవరు నినదించినా...మోడీ అంబుల పొది లోని ఒకే ఒక అస్త్రం అణచివేత. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల హక్కులను, వ్యక్తులను అణచివేస్తోంది మోడీ ప్రభుత్వం.
మనిషికున్నంత చరిత్ర మానవ హక్కులకు వుంది. మనిషి సాగించిన ప్రతి పోరాటంలోనూ, సాధించిన ప్రతి విజయంలోనూ మానవ హక్కులు అణచివేయబడటమో, సమున్నత స్థాయిలో విజయకేతనాన్ని ఎగురవేయడమో జరుగుతూనే వుంది. ప్రజాస్వామ్యానికి పుట్టిల్లని, నాగరికతకు మెట్టిల్లని చెప్పుకునే అమెరికాకు మానవ హక్కులను పాతరేసి, నెత్తుటేరులు పారించడం నిత్యకృత్యం. అలాంటి అమెరికాతో అంటకాగుతూ... ప్రజాస్వామ్యానికి పెద్దన్నగా చెప్పుకునే మోడీ నుంచి ఇంతకంటే ఆశించడం వ్యర్థమే. అహింసను పవిత్ర వ్రతంగా పెట్టుకున్న గాంధీజీ...'పిరికితనంతో బానిస జీవితం గడపడంకన్నా దౌర్జన్యంతో శత్రువును ప్రతిఘటించడం మంచిది' అంటాడో సందర్భంలో. టాగూర్ స్వప్నించిన భయాందోళనలు, సంకుచిత దృక్కులు లేని స్వర్గసీమ కావాలీ దేశం. 'నా ఒక్కడి వల్లే ఈ దేశం మారిపోతుందా? అనుకునే ఏ ఒక్కడివల్లా ఈ దేశానికి ఉపయోగంలేదు' అంటాడు ఫైడల్ కాస్ట్రో. కార్పొరేట్- మతోన్మాద క్రీడలో అణచివేయబడుతున్న ప్రతి ఒక్కరూ గళమెత్తాలి. పిడికిలి బిగించాలి. 'ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురు చూడకుండా' తన హక్కులను తానే కాపాడుకోవాలి. భావ వ్యక్తీకరణ అణచివేత నుంచి మూక దాడుల వరకు జరుగుతున్న ఉల్లంఘనలను ఎదుర్కోవాలి. 'బలవంతమైన స్పరము/ చలిచీమల చేత చిక్కి చావదె సుమతి' అన్నట్టుగా... వేయి గొంతులు ఒక్కటై పీచమణిచే రోజు దగ్గరలోనే వుందని గుర్తించాలి.