Apr 29,2023 15:15

హైదరాబాద్‌ :డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ సౌధాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భవనం, ప్రాంగణాన్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేస్తున్నారు. నేటీ మధ్యాహ్నం నుంచి అలంకరణ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఉదయం కురిసిన వర్షానికి సచివాలయ ప్రాంగణమంతా వరద నీరు చేరి పనులకు ఆటంకం ఏర్పడింది. అకాల వర్షంతో అంతా బురదమయంగా మారడంతో శుభ్రం చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. హుస్సేన్‌ సాగర్‌ పరిసర ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లను శుభ్రం చేస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ చౌరస్తా వద్ద గల బస్టాప్‌ సహా వివిధ ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని దారి మళ్లిస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుక కోసం సీఎం కేసీఆర్‌ సహా మంత్రులు, అధికార యంత్రాంగమంతా వస్తుండటంతో సచివాలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సచివాలయానికి చేరుకుని సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.