Nov 14,2023 10:11
  • అదే బాటలో కాంగ్రెస్‌
  • హిందూత్వ పాచిక వేస్తున్న కమలదళం
  • దిగజారుతున్న మధ్యప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నెత్తిన రుణభారం పెరిగిపోతుంటే వాస్తవ పరిస్థితిని దాచిపెట్టి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో హామీల వరద పారించింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం బిజెపి రెండు రోజుల క్రితం మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్రంలోని పేద కుటుంబాలన్నింటికీ ఉచిత రేషన్‌ అందజేయడంతోపాటు అందుబాటులో ఉన్న మేరకు పప్పులు, ఆవనూనె, పంచదారను కూడా సబ్సిడీ రేట్లపై విక్రయిస్తామని ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు పన్నెండో తరగతి వరకూ ఉచితంగా విద్యను అందిస్తామని తెలిపింది. ఈ హామీలతో పాటు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పలు ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది జూనియర్‌ స్థాయి ఉద్యోగులకు వేతనాలు, అలవెన్సులు పెంచుతామని, అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలను కూడా రూ.13 వేలకు పెంచుతామని, రోజ్‌గార్‌ సహాయకుల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని ఆయన చెప్పారు. జిల్లా పంచాయతీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఉప సర్పంచ్‌లు వంటి నేతల గౌరవ వేతనాన్ని మూడు రెట్లు పెంచుతామని తెలిపారు. మైనారిటీ విద్యార్థులకు రూ.135 కోట్ల ఖర్చుతో ఈ-స్కూటర్లు అందజేస్తామని, రూ.196 కోట్ల వ్యయంతో 78 వేల మంది విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇస్తామని చెప్పారు. వీటన్నింటికీ అవసరమైన నిధులు ఎక్కడి నుండి సమకూరుస్తారో మాత్రం ఆయన చెప్పలేదు. అటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ఉచితాలపై హామీల వరద పారిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులు పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఉచితాల కోసం పందారం చేస్తారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
 

                                                                            పోటాపోటీ హామీలు

రాష్ట్ర బడ్జెట్‌ పరిమాణం రూ.3.14 లక్షల కోట్లు. మరోవైపు రాష్ట్రం నెత్తిన ఉన్న అప్పు అక్షరాలా రూ.3.50 లక్షల కోట్లు. గత ఆరు నెలల కాలంలో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం ఏకంగా పది వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. జనాకర్షక హామీలు గుప్పించే విషయంలో బిజెపి, కాంగ్రెస్‌ పోటీ పడుతున్నాయి.
         చౌహాన్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల కోసం లడ్లీ బెహనా యోజన పథకాన్ని ప్రారంభించింది. దీనికి పోటీగా కాంగ్రెస్‌ పార్టీ నారీ సమ్మాన్‌ యోజన పథకాన్ని ప్రకటించి మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తానని హామీ ఇచ్చింది. చౌహాన్‌ తక్కువ తిన్నారా? లడ్లీ బెహనా పథకం కింద మహిళలకు ఇస్తున్న రూ.1,500ను రూ.2,500కు పెంచారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఏకంగా మూడు వేలకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
         ఉచితాలపై కాంగ్రెస్‌ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌, సగం రేటుకే 200 యూనిట్ల వరకూ కరెంట్‌ వంటి హామీలు కురిపించింది. ఆవు పేడ పథకం విజయవంతం కావడంతో కిలో ఆవు పేడను రెండు రూపాయలకు కొనుగోలు చేస్తానని తెలిపింది. బియ్యం, గోధుమలకు కాంగ్రెస్‌ పార్టీ కనీస మద్దతు ధరలు ప్రకటించగానే బిజెపి తానేం తక్కువ తినలేదన్నట్లు ఆ మొత్తాన్ని పెంచింది.
 

                                                                ఆలయాల నిర్మాణం కోసం నిధులు

ఉచితాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడంతో పాటు అధికార బిజెపి హిందూత్వ వాదనను మరింత ముందుకు తెస్తోంది. రాష్ట్రంలో నాలుగు ఆలయాల ఏర్పాటు కోసం బిజెపి ప్రభుత్వం రూ.358 కోట్లు కేటాయించింది. సాగర్‌లోని రవిదాస్‌ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టులో భూమిపూజ కూడా చేశారు. ఈ ఆలయాన్ని రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. చింద్వారాలో పురాతన హనుమాన్‌ దేవాలయాన్ని ఆధునీకరించేందుకు చౌహాన్‌ ప్రభుత్వం రూ.350 కోట్ల నిధులను ప్రకటించింది.