Nov 10,2023 11:07

 బ్రెజిల్‌ సుప్రీం కోర్టు తీర్పు
బ్రసీలియా : 
 బ్రెజిల్‌ అధ్యక్షుడుగా ఎన్నికైన లూలా డసిల్వా విజయాన్ని తారుమారు చేసేందుకు ఈ ఏడాది జనవరి 8న జరిగిన కుట్ర కేసులో ఐదుగురికి సుప్రీం కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన వారి సంఖ్య 25కి చేరింది. సాయుధ తిరుగుబాటు నేరంలో పాలుపంచుకోవడం, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ప్రక్రియను హింసాత్మకంగా రద్దుచేయడానికి ప్రయత్నించడం, కుట్రకు పాల్పడడం, విధ్వంసానికి దిగడం వంటి అభియోగాలపై వీరిని విచారించిన సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే వారికి విధించాల్సిన శిక్షలపై న్యాయస్థానం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. 14నుండి 17ఏళ్ళ జైలు శిక్ష విధించాలని స్పీకర్‌, మంత్రి అలెగ్జాండర్‌ డీ మోరెస్‌ ప్రతిపాదించారు. మేజిస్ట్రేట్‌లు ఇరువురు ఆయనకు మద్దతిచ్చారు. అయితే మరో ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం 11నుండి 15ఏళ్ళ పాటు శిక్ష విధించాలని ప్రతిపాదించారు. విధ్వంసానికి దిగి ప్రభుత్వ భవనాలకు నష్టం వాటిల్లేలా వ్యవహరించినందుకు ఈ ఐదురుగు కలిసి 30మిలియన్ల రియాస్‌ నష్టపరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.