వాషింగ్టన్ : దోమ కాటుతో వచ్చే చికున్‌గున్యాకు ప్రపంచంలోనే మొదటి వ్యాక్సిన్‌ను అమెరికా ఆరోగ్య శాఖ ఆమోదించింది. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య ముప్పుగా ఆవిర్భవించనుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) హెచ్చరించింది. యూరప్‌కు చెందిన వాల్నెవా కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధిపరిచింది. ఇక్స్‌చిక్ పేరుతో దీన్ని మార్కెటింగ్ చేస్తారు. 18ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతించారు. ఇక్స్‌చిక్ వ్యాక్సిన్‌కు అమెరికా గురువారం ఆమోదముద్ర వేయడంతో ఇక వైరస్ ప్రబలంగా వున్న దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ వేగమందుకుంటుందని భావిస్తున్నారు. జ్వరంతో పాటూ తీవ్రమైన జాయింట్ల నొప్పిని కలిగించే ఈ చికున్‌గున్యా ఎక్కువగా ఆఫ్రికా, ఆగేయాసియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. గత 15 ఏళ్లలో భారత్‌సహా వివిధ దేశాల్లో 50లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.
వృద్ధుల్లో, ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఈ వైరస్ ఇంకా తీవ్రతను కలగజేస్తుందని ఎఫ్‌డిఎ పేర్కొంది. ఈ వ్యాధి లక్షణాలు కొన్నిసార్లు నెలలు లేదా సంవత్సరాలు కూడా కొనసాగే అవకాశం వుంది. దీనివల్ల మరణాలు చాలా అరుదు. ప్రస్తుతానికి ఈ వ్యాధికంటూ ప్రత్యేక చికిత్స లేదు, సాధారణ జ్వరం, నొప్పులకు వాడే మందులే వాడుతున్నారు.