Sep 16,2023 07:03

       భారత శాస్త్ర పరిశోధనల రంగంలో నోబెల్‌ పురస్కారంగా భావించే శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ (ఎస్‌ఎస్‌బి) పురస్కారాలను ఏడాది జాప్యం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గత సోమవారం నాడు ప్రకటించింది. భట్నాగర్‌.. భారత పరిశోధన శాలల పితామహునిగా ఖ్యాతినొందారు. ఆయన వ్యవస్థాపకునిగా సేవలందించిన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనల మండలి (సిఎస్‌ఐఆర్‌) ప్రతి యేటా 45 సంవత్సరాల లోపు వయస్సున్న యువ శాస్త్రవేత్తలకు ఈ పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ ఏడాది 12 మంది శాస్త్రవేత్తలకు ప్రకటించారు. సాధారణంగా సిఎస్‌ఐఆర్‌ వ్యవస్థాపక దినోత్సవం అయిన సెప్టెంబరు 26న ఈ పురస్కారాలు ప్రకటిస్తారు..కానీ గతేడాది ప్రకటించకపోవడం వల్ల ఈ ఏడాది పక్షం రోజులుగా ముందుగానే ఈ నెల 11న పురస్కారాల జాబితా విడుదల చేయడం విశేషం. పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు. హైదరాబాద్‌కు చెందిన జీవ శాస్త్రవేత్త మద్దిక సుబ్బారెడ్డి కూడా ఉండటం ముదావహం.
         యువ శాస్త్రవేత్తలకు ఆర్థికంగా చేయూతనందించి, శాస్త్ర, సాంకేతిక పరిశోధనలను ప్రోత్సహించాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన ఈ పురస్కారాలకు ఆరున్నర దశాబ్దాల చరిత్ర ఉన్నది. అయితే మోడీ సర్కార్‌ గతేడాది కారణమేదీ లేకుండానే పురస్కారాల ప్రకటనను నిలిపివేసి, శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల నిర్లక్ష్య ధోరణిని చాటుకుంది. అధికారంలోకి వచ్చిననాటి నుంచి శాస్త్ర, సాంకేతిక రంగాలను నిర్వీర్యం చేసే దిశలోనే బిజెపి ప్రభుత్వం చర్యలు కొనసాగాయి. శాస్త్రీయ దృక్పథాన్ని, భావాల వ్యాప్తిని అడ్డుకునేందుకు సంఫ్‌ు పరివార్‌ ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడిందో విదితమే. మూఢత్వ భావాలపై తమ రచనలతో యుద్ధాన్ని ప్రకటించిన గౌరీ లంకేష్‌ను, గోవింద్‌ పన్సారేను, నరేంద్ర దబోల్కర్‌, ఎంఎం కల్బుర్గి వంటి సామాజిక కార్యకర్తలను బలితీసుకుంది. మరోవైపు ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలను ప్రయివేటుకు అప్పజెబుతూ వాటిని నిర్వీరం చేసే చర్యలను కేంద్రం వేగిరం చేసింది. ఈ క్రమంలోనే ప్రోత్సాహక పురస్కారాలను కుదించింది. వివిధ మంత్రిత్వ శాఖలు అనేకానేక పురస్కారాలు ఇస్తున్నందున శాస్త్ర పురస్కారాలకు తగిన గుర్తింపు లభించడం లేదంటూ విడ్డూర వాదన తెరపైకి తీసుకొచ్చి వాటి స్థానంలో 'నోబెల్‌' తరహా పెద్ద పురస్కారాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిచిస్తున్నట్లు కేంద్రం గొప్పలు చెప్పింది. కానీ ఆ తర్వాత నోరు మెదిపింది లేదు. శాస్త్ర పురస్కారాలకు సమాధి కట్టే పన్నాగామే కేంద్రం ఎత్తుగడ అని నాడు శాస్త్రవేత్తలు వ్యక్తం చేసిన ఆందోళనే నిజమైంది. ఆ క్రమంలోనే గతేడాది భట్నాగర్‌ పురస్కారాలు ఎగవేశారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో కాస్త ముందుగానే ప్రకటించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆరు దశాబ్దాల పరిశోధనల కృషి ఫలితంగా సిద్ధించిన చంద్రయాన్‌ 3 సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు మోడీ సర్కార్‌ ఎంత వెంపర్లాడుతోందో చూస్తున్నాం.
          శాస్త్ర పురస్కారాలు అంటే రాత్రికిరాత్రే అదృష్టంతో తలుపుతట్టే అవార్డులు కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు జీవం పోయడం, అధునాతన పద్ధతులను మరింత సమున్నత స్థాయికి చేర్చడం ద్వారా సమాజాన్ని శాస్త్రీయ ఆలోచనలతో ప్రగతి వైపు నడిపించే కఠోర పరిశ్రమకు లభించే ప్రోత్సహక గుర్తింపుగా సైన్స్‌ పురస్కారాలను శాస్త్రవేత్తలు భావిస్తారు. శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారాలు అటువంటివే. ఒక గొప్ప పురస్కారం ఒకరికిచ్చేసి చేతులు దులిపేసుకోవడం కాదు పురస్కారమంటే. శాస్త్ర, సాంకేతిక రంగాన సాధించిన ప్రతి ప్రగతిలోనూ కఠోర శ్రమకూ గుర్తింపు దక్కడం. అప్పుడే శాస్త్రవేత్తలకు ఊతం లభిస్తుంది. ఈ దఫా శాస్త్ర పురస్కారాలకు ఎంపికైనవారిలో ఒక్కరంటే ఒక మహిళా శాస్త్రవేత్త కూడా లేకపోవడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో సహా అనేక కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో ప్రతిభాశీలురైన మహిళా శాస్త్రవేత్తలకు కొదవ లేదు. ఎంతో మంది ఈ పురస్కారాలకు అర్హులైనవారే. కానీ కేంద్ర ప్రభుత్వం పరిశోధన సంస్థలను ముక్కలు ముక్కలుగా చేసి ప్రయివేటుకు కట్టబెడుతోంది. ప్రోత్సహకాలను కుదించేసింది. ఈ వినాశకర విధానాలకు తెరదింపి శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తే చంద్రయాన్‌ లాంటి అద్భుతాలెన్నో ఆవిష్కృతమవుతాయి.