-7,8 తేదీలల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస పనులను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాలైన అల్లూరిసీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో సిఎం జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విమర్శలకు తావులేకుండా సహాయ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో తానే స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించాలన్నారు. ఇంట్లోకి వరదనీరు వచ్చినా, అలాగే వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి కచ్చితంగా నిర్ణయించిన రేషన్‌ను, తాగునీరు కూడా అందించాలన్నారు. ఈ సహాయం అందని వరద బాధిత కుటుంబం ఉండకూడదని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉండి, వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ2000, వ్యక్తులైతే రూ1000లు ఇచ్చి పంపించాలన్నారు. కలెక్టర్లు బాగా చూసుకున్నారనే మాట వినిపించాలని చెప్పారు. వరద కారణంగా కచ్చా ఇల్లు పాక్షికంగానైనా, పూర్తిగానైనా ధ్వంసం అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయొద్దని వారందరికీ కూడా రూ 10 వేలు చొప్పున సహాయం అందించాలన్నారు. వరదనీరు తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, సిఎస్ కెఎస్ జవహర్ రెడ్డి, డిజిపి కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










