-సమీక్షలో ఆమోదించిన సిఎం జగన్
- నవంబరు 15 నాటికి పూర్తిచేస్తామని అధికారుల వెల్లడి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆయన ఆమోదం తెలిపారు. అదేవిధంగా ట్రిపుల్ ఐటిలలో అధికారులు ప్రతిపాదించిన 660 లెక్చరర్, అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కూడా ఆమోదించారు. విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటిలలో అధ్యాపక పోస్టుల నియామకాలపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సిఎం గురువారం సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే పూర్తిస్థాయిలో రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాల్సిందేనని సిఎం అన్నారు. పిల్లలు యూనివర్సిటీల నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో బయటకు రావాలంటే బోధనా సిబ్బంది నియామకాలు, అర్హత ప్రమాణాలు కచ్ఛితంగా నాణ్యతగా ఉండాలని చెప్పారు. 1.30 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలను ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో నిర్వహించామని అన్నారు. అదే తరహాలో యూనివర్సిటీల అధ్యాపకుల నియామకాల ప్రక్రియలోనూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి) ద్వారా భర్తీ చేయనున్నట్లు పోస్టుల భర్తీ షెడ్యూల్, పరీక్షా విధానంపై అధికారులు సిఎంకు వివరాలు అందించారు. 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. సెప్టెంబరు 3, 4 వారాల్లో ఎపిపిఎస్‌సి ద్వారా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబరు 10 నాటికి ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. ఫలితాల విడుదల చేసిన అనంతరం నెల రోజుల్లో ఇంటర్వ్యూల నిర్వహణకు నిర్ణయం తీసుకుంటామని వివరించారు. నవంబరు 15 నాటికి ఇంటర్వ్యూల సహా నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీలు ప్రకటిస్తాయని వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి (హెచ్‌ఆర్) చిరంజీవి చౌదరి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఎపిపిఎస్‌సి కార్యదర్శి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గన్నారు.










