Oct 03,2023 10:16
  • ప్రభుత్వ బ్యాంకుల్లో పనిభారం

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పనిభారం పెరిగిపోతోంది. బ్యాంకుల్లో నియామకాలు అరకొరగా ఉంటున్నాయి. అదే సమయంలో బ్యాంక్‌ శాఖల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. 2017-22 మధ్యకాలంలో దేశంలోని ప్రభుత్వ బ్యాంక్‌ శాఖల సంఖ్య 7,189 తగ్గింది. అదే సమయంలో ప్రయివేటు బ్యాంకులు కొత్తగా 13,211 శాఖలు ప్రారంభించాయి. బ్యాంకుల్లో సిబ్బందికి పనిభారం బాగా పెరుగుతోందని, నియామకాలు సరిగా జరగడం లేదని అఖిలభారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ వెంకటాచలం తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల వినియోగదారుల సంఖ్య అనేక రెట్లు పెరిగిందని ఆయన చెప్పారు.
           ఉద్యోగుల సంఖ్య తగ్గడం, ఉన్న వారిపై పనిభారం పెరగడం, శాఖల విస్తరణను తగ్గించడం వంటి పరిణామాలు బ్యాంకుల ప్రయివేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సూచికలని అఖిలభారత బ్యాంక్‌ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌. నాగరాజన్‌ తెలిపారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రయివేటు బ్యాంకులే ఎక్కువ ఉద్యోగాలు కల్పించాయి. 2022-23లో ప్రయివేటు బ్యాంకులు 98,518 మందికి ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వ బ్యాంకులలో మాత్రం ఉద్యోగుల సంఖ్య 3,385 తగ్గిందని రిజర్వ్‌ బ్యాంక్‌ సమాచారాన్ని ఉటంకిస్తూ హిందూ బిజినెస్‌ లైన్‌ పత్రిక తెలియజేసింది. ప్రభుత్వ బ్యాంకులలో ఒక్కో ఉద్యోగి నిర్వహిస్తున్న సగటు వ్యాపార కార్యకలాపాల విలువ రూ.23.80 కోట్లు ఉంటే ప్రైవేటు బ్యాంకులలో అది రూ.15.02 కోట్లుగా ఉన్నదని భారతీయ బ్యాంకుల సంఘం చెబుతోంది.