పెరుగుతున్న గోదావరి ఉధృతి
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ప్రజల ఆందోళన
భద్రాచలం వద్ద 32 అడుగులకు నీటిమట్టం
పొంగుతున్న గుండేటి, ఎద్దువాగులు
24 గ్రామాలకు రాకపోకలు బంద్
వరద పెరిగితే పత్తి, మిర్చి రైతులకు కోలుకోలేని దెబ్బ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
గోదావరికి వరద ఉధృతి పెరుగుతుండటంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. మంగళవారం నాడు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 32 అడుగులకు చేరింది. దీంతో ఎద్దువాగు, గుండేటి వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎద్దువాగు పొంగడంతో వేలేరుపాడు మండలంలోని బోళ్లపల్లి, చిగురుమామిడి మధ్య ఉన్న కాజ్‌వేపై వరద నీరు చేరింది. దీంతో కొయిదా, కట్కూరు, కాకిసనూరు, బోళ్లపల్లి, టేకూరు వంటి 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, దాచారం మధ్య గుండేటి వాగుపై ఉన్న కాజ్‌వే మునగడంతో బెస్తగూడెం, సీతారామపురం, నెమలిపేట, గుణ్ణంబోరు వంటి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామాలకు వెళ్లాలంటే 15 కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ప్రజలను వరద భయం వెంటాడుతోంది. ఈసారి వరద వస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. జులై నెలలో వరద వచ్చి తగ్గడంతో రైతులంతా వేలాది ఎకరాల్లో పత్తి, మిర్చి సాగు చేశారు. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు వరదొస్తే పంటంతా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయి తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. దీంతో రైతులకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఆ పొలాలు ప్రాజెక్టు ముంపులో ఉన్నవి కావడంతో పంట నష్టపరిహారం కూడా ప్రభుత్వం అందించడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
15 రోజుల వ్యవధిలో మళ్లీ వరద
గడిచిన జులై 20వ తేదీ తర్వాత గోదావరికి వరద పోటెత్తింది. దాదాపు 45 గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. ఎక్కడికక్కడే రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో 13,764 మంది వరద బాధితులుగా మారి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. రెండు మండలాల్లో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 4,275 మందిని తరలించారు. మిగిలిన 9,589 మంది కొండలు, గుట్టలకు చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కటిక చీకట్లో కాలం గడిపారు. ప్రభుత్వం నిత్యావసర వస్తువులు వంటివి అందించినా తాగునీరు వంటి సమస్యలతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆగస్టు ఐదో తేదీకి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో పునరావాస కేంద్రాలకు చేరిన బాధితులంతా గ్రామాలకు చేరి ఇళ్లను బాగు చేసుకున్నారు. పట్టుమని 15 రోజులు గడవకముందే మళ్లీ గోదావరి వరద పెరుగుతుండటం అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వరద పెరిగితే మళ్లీ పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిన దుస్థితి రానుంది. పోలవరం ప్రాజెక్టులో భాగమైన కాపర్ డ్యామ్‌ను ముందుగానే నిర్మించడంతో చిన్నపాటి వరదకు సైతం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలు ముంపుబారిన పడుతున్నాయి. 2022 వరదలకు దాదాపు 95 గ్రామాలు ముంపుబారిన పడగా 20 వేల మందికిపైగా వరద బాధితులుగా మారి పునరావాస కేంద్రాలకు చేరారు. ఈ ఏడాది జులైలో వచ్చిన వరదకు అదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మాత్రం ముంపుగ్రామాలకు పునరావాస ప్యాకేజీ ఇచ్చి తరలించడం లేదు. దీంతో ప్రతియేటా రెండు మండలాల్లోని ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ తల్లడిల్లుతున్నారు.
కుక్కనూరు:ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లో సామర్థ్యానికి మించి ఉన్న నీటిని దిగువకు వదలడంతో గోదావరికి వరద క్రమంగా పెరుగుతోంది. మంగళవారం కుక్కునూరు-దాచారం మధ్య గల గుండేటివాగుపై ఉన్న కాజ్‌వేపైకి వరద నీరు చేరింది. దీంతో వాగు అవతలివైపు గల దాచారం, బెస్తగూడెం, నెమలిపేట, సీతారామపురం, అరవపల్లి, గుండంబోరు, ఉప్పరమద్దిగట్ల వంటి 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత నెలలో వచ్చిన గోదావరి వరదలకు నెలరోజుల పాటు కాజ్‌వే ముంపులోనే ఉండటంతో 12 గ్రామాల ప్రజలు, రైతుు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ చుట్టూ 15 కిలోమీటర్ల మేర తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద పూర్తిగా తగ్గడంతో 20 రోజులుగా రాకపోకలు కొనసాగుతున్నాయి. మళ్లీ వరద కాజ్‌వేను ముంచడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభమవ్వడంతో గోదావరి వరదలు రావనే నమ్మకంతో మండలంలోని రైతులు పత్తి, మిర్చి పంటల సాగుపనిలో నిమగమయ్యారు. గోదావరికి వరద క్రమంగా పెరుగుతుండటంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. గతనెలలో వచ్చిన గోదావరి వరదలకు ఇళ్లను ఖాళీ చేసి రావికుంట పునరావాస కేంద్రంలో తలదాచుకున్న గొమ్ముగూడెం, బెస్తగూడెం, రేపాకగొమ్ము గ్రామాల వరద బాధిత కుటుంబాలు 10 రోజుల క్రితం ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. గోదావరి వరద పెరుగుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.










