
- ఐఐటిఎఫ్‌లో ఎపి పెవిలియన్‌ను ప్రారంభించిన మంత్రి అమర్‌నాథ్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:రాష్ట్రంలో అత్యంత వేగంగా పారిశ్రామిక ప్రగతి నడుస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. నవంబరు 14 నుంచి 27 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ట్రేడ్ ఫెయిర్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధమైన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటిఎఫ్)లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను మంత్రి అమర్‌నాథ్ ప్రారంభించారు. ఎపి పెవిలియన్‌లో ఏర్పాటుచేసిన లేపాక్షి, ఆప్కో, గిరిజన్ కార్పొరేషన్ (జిసిసి) మొదలగు అంగళ్లను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తోందని, సకల సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. పది నూతన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో సముద్ర తీర ప్రాంతాభివృద్ధి త్వరితగతిన సాధించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్' ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లా తన ఉనికిని చాటుకుంటోందని వ్యాఖ్యానించారు. దేశ టెక్స్‌టైల్స్ ఎగుమతిలో 13 శాతం రాష్ట్రం నుంచి జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంటు ప్రిన్సిపల్ సెక్రెటరీ కె సునీత, ఎపి భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనరు హిమాన్షు కౌశిక్, ఎపి పరిశ్రమలశాఖ డిప్యూటీ డైరెక్టరు మోపర్తి సుధాకర్, ఎపి పరిశ్రమలశాఖ టెక్నికల్ హెడ్ భాను సాయి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.