Sep 13,2023 08:24
  • వర్షాల్లేక మెట్ట ప్రాంతాల్లో ఎండుతున్న పంటలు
  • అడుగంటిన భూగర్భ జలాలు

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా రైతులు చినుకు కోసం కన్నీళ్లతో కళ్లుకాయలు కాసేలా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. కళ్ల ఎదుటే పంటలు ఎండిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలో 38 మండలాల్లో అతితక్కువ వర్షపాతం నమోదైంది. 20 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు మండలాల్లో అతి తక్కువ నమోదైంది. జూన్‌లో వర్షాలు పడాల్సి ఉంది. మెట్ట ప్రాంతాల్లో చినుకు జాడ లేకపోవడంతో నిమ్మ, పత్తి, పొగాకు, మొక్కజొన్న, మినుము పంటలు ఎండిపోతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. గ్రామ సచివాలయాలకు వెళ్లి సమస్యలు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రజాశక్తి' క్షేత్ర స్థాయి పరిశీలనలో పలు విషయాలు బయటకొచ్చాయి. జిల్లాలోని వింజమూరు, వరికుంటపాడు, వలేటివారిపాళెం, ఆత్మకూరు, ఎఎస్‌పేట, మర్రిపాడు ప్రాంతాల్లో నిమ్మ, పత్తి, మొక్కజొన్న, పొగాకు పంటలు నిలువునా ఎండిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎఎస్‌పేట మండలం తాతిరెడ్డిపల్లి, జువ్వలగుంటపల్లి, హసనాపురం, వింజమూరు మండలం చండ్ర పడియాతోపాటు అనేక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. వాటిని రక్షించుకొనే అవకాశం లేక దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, కళ్లముందే పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువుల ఆకలైనా తీరుతుందనే ఉద్దేశంతో కొందరు రైతులు ఎండిన పంట పొలాల్లో వాటిని మేతకు వదులుతున్నారు. ఆత్మకూరు మండలం పమిడిపాడు గ్రామంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిమ్మకు నీరందకపోవడంతో చెట్లు ఎండిపోయాయి. రైతులు వాటిని అలాగే వదిలేయాల్సి వచ్చింది. జిల్లాలో సాధారణ వర్షపాతం 1,080 మిల్లీమీటర్లు. జిల్లాలోని 13 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వరికుంటపాడులో మైనస్‌ 78.8 శాతం, వింజమూరులో మైనస్‌ 68 శాతం, వలేటివారిపాళెంలో మైనస్‌ 66.9 శాతం వర్షపాతం నమోదైనట్లు అధికారుల రికార్డులు తెలియజేస్తున్నాయి. కేవలం కందుకూరు, ఉలవపాడుల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణంగా అక్టోబర్‌, సెప్టెంబర్‌ నెలల్లో వర్షాలు కురుస్తాయి. జూన్‌లో వర్షాలు కురిస్తే తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుంది. సోమశిల, కండలేరు, ప్రాజెక్టుల పరిధిలో కాలువల పారుదల ఉండడంతో ఆయా ప్రాంతాల్లో మాత్రమే భూగర్భ జలాలు కనిపిస్తున్నాయి. మిగిలిన చోట్ల భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి. వేలాది రూపాయలు ఖర్చు చేసి వేసిన బోర్లు 150 అడుగులకు నీటిమట్టం పడిపోయింది. జిల్లాలోని ఆత్మకూరు, వింజమూరు, ఎఎస్‌పేట, కనిగిరి, దుత్తలూరు, సీతారామపురం, వలేటివారిపాళెం మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. వర్షాలు కురువకపోతే కరువు పరిస్థితులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

                                                                  బేల్దారి పనులకు వెళ్తున్నాను

నేను మూడు ఎకరాల్లో నూగు వేశాను. వర్షాలు లేక ఎండిపోయింది. దీనిపై మండల అధికారులకు, సచివాలయ వ్యవసాయాధికారికి అనేకసార్లు విన్నవించాను. కనీసం వచ్చి పంటను చూడలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. పంటలేక బేల్దారి పనులకు వెళ్తున్నాను.
                                                                                           - శ్రీహరి, తాతిరెడ్డిపల్లి


                                                                9 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి

నేను ఆరు ఎకరాల్లో పొగాకు, మూడు ఎకరాల్లో మొక్కజొన్న వేశాను. వర్షాలు లేకపోవడంతో మొత్తం తొమ్మిది ఎకరాల్లోని పంటలు కళ్ల ముందే ఎండిపోయాయి. రూ.6 లక్షలు నష్టం వాటిల్లింది. ఎండిపోయిన మొక్కజొన్న తోటలోకి పశువులకు మేతకు వదిలాను.
                                                                                           -మోహన్‌, తాతిరెడ్డిపల్లి