- తడిసిన ధాన్యం
- నేలరాలిన మామిడి, మొక్కజొన్న
- పిడుగు పడి కౌలురైతు మృతి
ప్రజాశక్తి-యంత్రాంగం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులు బెంబేలెత్త్తుతున్నారు. ఈదురుగాలులలో వర్షం కురవడంతో పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న నేలవాలగా, వరి పనలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం రాశులు నీట మునిగాయి. మామిడి నేలరాలింది. పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా, రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి. పలుచోట్ల వరికుప్పలు దగ్ధమయ్యాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడులో పిడుగుపాటుకు కౌలురైతు ఏనుగుల నరసింహారావు (45) మృతి చెందారు. కళ్లంలోని మిర్చిపైరుపై పట్టాలు కప్పిన అనంతరం వాటిని సరి చేస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే ఆయన మరణించారు. వినుకొండ పట్టణంలో రేకుల షెడ్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు గాలికి కొట్టుకుపోయాయి. ఏనుగుపాలెం రోడ్డులో భారీ వృక్షం కూలిపోవడంతో కొద్దిసేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి సుమారు 200 ఎకరాల్లో మొక్కజొన్న నేలమట్టమైంది. రాజమహేంద్రవరం, రాజమహేంద్రరం రూరల్, కడియం, రాజానగరంలో భారీ వర్షం కురిసింది. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, మండపేట, రామచంద్రపురం మండలాల్లో వర్షాలకు వరి పనలు తడిసి ముద్దయ్యాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, సామర్లకోటలో రోడ్లు జలమయం అయ్యాయి. ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో మామిడికాయలు నేలరాలాయి. మొక్కజొన్న తడిసి ముద్దయింది. పోలవరంలోని పలువీధులు నీటమునిగాయి. బెస్తావీధి, కొత్తపేట, బాపూజీ కాలనీ, బిసి కాలనీ, మెయిన్ బజార్, కొత్త పట్టిసీమలో డ్రెయిన్లు పొంగిపొర్లాయి. పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడ రూరల్, జి.కొండూరు, మైలవరం, తిరువూరు, కృష్ణా జిల్లాలోని గన్నవరం, బాపులపాడు, కంచికచర్లలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట నేలవాలింది. మునగతోటల్లో చెట్లు విరిగిపడిపోయాయి. పిడుగులు పడి మూడుచోట్ల వరి కుప్పలు దగ్థమయ్యాయి. ధాన్యం రాశులు నీటమునిగాయి. పామర్రు మండలం పెదమద్దాలిలో పిడుగుపాటుకు రెండు పశువులు మృతి చెందాయి. తిరుపతి జిల్లా నిండలి, వెంకటరెడ్డిపల్లి, అంబల పూడి, చుట్టి, బాలాయపల్లిలో ఈదురుగాలులతో వడగళ్ల వర్షం కురిసింది. పలుచోట్ల వరి పంట నేలకు ఒరిగింది. మిర్చి కొమ్మలు విరిగాయి. మామిడి పిందెలు గాలులకు రాలిపోయాయి. అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.










