Jan 22,2023 11:35
  • ఎఒ పోర్టల్‌లో కనిపించని నూతన దరఖాస్తులు
  • కృష్ణా జిల్లాలో రైతు భరోసా
  • లబ్ధిదారులు 1,40,165 మంది
  •  పిఎం కిసాన్‌ లబ్ధిదారులు 44,665 మంది మాత్రమే

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన పథకానికి నూతనంగా దరఖాస్తు చేసుకోవడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. మీ-సేవా కేంద్రాలు, కామన్‌ సర్వీస్‌ సెంటర్ల ద్వారా పిఎం కిసాన్‌ వెబ్‌సైట్లో నమోదు చేసుకున్న రైతుల పేర్లు మండల వ్యవసాయ అధికారుల లాగిన్‌లో కనిపించడం లేదు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్లూర్పు గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు సమీపంలోని మీ-సేవా కేంద్రం ద్వారా పిఎం కిసాన్‌ పథకానికి నూతనంగా దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌ స్టేటస్‌లో పరిశీలిస్తే సబ్‌ డిస్టెక్ట్‌/బ్లాక్‌ లెవెల్‌ పెండింగ్‌ అని చూపుతోంది. మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆల్‌రెడీ అప్‌లోడ్‌ చూపుతూ దరఖాస్తును వెబ్‌సైట్‌ స్వీకరించడం లేదు. మండల వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే, రైతుల వివరాలు లాగిన్‌లో కనిపించడం లేదని చెప్పారు. ఈ రైతులు ముగ్గురే కాదు... ఈ మండలంలోనే కాదు జిల్లాలోని పలు మండలాల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగానూ నూతనంగా దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అత్యధికులు ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కొన్ని మండలాల్లో ఇటువంటి దరఖాస్తులు 50 వరకూ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు రైతులు కేంద్ర సాయానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో, ఈ పథకం ద్వారా ఎలా లబ్ధిపొందాలో తెలియక నూతనంగా దరఖాస్తు చేసుకుంటున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.

  • వైఎస్‌ఆర్‌ రైతు భరోసాలో మూడో వంతు మందికే...

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలతో విత్తనాలు, ఎరువుల ధరలు, ట్రాక్టర్‌ కిరాయిలు బాగా పెరిగిపోయాయి. వ్యవసాయం గిట్టుబాటు కాక, పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.7,500, పిఎం కిసాన్‌ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6 వేలు రైతులకు కొంత మేర ఊరట ఇస్తున్నాయి. మొదట్లో రైతు భరోసా జమవుతున్న రైతుల్లో అత్యధిక మంది పిఎం కిసాన్‌ యోజన ద్వారా లబ్ధి పొందారు. అయితే, ఆ తర్వాత వివిధ కారణాలను సాకుగా చూపి కేంద్రం అత్యధిక మంది రైతులను ఈ పథకానికి దూరం చేసింది. కృష్ణా జిల్లాలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా 1,40,165 మంది రైతుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి. నిబంధనలు, వడపోతల కారణంగా పిఎం కిసాన్‌ యోజన పథకం మాత్రం కేవలం 44,665 మంది (మూడో వంతు) రైతులకు మాత్రమే పరిమితమైంది. ఈ రైతులకు సైతం సకాలంలో పిఎం కిసాన్‌ యోజన నిధులు వారి ఖాతాల్లో జమ కావడం లేదు. సంక్రాంతి నాటికి మూడో విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన కేంద్రం ఆ తర్వాత వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు విడుదల చేసేదీ ఇంకా ప్రకటించలేదు.