
- 25 లక్షల ఎకరాలు బీడు
- 300 మండలాల్లో సమస్య శ్రీ సెప్టెంబర్‌తో ముగిసిన ఖరీఫ్
- స్పందన లేని సర్కారు శ్రీ అక్కడక్కడ సబ్సిడీ సీడ్‌తో సరి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్ రైతును కరువు తీవ్రంగా దెబ్బతీసింది. సీజన్ సెప్టెంబర్‌తో ముగియగా ప్రభుత్వ గణాంకాల ప్రకారమే సాధారణ సాగు విస్తీర్ణంలో 25 లక్షల ఎకరాలు సాగు లేక బీడు పడ్డాయి. అవి ఇవి అనే తేడా లేకుండా అన్ని పంటలూ గణనీయంగా తగ్గాయి. వర్షాభావంతో మెట్ట పంటలకు ప్రమాదం ముంచుకొచ్చింది. వేరుశనగ సాగు మునుపెన్నడూ లేని స్థాయికి క్షీణించింది. తృణ, పప్పు ధాన్యాలదీ అదే పరిస్థితి. వాణిజ్యపంట పత్తి ఇంతగా తగ్గడం ఇటీవలి కాలంలో ఇప్పుడే. డెల్టా కాల్వలకు ముందస్తుగా సాగునీరు విడుదల చేసినా, చెరువుల్లో కాస్తంత నీరు ఉన్నా, భూగర్భ జలాలు కొంత వరకు ఆశాజనకంగా ఉన్నా, ఉచిత విద్యుత్ ఇచ్చినా వరి సాగు సైతం తగ్గింది. ఈ ఏడాది రుతుపవనాలు అంతగా ఆశాజన కంగా ఉండవని, పైగా ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం నిర్లిప్తత ప్రదర్శించింది. జులై, ఆగస్టులలో కూడా తేరుకోలేదు. ఎప్పటికో రాయలసీమ, ఇతర కొన్ని మెట్ట ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు సబ్సిడీపై విత్తనాలివ్వాలని నిర్ణయించినా వాటి సేకరణ, పంపిణీ అస్తవ్యస్తంగా ఉంది. రైతులు ఆసక్తి చూపట్లేదన్న పేరిట నిలిపేశారు. సెప్టెంబర్ ముగిసినా కరువు మండలాల గుర్తింపు, అత్యవసర ప్రణాళికలు, వ్యవసాయ రుణాల వాయిదా, కొత్త రుణాల వంటి సహాయక చర్యలపై సర్కారులో స్పందన లేదు. మొన్న నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో కరువుపై కనీస మాత్రం చర్చ చేయలేదు.
30 శాతం ఖాళీ
సీజన్ ఆరంభం నుంచీ వర్షాభావం వెంటాడింది. అదనకు వానల్లేక సేద్యం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లు సాగింది. పంటల సాగుకు, వేసిన పంటల ఎదుగుదలకు కీలకమైన ఆగస్టులో చినుకు కరువైంది. వర్షానికి వర్షానికి మధ్య అంతరాయాలు (డ్రైస్పెల్స్) సేద్యాన్ని కుదేలు చేశాయి. సెప్టెంబర్‌లో అడపాదడపా కొన్ని చోట్ల వానలు పడ్డప్పటికీ అదను తప్పడంతో సాగుకు అంతగా ఉపయోగపడలేదు. ఎండుతున్న పంటలకు కాస్తంత ఊపిరి పోశాయంతే. ఇప్పటికి 86 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా 60.22 లక్షల ఎకరాల్లో వేశారు. దాదాపు ఒక వంతు వ్యవసాయ భూమి (30 శాతం) పంటల్లేక ఖాళీ పడింది. కాగా నిరుడు ఈపాటికి 76.42 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. గతేడాది కంటే ప్రస్తుతం 16 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. నార్మల్‌లో ఆహారధాన్యాలు 11 లక్షల ఎకరాలు తగ్గాయి. వరి 7 లక్షల ఎకరాల్లో తగ్గింది. వేరుశనగ 8.75 లక్షల ఎకరాల్లో, పప్పుధాన్యాలు 3.25 లక్షల ఎకరాల్లో, పత్తి 5.50 లక్షల ఎకరాల్లో తగ్గింది.
ఎండుతున్న పంటలు
ఎపిలో 679 మండలాలుండగా దాదాపు 300 మండలాల్లో కరువు ఉందని తెలుస్తోంది. సీజన్ ముగిసే సమయానికి సగటున రాష్ట్రంలో సాధారణ పరిస్థితి ఉంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 నాటికి సాధారణ వర్షపాతం 555.5 మిల్లీమీటర్లు కాగా 468.7 మిమీ కురిసింది. మైనస్ 15.6 శాతం. అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో తక్కువ వర్షం కురిసింది. 278 మండలాల్లో తక్కువ వర్షం నమోదైంది. చివరిలో అడపాదడపా కురిసిన వానలకు కరువు తగ్గినట్లు కనిపిస్తున్నా పంటల విషయంలో సమస్య ఎక్కువగా ఉంది. పంటలు సాగు కాకపోవడం ఒక ఎత్తు కాగా వేసిన పంటలు చేతికి రాని విధంగా ఎండిపోవడం మరో ఎత్తు. జులైలో 164 మండలాల్లో, ఆగస్టులో 406 మండలాల్లో తీవ్ర డ్రైస్పెల్ తిష్ట వేసింది. వేసిన పంటలు ఎండిపోయాయి. చాలా చోట్ల వేరుశనగ, మిరప వంటి వాటిని రైతులు దున్నేశారు. ఐదు జిల్లాల్లో 50 శాతానికిలోపు సాగు నమోదైంది. అన్నమయ్య 34 శాతం, సత్యసాయి, చిత్తూరు 39 శాతం వంతున, పల్నాడు 41 శాతం, ప్రకాశంలో 42 శాతం సేద్యం జరిగింది. వర్షాభావం, కరెంట్ కోతలతో వేసిన పంటలు ఎండుతున్నాయి.
