కొన్ని విషయాలకు ఉపోద్ఘాతం అక్కరలేదు. నేరుగా విషయంలోకి వెళ్ళొచ్చు. 2014 మే 16న బిజెపి పూర్తి మెజారిటీతో ఎన్నికల్లో గెలిచింది. అది ఊహించని ఆ పార్టీ కార్యకర్త, మోడీ వీరాభిమాని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. తట్టుకోలేక మూర్ఛపోయాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. తర్వాత అతను కోమాలోకి వెళ్ళాడు. కొంత కాలం తర్వాత కోమాలోంచి బయటపడి, బాహ్య పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాడు. ఇంతలో రౌండ్స్‌లో ఉన్న డాక్టరుగారు అక్కడికి వచ్చారు.
భారతదేశంలో పరిస్థితులన్నీ మారిపోయి ఉంటాయని, తమ ప్రియతమ నాయకుడు మోడీజీ అన్నీ చక్కదిద్ది ఉంటాడనుకుని, ఆ పేషంట్ కొన్ని ప్రశ్నలడిగాడు. ''డాక్టర్ గారూ! అవినీతి లేని ఈ స్వేచ్ఛా భారతం మీకు ఎలా అనిపిస్తోందీ? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అందరూ జైల్లో పడ్డారా? లేక ఇటలీ పారిపోయారా? గాలి సోదరులు, రాబర్ట్ వాద్రాలంతా ఏ జైల్లో ఉన్నారూ? సరే డాక్టర్ సాబ్, నేను లక్నోకు బుల్లెట్ ట్రెయిన్‌లో వెళ్ళొచ్చా? మోడీజీ ప్రారంభించి ఉంటారుకదా? పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని నల్లడబ్బంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఉంటుంది. స్విస్ బ్యాంక్ నుండి బోలెడంత డబ్బు మోడీజీ వెనక్కి తెప్పించి ఉంటారు కదా? ఈ దేశానికి పట్టిన దరిద్రం అంతా వదిలిపోయి ఉంటుంది...!''
మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పేషంట్ ప్రశ్నలు అడుగుతూ ఉంటే, డాక్టరు గుడ్లు మిటకరించి చూడటం తప్ప ఏమీ చేయలేకపోయాడు. అసలు దేశానికి పట్టిన దరిద్రమే ఆ పార్టీ అనీ, ఆ నాయకుడూ అనీ-ఆ కుర్ర డాక్టరు పేషంట్‌కు చెప్పలేకపోయాడు.
నాకు గొప్ప సంతోషంగా ఉంది డాక్టర్ గారూ! మోడీజీ ఒక్కొక్క భారతీయుడి ఖాతాల్లో రూ.పదిహేను లక్షలు వేసేసి ఉంటారు. నా అకౌంట్‌లో కూడా పడే ఉంటాయి. ఆ డబ్బు మా ఆవిడ ఏం చేసిందో-ఇంటికి వెళ్ళాక అడగాలి! ప్రతి భారతీయుడు మోడీజీయే తమకు జీవితకాలం ప్రధానిగా ఉండాలని కోరుకుని ఉంటాడు. వంట గ్యాసు ఉచితం. కూరగాయలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు అన్నీ ఉచితం... జీవితం ఎంత ఆనందకరంగా మారిందోకదా? ఎంతైనా నడుస్తున్నది మన ప్రభుత్వం కదా? ప్రతి భారతీయ పౌరుడికీ మేలు జరిగే ఉంటుంది! ఇక నా గురించి నాకు ఏమాత్రం బెంగలేదు డాక్టర్ సాబ్! అన్నీ మా మోడీజీ చూసుకుంటాడు.
గుక్క తిప్పకోకుండా, పట్టలేని ఆనందంతో మాట్లాడుతున్న పేషంట్ మాటలు నిలబడి వింటున్న ఆ అమాయక డాక్టరు మీద బాగా పనిచేశాయి. ఆయన సున్నిత మనస్కుడు. అందుకే తలదిమ్మెక్కి, కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. దేశంలోని సగటు మనిషి పరిస్థితి లాగా, ఈ కుర్ర డాక్టరు పని అయిపోయింది. విషయం తెలుసుకుని సీనియర్ డాక్టర్ పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. పడిపోయిన కుర్ర డాక్టరుకు ట్రీట్‌మెంట్ ప్రారంభించాడు.
... ... ...
''పాత మొబైల్ ఇచ్చేసి కొత్త మొబైల్ తీస్కోండి!'' అన్న ప్రకటన చూసి ఓ అమాయక ప్రాణి ఎగిరి గంతేశాడు. మోడీ చెప్పిన 'అచ్ఛే దిన్' అంటే ఇదేనేమో అనుకుని, ఎప్పటినుండో వాడుతున్న తన పాత ఆండ్రాయిడ్ ఫోన్ జేబులోంచి తీసి చూసుకున్నాడు. 'ఇది ఇచ్చేసి కొత్త ఫోన్ తెచ్చుకుందాం!' అనుకుని ప్రకటనలో ఉన్న అడ్రసుకు వెళ్ళాడు. అక్కడ అద్భుతమైన భవనమైతే ఉంది. కానీ, దుకాణమేదీ లేదు. ఆ భవనం ముందు ఇద్దరు మనుషులు కర్రలు పట్టుకుని ఉన్నారు. ఆ ప్రకటన గురించి వాళ్ళని అడిగాడు.
''అవును! ఆ ప్రకటన ఇచ్చింది మేమే! జై శ్రీరామ్'' అన్నాడొకడు. ''తిరు! నీ పాత ఫోను మాకు ఇచ్చెళ్ళు, పక్క వీధిలో మాదే మొబైల్ షాపుంది. అక్కడ కొత్తది కొను'' అని ఆర్డరు వేశాడు మరొకడు. ''నేను కొనుక్కోవడమేమిటీ? పాతది ఇస్తే కొత్తది ఇస్తామన్నారు కదా?'' అన్నాడు అమాయక ప్రాణి.
''అలా అని ప్రకటనలో ఉందా.'' అని మరొకడు గుడ్లురిమి చూశాడు. కర్ర పైకెత్తాడు కూడా!
''నీలాగా బాగా చదువుకున్నోళ్ళకు విషయం అర్థం కాదు. పాతది ఇచ్చేసి కొత్త మొబైల్ తీస్కోండి'' అన్నాం. అందులో తప్పు లేదు. వెళ్ళి కొనుక్కోరాదా? ఎవరు వద్దన్నారూ?'' అని దబాయించాడు ఒకడు.
''గప్‌చిప్‌గా ఇచ్చేసి వెళ్ళు, లేదంటావా తల పగులుతుంది జాగ్రత్త!'' అన్నాడు మరొకడు. దేశాన్ని నడుపుతున్న ఇద్దరు గూండాల్లాగానే ఉన్నారే వీళ్ళూ-అనుకుని, మరో మార్గం లేక పాత మొబైల్ వారికి ఇచ్చేసి, భయం భయంగా వెనుదిరిగాడు అమాయక ప్రాణి. 'అమ్మ బాబోరు డబుల్ ఇంజన్ అంటే ఇదా?' అనుకున్న అమాయక ప్రాణికి జ్ఞానోదయమైంది.
... ... ...
హిట్లర్ కాలంలో జర్మనీ ఒకరకంగా 'వెలిగి'పోయింది. ఆయనకు ఒక మతమంటే, ఒక వర్గమంటే గిట్టదు. వారిని శత్రువులుగా చూసేవాడు. హిట్లర్‌ను ఎవరైనా విమర్శిస్తే ఆయన అనుచరగణం తట్టుకునేది కాదు. ఆ కాలంలో ఉన్న మీడియా సంస్థలన్నీ విధిగా ఆయన పాటే పాడాల్సి వచ్చేది. ప్రత్యర్థుల్ని అన్ని రకాలుగా నిర్దాక్షిణ్యంగా తొక్కేసేవాడు. వాళ్ళని దేశద్రోహులని పిలిచేవాడు. దేశ ప్రజల సమస్యలన్నీ కేవలం తను మాత్రమే తీర్చగలనని చెప్పుకునేవాడు. ఆయన ప్రవేశపెట్టిన గొప్ప నినాదం 'గుటే టాగే కొమ్మెన్' (అచ్ఛే దిన్) మంచి రోజులొస్తాయని ఆశ కల్పించేవాడు. రేడియోలో ప్రసంగించడానికి తెగ ఉత్సాహపడేవాడు. ప్రసంగించే ముందు ఫ్రెండ్స్-బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (మిత్రోం-భాయియో! ఔర్ బహెనోం) అని సంభోదించేవాడు. ఫొటోలు దిగడానికి హిట్లర్ భలేగా ముచ్చటపడేవాడు. అడ్డంగా ఉన్న ఇతర దేశాధినేతల్ని పక్కకు లాగి కెమెరాకు ఫోజులిచ్చేవాడు కాదులెండి! అబద్ధాల్ని పచ్చి నిజాలన్నట్టు నమ్మించే ప్రయత్నం నిరంతరం చేస్తుండేవాడు. తను మాట్లాడటమే కాని, ఎదుటి వాడు చెప్తున్నదేమిటో అస్సలు వినిపించుకునేవాడు కాదు.
గమనిక: ఇవన్నీ నియంత హిట్లర్‌కు సంబంధించిన విషయాలే. వీటితో ఎవరికైనా, మరెవరైనా గుర్తుకొస్తే, తప్పు వారి విజ్ఞతదే, పరిజ్ఞానానిదే అవుతుంది! ఇది కేవలం హిట్లర్ వ్యక్తిత్వ చిత్రణే!
/ వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త /
డా|| దేవరాజు మహారాజు