Oct 16,2023 16:22

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం, వెండి.. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్‌లో నిర్వహించిన తనిఖీల్లో.. సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని పోలీసులు సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి ఆభరణలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. గాంధీనగర్‌ పరిధిలోని కవాడీగూడలో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు వనస్థలిపురంలో ఎల్‌బి నగర్‌ ఎస్‌ఒటి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.29.40 లక్షలు స్వాధీనం చేసుకొని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. అయ్యప్ప సొసైటీలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రూ.32 లక్షల నగదు పట్టుబడింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మరో రూ.పది లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇసి ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.