కరాచీ : పాకిస్తాన్‌లో శుక్రవారం సంభవించిన రెండు ఆత్మహుతి బాంబు పేలుళ్లలో 55 మంది మరణించారు. 70 మంది గాయపడ్డారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ ఒక మసీదులో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. మృతుల్లో ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా ఉన్నారు. ఈ ఘటన ఆత్మాహుతి దాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని బలూచిస్థాన్‌లోని మస్తుంగ్ జిల్లాలోని మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 52 మంది మృతి చెందగా, మరో 50 మందికి పైగా గాయపడినట్లు పాక్ మీడియా వెల్లడించింది. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ర్యాలీ పర్యవేక్షణ విధుల్లో ఉన్న డిఎస్‌పి నవాజ్ గాష్కోరి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. డిఎస్‌పి కారు వద్దే పేలుడు సంభవించినట్లు తెలిపారు. ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొ న్నారు. సూసైడ్ బాంబర్ డిఎస్‌పి కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఖైబర్ పఖ్తుంఖవా రాష్ట్రంలోని హంగు నగరంలోని ఒక మసీదులోనూ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.