Oct 08,2023 09:21
  • ఇరాన్‌పై 33-29తో గెలుపు
  • గంటపాటు నిలిచిన ఫలితం
  • ఆర్చరీ, క్రికెట్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌లో పసిడి

హాంగ్జౌ : ఆసియా క్రీడల్లో పురుషుల కబడ్డీ ఫైనల్‌ మ్యాచ్‌ ఉత్కంఠకు దారితీసింది. శనివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్‌ 33-29 పాయింట్ల తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. మరో నిమిషంలో మ్యాచ్‌ ముగుస్తుందనగా.. తీవ్రమైన హైడ్రామా చోటు చేసుకుంది. పాయింట్ల వద్ధ ఆటగాళ్లు పట్టుపట్టడంతో ఆటను దాదాపు గంటపాటు సస్పెండ్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత భారత్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్‌ ప్రారంభం నుంచి ఇరుజట్ల ఆటగాళ్లు పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. మ్యాచ్‌ ముగియడానికి 65 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉన్న దశలో భారత్‌ నుంచి కెప్టెన్‌ పవన్‌ రైడ్‌కు వెళ్లాడు. ఇది డూ ఆర్‌ డై. అయితే, పవన్‌ మాత్రం ప్రత్యర్థి ఆటగాళ్లను టచ్‌ చేయకుండా లాబీ మీదకు వెళ్లిపోయాడు. అతడిని ఆపేందుకు ఇరాన్‌కు చెందిన నలుగురు డిఫెండర్లూ వెళ్లిపోయారు. దీంతో లాబీ మీదకు ఇరాన్‌ ఆటగాళ్లు వచ్చినందుకు తమకు పాయింట్లు ఇవ్వాలని భారత్‌.. ఎవరినీ టచ్‌ చేయకుండా పవనే లాబీపైకి వెళ్లినందుకు అతడిని ఔట్‌గా ప్రకటించాలని ఇరాన్‌ పట్టుబట్టింది. ఇక్కడే అధికారులకు సంకట స్థితి ఎదురైంది. భారత్‌ ఆటగాళ్లు పాత రూల్స్‌ ప్రకారమే పాయింట్లు కేటాయించాలని డిమాండ్‌ చేయగా.. ఇరాన్‌ మాత్రం కొత్త రూల్స్‌ ప్రకారం తమకు పాయింట్‌ ఇవ్వాలని పేర్కొంది. ఇరు జట్ల సిబ్బంది వాదోపవాదాలు చేసుకుంటూ ఉండగా.. ఆటగాళ్లంతా మ్యాట్‌పైనే కూర్చొండిపోయారు. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం భారత్‌ను విజేతగా ప్రకటించడంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఇరాన్‌కు రజత పతకం, పాకిస్తాన్‌కు కాంస్య పతకం దక్కాయి. దీంతో ఆసియా క్రీడల్లో 2018లో మినహా 8సార్లు కబడ్డీలో భారత్‌ బంగారు పతకాన్ని ముద్దాడినట్లయ్యింది. అంతకుముందు ఉత్కంఠభరితంగా సాగిన మహిళల కబడ్డీ ఫైనల్లో భారత్‌ 26-25పాయింట్ల తేడాతో చైనీస్‌ తైపీని చిత్తుచేసి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ పతకంతో 19వ ఆసియా క్రీడల్లో భారత్‌ 'సెంచరీ' పతకాల మార్క్‌కు చేరుకుంది.
 

                                                                       పురుషుల క్రికెట్‌లో స్వర్ణం

పురుషుల క్రికెట్‌ జట్టు స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో మెరుగైన రన్‌రేట్‌తో భారత్‌ బంగారు పతకం దక్కింది. టాస్‌ గెలిచిన ఇండియా.. ప్రత్యర్థి ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన తర్వాత భారీ వర్షంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. గ్రౌండ్‌ చిత్తడిగా ఉన్న కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మెరుగైన రన్‌రేట్‌, ర్యాంకింగ్స్‌ ఆధారంగా భారత్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో పురుషుల క్రికెట్‌ జట్టుకు స్వర్ణ పతకం లభించగా.. ఆఫ్ఘని స్తాన్‌ జట్టుకు రజతం, బంగ్లాదేశ్‌కు కాంస్య పతకాలు దక్కాయి.
 

                                                                    జ్యోతి సురేఖకు మరో స్వర్ణం

ఆసియా గేమ్స్‌ 2023లో తెలుగు తేజం, విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం మరో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. శనివారం మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ కేటగిరీలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన చెవాన్‌సోపై 149-145 పాయింట్ల విజయం సాధించింది. మొదటి రౌండ్‌ నుంచీ వీరిద్దరి మధ్య పోటాపోటీగా పోరు సాగింది. మూడు రౌండ్ల తరువాత ఇద్దరూ దాదాపుగా సమవుజ్జీగా నిలిచారు. జ్యోతి సురేఖ-89, చెవాన్‌-87 పాయింట్లతో నిలిచారు. ఇదే పోరు చివరి రౌండ్‌ వరకూ కొనసాగడం తీవ్ర ఉత్కంఠతకు గురి చేసింది. గేమ్‌ చివరి రౌండ్‌కు వచ్చే సమయానికి రెండు పాయింట్లతో మాత్రమే ఆధిక్యతలో జ్యోతి సురేఖ నిలిచింది. జ్యోతి సురేఖ-142, చెవాన్‌ సో-140 పాయింట్లతో నిలిచారు. చివరి రౌండ్‌లో మాత్రం జ్యోతి సురేఖ ఆధిపత్యం స్పష్టంగా కొనసాగింది. ఒకేసారి నాలుగు పాయింట్లను సాధించింది. దీంతో జ్యోతి సురేఖ 146-140 పాయింట్ల తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని సాధించారు. కాంపౌండ్‌ ఆర్చరీ వ్యక్తిగత పురుషుల విభాగంలో ఓజాస్‌ ప్రవీణ్‌ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో అదితి కాంస్య పతకాన్ని చేజిక్కించుకోగా.. అభిషేక్‌ వర్మ రజత పతకాన్ని సాధించాడు.
           బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌ శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి సత్తా చాటారు. కొరియాకు చెందిన జోడీ ఛో-సోల్యీ, కిమ్‌ వొన్‌ హోపై కేవలం 57ని.లో గెలిచారు. భారత జోడీ 21-18, 21-16తో వరుససెట్లలోనూ కొరియా జోడీని చిత్తుచేశారు. దీంతో దీంతో వచ్చే వారం ప్రకటించే బిడబ్ల్యుఎప్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి వీరు చేరుకోనున్నారు. ఇక 41ఏళ్ల తర్వాత పురుషుల డబుల్స్‌లో భారత్‌కు పతకం దక్కింది. 1982లో లియోరరు దేశారు-ప్రదీఫ్‌ గాంధీ చివరిసారిగా కాంస్య పతకం సాధించారు. ఈసారి బ్యాడ్మింటన్‌ విభాగంలో టీమ్‌ విభాగంలో రజతం, వ్యక్తిగత విభాగంలో ప్రణరు కాంస్య పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే.
 

                                                                       రెజ్లింగ్‌, చెస్‌లో రజతాలు

పురుషుల రెజ్లింగ్‌ 86 కేజీల ఫ్రీ స్టైల్‌ విభాగంలో భారత రెజ్లర్‌ దీపక్‌ పూనియా రజత పతకం సాధించాడు. ఫైనల్లో ఇరాన్‌ రెజ్లర్‌ హసన్‌ యజ్దానీతో తలపడిన దీపక్‌ పూనియా 10-0 తేడాతో ఓటమిపాలై రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో విజయంతో యజ్దానీ స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. పురుషుల చెస్‌లో కూడా భారత్‌కు రజతం దక్కింది. విదిత్‌, అర్జున్‌, హరికృష్ణ తమ 9వ రౌండ్‌లో ఫిలిప్పీన్స్‌తో తలపడి రెండో స్థానానికి చేరడం ద్వారా రజతం గెలుచుకున్నారు. ఇరాన్‌ ఆటగాళ్లు అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని చేజిక్కించుకున్నారు.
         ఇక మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్న భారత మహిళలజట్టు ఈసారి జపాన్‌పై సమిష్టిగా రాణించింది. ఉత్కంభరితంగా సాగిన కాంస్య పతక పోరులో భారత్‌ 2-1గోల్స్‌ తేడాతో జపాన్‌ను చిత్తుచేసింది. తొలి రెండు క్వార్టర్లు పూర్తయ్యే సరికి ఇరుజట్లు 1-1గోల్స్‌తో సమంగా నిలిచాయి. నాల్గో క్వార్టర్‌ 50వ ని.లో భారత్‌ ఒక గోల్‌ చేయడంతో కాంస్య పతకం భారత్‌కు ఖాయమైంది. 14వ రోజు పోటీలు ముగిసేసరికి భారత్‌ రికార్డుస్థాయిలో 107పతకాలతో 4వ స్థానంలో నిలిచింది.