Oct 20,2023 09:37
  • అటకెక్కుతున్న సర్వే ఫలితాలు
  • మరుగునపడుతున్న వాస్తవాలు
  • బలహీనపడుతున్న గణాంక వ్యవస్థ

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా వాస్తవాలను కప్పిపెడుతోంది. అధికారిక సమాచారాన్ని తారుమారు చేస్తూ ప్రజలను మభ్యపెడుతోంది. గణాంకాలను రాజకీయ ఆయుధాలుగా మలచుకుంటూ ఎన్నికలలో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ చర్యల కారణంగా ఒకప్పుడు దేశానికే పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన జాతీయ గణాంక వ్యవస్థ ఇప్పుడు బలహీనపడిందని, విశ్వసనీయతను కోల్పోతోందని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌, ఆర్థికవేత్త జయతీ ఘోష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
          పాలకులకు ప్రజల జీవన స్థితిగతులపై కనీస పరిజ్ఞానం ఉండి తీరాలి. ఎందుకంటే వారి జీవితాలను బాగుచేయాలంటే ఆ అవగాహన అవసరం. ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వారు ఏం పని చేస్తున్నారు, ఎంత ఆర్జిస్తున్నారు, ఆదాయం - సంపదలో అసమానతలు, కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా, విద్య - నైపుణ్యం ఏ స్థాయిలో ఉన్నాయి వంటి వివరాలన్నీ ప్రభుత్వాలకు తెలియాల్సిన అవసరం ఉంది.
స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్‌ పాలకులు జరిపిన జనగణనలో కొంత మౌలిక సమాచారం లభించేది. 1950 తర్వాత గణాంక సేకరణలో పద్ధతులు మారాయి. స్థూల దేశీయోత్పత్తి వంటి జాతీయాదాయ సూచికలను అభివృద్ధి చేశారు. అలాగే ఆర్థిక ప్రణాళికలను రూపొందించారు. వినియోగ సర్వేల ఆధారంగా పేదరిక సూచికలను తయారు చేసి వెనుకబాటుతనాన్ని గుర్తించారు.
 

                                                                         సర్వే ఫలితాలలో గోప్యత

2014 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అత్యవసర సమాచారం లభ్యత, విశ్వసనీయతలో పలు నాటకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ ఆదాయ లెక్కింపునకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన సంవత్సరాన్ని మార్చడంతో ఈ మార్పులు ప్రారంభమయ్యాయి. పారిశ్రామిక ఉత్పత్తిని లెక్కించే పద్ధతి కూడా మారింది. దీంతో 'కాగితాల'పై ఉత్పత్తి బాగా పెరిగి మోడీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. 2017-18కి సంబంధించి కార్మికుల సంఖ్యపై చేసిన సర్వే ఫలితాలు 2018 చివరలో అందుబాటులో ఉన్నప్పటికీ 2019 ఎన్నికలు పూర్తయ్యే వరకూ వాటిని బయటపెట్టలేదు. ఎందుకంటే ఆ కాలంలో ఉద్యోగ కల్పన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండడమో లేదా తగ్గడమో జరిగింది. మరో దారుణమైన విషయమేమంటే 2017-18కి సంబంధించి వినియోగ వ్యయంపై జరిపిన సర్వే ఫలితాలను వెల్లడించేందుకు కూడా ప్రభుత్వం నిరాకరించింది. ఆ నివేదికను కొందరు మీడియా ప్రతినిధులు బయటపెట్టారు. 2011-12 నుంచి 2017-18 వరకూ గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గిందని, అదే సమయంలో పేదరికం పెరిగిందని ఆ సర్వే తెలిపింది. అప్పటి నుంచీ నేటి వరకూ దేశంలో వినియోగ సర్వే జరగనే లేదు. పేదరికం, ఆహార వినియోగం, అసమానతలు వంటి విషయాలలో వాస్తవాలు తెలుసుకోవాలంటే ఈ సర్వే జరపడం చాలా అవసరం. 2011-12 తర్వాత అంటే దశాబ్ద కాలం పాటు ఈ కీలక సూచికలపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. పేదరికంపై అత్యవసరమైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో నీతి ఆయోగ్‌ సొంత సూచికను అభివృద్ధి చేసింది. ఈ సూచిక ఏం చెబుతోంది? గత దశాబ్ద కాలంలో పేదరికం తగ్గిందట.
 

                                                                            2011 లెక్కలే ఆధారం

కోవిడ్‌ అనంతరం దేశంలో జనజీవనం సాధారణ స్థాయికి చేరినప్పటికీ జనగణనను వాయిదా వేయడానికి ప్రభుత్వం కోవిడ్‌ను సాకుగా చూపుతోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాతే జనాభా లెక్కల సేకరణ జరిపే అవకాశం ఉంది. ఇప్పుడు దేనికైనా 2011 జనగణన లెక్కలే ఆధారంగా ఉంటున్నాయి. అంటే మౌలిక సమాచారం లేకుండానే ప్రభుత్వం పనిచేస్తోందన్న మాట. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నించగా కేంద్రం అడ్డుకుంది.
 

                                                                                 ప్రణాళికలు సైతం...

ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలు కూడా బయటకు రావడం లేదు. గంగ కార్యాచరణ ప్రణాళిక నేటికీ విడుదల కాలేదు. 2019 - 21 సంవత్సరాలకు సంబంధించి జరిపిన కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలు ప్రభుత్వ వాదనకు భిన్నంగా ఉన్నాయి. దీనిని జీర్ణించుకోలేని మోడీ ప్రభుత్వం సర్వే సంస్థపై పసలేని ఆరోపణలు మోపి సస్పెండ్‌ చేసింది. తద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఉండే ఫలితాలను ప్రచురించవద్దని ప్రస్తుత సర్వే నిర్వాహకులకు పరోక్షంగా సంకేతాలు పంపింది. సర్వేలు నిగ్గు తేల్చిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకపోతే వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా విధానాలను రూపొందిస్తుందని జయతీ ఘోష్‌ ప్రశ్నించారు.