Oct 02,2023 12:19
  • 60 శాతం పిపిపిలోనే
  • త్వరితగతిన మెట్రో పనులంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజా హడావుడి

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన విశాఖలో మైట్రో పనులంటూ తాజాగా హడావుడి మొదలైంది. మెట్రో రైలు ప్రాజెక్టును ఇక్కడ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఇటీవల విశాఖకు వచ్చిన సందర్భంలో అధికారులకు ఆదేశాలిచ్చారు. అత్యంత త్వరలోనే నిర్మాణం ప్రారంభమవుతుందంటూ చెప్పారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు రాష్ట్ర విభజన హామీల్లో ఉంది. కానీ, ఇంతవరకూ కేంద్రం కిమ్మనలేదు. 2014 నుంచి సాంకేతిక పనులకు ఒక్కరూపాయినీ మోడీ సర్కారు విదల్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటానూ ఇవ్వలేదు. నాలుగు కారిడార్లుగా 76.9 కిలోమీటర్లలో రూ.14,309 కోట్ల వ్యయంతో విశాఖ మెట్రో నిర్మాణం జరగాల్సి ఉంది. మొత్తం ఈ వ్యయంలో 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 20 శాతం కేంద్రం భరించాల్సి ఉంది. మిగిలిన 60 శాతం నిధులను పిపిపిలో సమకూర్చుకోవాలన్నది డిపిఆర్‌లో పేర్కొన్నారు.
 

                                                                    మళ్లీ మెట్రో కదలిక దేనికి ?

2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2023 దసరా పండగ నాటికి విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు ఆఫీసు రానున్నదన్న ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా హడావుడి ప్రారంభించింది. ఈ మెట్రోలో ప్రధాన మెలిక చూస్తే కేంద్రమే సింహభాగం మొత్తం నిధుల్లో ఇవ్వాల్సి ఉండగా పిపిపి మోడ్‌లోకి దించేసింది. దీంతో, ప్రయివేట్‌ ఆపరేటర్లు ఆసక్తి చూపడం లేదని సమాచారం. డిపిఆర్‌ను టిడిపి హయాంలో పంపగా దాన్ని కేంద్రం తిరస్కరించింది. వైసిపి మరో డిపిఆర్‌ను తయారు చేసి కేంద్ర కేబినెట్‌ ఆమోదానికి పంపాల్సి ఉన్నా, ఇంతవరకూ ఆ పని జరగలేదు.
 

                                                                             అసలేం జరిగింది ?

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 అక్టోబర్‌ దసరా రోజున విశాఖలో ఎపి మెట్రో డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. 2024 నాటికే సగానికిపైగా ప్రాజెక్టు పూర్తవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ నాడు భరోసా ఇచ్చారు. కనీసం 6 నుంచి 7 ఏళ్లు పట్టే మెట్రోకు నేటికీ అతీగతీ లేకుండా పోయింది. అంతకు ముందు టిడిపి హయాంలో 2014లో తయారు చేసిన డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్‌) ప్రయివేట్‌ ఆపరేటర్‌ ఎవ్వరూ ముందుకు రాక తిరస్కరించబడింది.

                                                        కేంద్ర, రాష్ట్ర జాయింట్‌ వెంచర్‌ : యుజెఎంరావు

ఎపి రైల్‌ మెట్రో కార్పొరేషన్‌ (ఎపిఎంఆర్‌సి) విశాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ యుజెఎం.రావు మాట్లాడుతూ ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌ అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మెట్రో డిజైన్‌ను అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ (యుఎంటిసి) తయారు చేసి పంపిందని, దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించాల్సి ఉందని తెలిపారు.
 

                                                                          మెట్రో ప్రాజెక్టు ఇలా..

విశాఖలో మెట్రో నాలుగు కారిడార్లుగా విభజించబ డింది. అవి వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ - కొమ్మాది, గురుద్వారా - పాత పోస్టాఫీసు, తాటిచెట్లపాలెం - చినవాల్తేరు, కొమ్మాది - భోగాపురం లైన్లు. మెట్రో డిపిఆర్‌లో ఈ విషయాన్నే పేర్కొన్నారు. లైట్‌ మెట్రో, మోడ్రన్‌ ట్రామ్‌ల పేర మరో డిపిఆర్‌ కూడా విశాఖలో ఉంది.